close

శుక్రవారం, ఆగస్టు 14, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వసూల్‌ రాజాలు!

చక్రం తిప్పుతున్న ముగ్గురు

● జిల్లా ఎస్పీకి ఫిర్యాదులు

 

న్యూస్‌టుడే, నెల్లూరు (వీఆర్సీ సెంటరు): జిల్లా పోలీసు శాఖలోని ట్రాఫిక్‌ విభాగంలో వసూళ్ల పర్వం నిరాఘాటంగా సాగుతోంది. ఈ శాఖలో ముగ్గురు కానిస్టేబుళ్లు చక్రం తిప్పుతున్నారు. బడ్డీకొట్టు నుంచి పెద్ద షాపింగ్‌ మాల్స్‌ వరకు ధరలు నిర్ణయించారు. నగరంలో ట్రాఫిక్‌ సమస్య లేకుండా చూడాల్సిన వారు మామూళ్లు దండుకొనే పని చేస్తున్నారు. ప్రతి నెలా రూ.లక్షల్లో వీరి ఆదాయం ఉంటుంది. దీనిపై దృష్టి సారించిన స్పెషల్‌ బ్రాంచి అధికారులు ట్రాఫిక్‌లో పలువురిని బదిలీ చేశారు. అయినా వీరి వసూళ్ల తీరులో మార్పు కనిపించలేదు. ఇటీవల జిల్లా ఎస్పీకి ఈ ముగ్గురి పేర్లతో సహా ఫిర్యాదులు అందాయి.

*ఇటీవల ట్రాఫిక్‌ పోలీసులను చూసి భయపడి ఆత్మకూరు బస్టాండు వద్ద ఓ ఆటో డ్రైవరు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కరోనా కాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సదరు డ్రైవరు ఆటోని ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లు ఆపగానే జరిమానా వేస్తారని భయపడి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.

*ట్రాఫిక్‌ విభాగంలో ముగ్గురు కానిస్టేబుళ్లు చక్రం తిప్పుతున్నారు. అన్నీ తామే అయి నడిపిస్తున్నారు. అక్రమ వసూళ్లు చేస్తూ అందరికీ పంచుతున్నారు. అందరిపై పెత్తనం చెలాయిస్తున్నారు. స్థాయి చిన్నదే అయినా అధికారుల్లా పెత్తనం చేస్తున్నారు. బడ్డీకొట్టు దుకాణం నుంచి పెద్ద పెద్ద మాల్స్‌ వరకు దండుకుంటున్నారు. వీరి వసూళ్లు నెలకు రూ.లక్షల్లోనే ఉంటుంది.

*ట్రాఫిక్‌లో వసూళ్లపై స్పెషల్‌ బ్రాంచి (ఎస్‌బీ)కి ఫిర్యాదులు వెళ్లడంతో పలువురిని బదిలీలు చేశారు. అయినా వారు అదే స్థానాల్లో పనిచేస్తున్నారు. గత ఎస్పీలు ట్రాఫిక్‌పై ఓ కన్నేసి ఏకంగా ఏడుగురిపై వేటు వేసిన దాఖలాలు ఉన్నాయి.

*నగరంలో నిత్యం ట్రాఫిక్‌ సమస్య పెరుగుతోంది. షాపింగ్‌ మాళ్లు, దుకాణాలు, హోటళ్లు తదితర వాటితో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. నగరంలోని శెట్టిగుంట రోడ్డు నుంచి వేదాయపాళెం వరకు వెళ్లాలంటే పట్టపగలే వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పెరుగుతున్న వాహనాల సంఖ్య, సిగ్నల్‌ వ్యవస్థ, ఫుట్‌పాత్‌లు లేకపోవడం, నిబంధనలు ఉల్లంఘించడం లాంటివి ట్రాఫిక్‌ సమస్యకు దారి తీస్తున్నాయి. ఏ ప్రాంతంలో అయితే ట్రాఫిక్‌ సమస్య ఉండదో ఆ ప్రాంతంలో పోలీసింగ్‌ కూడా బాగుంటుందనేది నానుడి. అయితే నెల్లూరులో మాత్రం వసూళ్లే లక్ష్యంగా కొందరు ట్రాఫిక్‌ పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రతి నెలా మామూళ్లపైనే దృష్టి పెడుతున్నారు. ఎన్నడూ లేనివిధంగా డైవర్షన్లు, దుకాణాల ముందు నో పార్కింగులు ఏర్పాటుచేస్తున్నారు. ప్యాకేజీ కుదిరితే అవే బోర్డులు తొలగిస్తుంటారు. ఇలా నగరంలో వీరి అక్రమ వ్యాపారం జోరుగా జరుగుతోంది. పెద్ద పెద్ద షాపింగ్‌ మాళ్ల నుంచి ప్రతి నెలా ప్యాకేజీలు, చిన్న దుకాణాల నుంచి మామూళ్లు, చివరకు ఆటోస్టాండ్‌ల నుంచి సైతం వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కృష్ణపట్నం పోర్టుకు వెళ్లే లారీలు, ప్రైవేటు ట్రావెల్స్‌, లారీలు, ఆటోలు, ట్యాక్సీలు, చిన్న దుకాణాల నుంచి కూడా ప్రతి నెలా మామూళ్లు వస్తున్నాయనేది ప్రధాన ఆరోపణ.

వారే కీలకం

నగరంలో సౌత్‌, నార్త్‌ ట్రాఫిక్‌ విభాగాలు ఉన్నాయి. ఈ రెండు విభాగాల్లో పనిచేసే ముగ్గురు కానిస్టేబుళ్లు మాత్రం ప్రాంతాలకతీతంగా తమ పనులు కానిస్తున్నారు. స్వయంగా వసూళ్లు చేసి ఉన్నతాధికారులకు చేరవేస్తున్నారు. ఈ విభాగంలో వీరి పేరు చెబితే హడల్‌. స్థాయి కానిస్టేబుల్‌ అయినా హుందాలో మాత్రం సీఐల కంటే తగ్గరు. వారు చెప్పిందే వేదంగా సాగుతోంది. ట్రాఫిక్‌ ఉన్నతాధికారులపై సైతం వారు పెత్తనం చెలాయిస్తుంటారు. ఆత్మకూరు బస్టాండు నుంచి ఆర్టీసీ బస్టాండు వరకు ప్రతి నెలా వచ్చే మామూళ్లు వీరు వసూలు చేసి అధికారులకు అందజేస్తున్నారని సమాచారం.

క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం

ట్రాఫిక్‌ విభాగంలో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకుంటాం. పరిశీలించి చర్యలు తీసుకుంటాం. పూర్తిస్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.భాస్కర్‌భూషణ్‌, జిల్లా ఎస్పీ

మరిన్ని వార్తలు

రూ.2 రోగాలు మెండు

జిల్లాలో అధికారుల లెక్కల ప్రకారం బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్స్‌(బీఐఎస్‌) అనుమతి పొందిన తాగునీటి ప్యాకెట్ల తయారీ కేంద్రాలు నాలుగు మాత్రమే ఉండగా- అవి లేకుండా మరో 100 కేంద్రాల్లో తాగునీటి ప్యాకెట్ల తయారీ జరుగుతోందని అధికారులే చెబుతున్నారు. ఒకసారి బీఐఎస్‌ ధ్రువపత్రం పొందిన తర్వాత.. ఏటా దాన్ని పునరుద్ధరించుకోవాలి. అధికారులు ఏటా ఆయా ప్లాంట్లలో తనిఖీలు నిర్వహించి.. ప్రమాణాలు పాటించిన వాటికే అనుమతులు ఇవ్వాలి. కానీ, అధిక శాతం ప్లాంట్ల నిర్వాహకులు ఇవేమీ పట్టించుకోకుండానే తమ పని కానిచ్చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. ఆహార తనిఖీశాఖ, పరిశ్రమల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, తూనికలు, కొలతల శాఖలు సంయుక్తంగా పరిశీలన చేపట్టి అనుమతుల్లేని, ప్రమాణాలు పాటించని తాగునీటి ప్యాకెట్ల తయారీ కేంద్రాలను మూయించాల్సి ఉన్నా..

ఆసుపత్రిలో అరగంటలో చేర్చుకోవాల్సిందే...

నెల్లూరు(వైద్యం), కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలో కొవిడ్‌ నిర్ధరణ పరీక్షల వేగాన్ని పెంచాలని, ర్యాపిడ్‌ టెస్టుల ఫలితాలు అరగంటలో, ట్రూనాట్‌ 24 గంటల్లో, ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల ఫలితాలు రెండు రోజుల్లో వెలువరించేలా దృష్టి సారించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం నెల్లూరు వచ్చిన ఆయన- మంత్రులు అనిల్‌కుమార్‌ యాదవ్‌, మేకపాటి గౌతమ్‌రెడ్డితో కలిసి నగరంలోని జడ్పీ సమావేశ మందిరంలో కొవిడ్‌-19 నివారణ చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముందుగా కలెక్టర్‌ చక్రధర్‌బాబు వైరస్‌ నివారణకు జిల్లాలో చేపడుతున్న చర్యలను మంత్రికి వివరించారు. మంత్రి మాట్లాడుతూ కొవిడ్‌ బాధితులను అర గంటలో ఆసుపత్రిలో చేర్చుకుని పడకలు కేటాయించాలని ఆదేశించారు. నాయుడుపేట, గూడూరు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న ల్యాబ్‌లను త్వరితంగా అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. జిల్లాలో ర్యాపిడ్‌ కిట్లు అయిపోతే ఎందుకు తెప్పించుకోలేదని అధికారులను ప్రశ్నించారు. నిర్ధరణ పరికరాలు ఏమైనా కావాలంటే మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పెరుగుతున్న కేసులకు అనుగుణంగా జిల్లాలోని కొవిడ్‌ ఆసుపత్రుల్లో 500, కేర్‌ సెంటర్లలో 1000 వరకు పడకల సామర్థ్యాన్ని పెంచాలని ఆదేశించారు. జిల్లాలో 1048 ఆక్సిజన్‌ పడకలు సిద్ధంగా ఉన్నాయని, మరో 458కి టెండర్లు పూర్తయ్యాయన్నారు. నెల రోజుల్లో మొత్తం 1506 అందుబాటులో ఉంటాయన్నారు. మందుల నిల్వ వివరాలనూ అడిగి తెలుసుకున్నారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్లకు వాటిని పంపిణీ చేయడంలో అలసత్వం తగదని హెచ్చరించారు. పోస్టుల భర్తీపైనా సూచనలు చేశారు. కరోనా బాధితులతో నిర్వహించిన వీక్షణ సమావేశంలో భోజనం నాణ్యత సరిగా లేదన్న విమర్శలు వస్తున్నాయని, దాన్ని సరిదిద్దుకోవాలన్నారు. ప్రసూతీ సేవలకు ఎక్కడా విఘాతం కలగకుండా ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లను త్వరితంగా గ్రౌండింగ్‌ పూర్తి చేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీ ప్రాంతాల్లో అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల ఏర్పాటును వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్లాస్మా దానానికి ప్రజలు ముందుకు రావాలని కోరారు.

తాజా వార్తలు

శుభకార్యానికి వెళుతూ మృత్యుఒడికి..

నెల్లూరు (వీఆర్సీ సెంటరు), న్యూస్‌టుడే: ఓ ప్రైవేటు ఆంబులెన్సు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన నగరంలోని మెడికవర్‌ ఆసుపత్రి వద్ద జరిగింది. బుజబుజనెల్లూరు వైఎస్సార్‌ నగర్‌లో ఉంటున్న సిద్ధవరపు హరిబాబు(50), జగదేవిపేటకు చెందిన చంద్రశేఖర్‌ స్నేహితులు. వీరిద్దరూ గురువారం చిత్తూరు జిల్లాలో జరిగే ఓ శుభ కార్యక్రమానికి వెళ్లేందుకు ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. జగదేవిపేట నుంచి బయల్దేరిన ద్విచక్ర వాహనం మెడికవర్‌ ఆసుపత్రి వద్దకు రాగానే ఓ ప్రైవేటు ఆంబులెన్సు ఢీకొంది. దీంతో బైక్‌ నడుపుతున్న హరిబాబుకు తీవ్రగాయాలయ్యాయి. అతన్ని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించగా మృతి చెందాడు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్‌ ఎస్సై రమణయ్య సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.