close

సోమవారం, ఫిబ్రవరి 17, 2020

ప్రధానాంశాలు

తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ భవితవ్యం ఏమిటి?

● 27వ తేదీతో జీవీకే ఎంఆర్‌ సంస్థతో ముగియనున్న ఒప్పందం

● వాహనాలు అప్పగించాలని ఉద్యోగులకు నోటీసులు

● అగమ్య గోచరంగా సిబ్బంది పరిస్థితి

తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ పథకానికి గడ్డు పరిస్థితి ఏర్పడనుంది. దీన్ని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆస్పత్రిలో ప్రసవం అనంతరం తల్లీబిడ్డకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వారిని నేరుగా ఇంటికి చేర్చేందుకు ‘తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ వాహనాన్ని ఏర్పాటు చేసింది. అందులో భాగంగా గర్భిణిని ప్రసవానంతరం జాగ్రత్తగా ఇంటికి చేర్చేవారు. ప్రస్తుతం ఆ పథకానికి సంబంధించిన ప్రభుత్వ ఒప్పందం ఈనెల 27వ తేదీతో ముగియనుంది. తల్లులు, పిల్లల సంక్షేమం, ఉద్యోగుల భవితవ్యం ఎలా అని ప్రధాన చర్చగా మారింది.

ఈ నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

-న్యూస్‌టుడే, ఆలూరు గ్రామీణ, హాలహర్వి

తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ పథకాన్ని 2016 జనవరి 1వతేదీన గత తెదేపా ప్రభుత్వం ప్రారంభించింది. దీని ద్వారా ఎంతో మంది గర్భిణులను ప్రసవానంతం ఇంటికి క్షేమంగా చేర్చారు. వారి నుంచి ఒక్కరూపాయి కూడా వసూలు చేయకుండా అన్ని ఖర్చులు ప్రభుత్వమే భరిస్తూ వచ్చింది. దీనికి గాను జిల్లాలో 28 వాహనాలను ఏర్పాటు చేశారు. జిల్లా ఆస్పత్రిలో 5, ఆదోనిలో 4, నంద్యాల 4, ఆలూరులో 1, ఎమ్మిగనూరు 2, మిగిలిన కేంద్రాల్లో ఒక్కో వాహనం చొప్పున సేవలు అందిస్తున్నాయి. 50 కి.మీ పరిధిలో ఉన్న గ్రామాలకు ఈ వాహనాల ద్వారా సేవలు అందిస్తారు. ఈ పథకం రావడం వల్ల దూరాన్ని బట్టి వాహనానికి రూ. 1000 నుంచి రూ. 2 వేలకు బాడుగ చెల్లించాల్సి వచ్చేంది. ఆ కష్టాలన్నీ అప్పట్లో తప్పాయి. జిల్లాలో ప్రతినెలా 3 వేల మందిని ఆస్పత్రి నుంచి ఇళ్లకు చేర్చేవారు. ఈ పథకం వల్ల పేదవారికి ఎంతో మేలు జరింది. పథకం గడువు ముగుస్తుండంతో పేద తల్లుల సంక్షేమానికి ఇబ్బందులు ఎదురవుతాయన్న ఆందోళన సర్వత్రా నెలకొంది.

మరి ఉద్యోగులు పరిస్థితి...?: జీవీకే ఎంఆర్‌ సంస్థ ద్వారా చాలా మంది తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాల డ్రైవర్లుగా ఉద్యోగంలో చేరారు. ప్రస్తుతం జీవీకే ఎంఆర్‌ సంస్థ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ఈనెల 27తో ముగియనుంది. దీంతో సంస్థలో ఉన్నతాధికారులతో సహా రాష్ట్రంలో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ పథకంలో 279 మంది పనిచేస్తున్నారు. వీరికి ప్రతినెలా రూ. 7,193 వేతనం చెల్లిస్తూ వచ్చారు. ప్రస్తుం ఒప్పందం ముగియనుండటంతో సంస్థ వాహనాలను ఈ నెల 26వ తేదీన జిల్లాలో ఉన్న సంస్థ మేనేజర్లకు అప్పగించి వెళ్లాలని, ఆ సంస్థ ఉద్యోగులకు నోటీసులు అందించింది. తక్కువ జీతమైనా నాలుగేళ్లపాటు పనిచేసి ఎంతో మందికి సేవలు అందించాం. అలాంటిది తమను వెళ్లిపొమ్మని చెప్పడం వల్ల తమ కుటుంబాల పోషణ భారమవుతుందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం న్యాయం చేయాలి -అన్సర్‌ బాషా, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహన డ్రైవరు

నాలుగేళ్ల పాటు ఎంతో మందికి సేవచేసే భాగ్యం కలిగింది. ఇప్పుడు సంస్థ ప్రభుత్వంతో చేసుకున్న గడువు ముగిసిందని, ఇచ్చిన వాహనాలను అప్పగించి వెళ్లాలని నోటీసులు ఇచ్చారు. పేదలకు ఎంతో ఉపయోగపడే పథకాన్ని కొనసాగించాలి. తద్వారా మాకు ఉపాధి కల్పించాలి. ఇలాంటి సమయంలో ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరుతున్నాం.

ఉద్యోగులుగా గుర్తించాలి -ముల్లా మీరా, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహన డ్రైవరు

ప్రభుత్వం అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను నియమించేందుకు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. ఆ కార్పొరేషన్‌ ద్వారా తమను ఉద్యోగులుగా గుర్తించాలి. గతంలోనూ ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సైతం తల్ల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సంస్థ ఉద్యోగులను అవుట్‌ సోర్సింగ్‌ పరిధిలోకి తీసుకువచ్చి న్యాయం చేస్తామని చెప్పారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలి.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.