close

సోమవారం, జులై 22, 2019

తాజా వార్తలు

‘దస్త్రం’ ఇక భద్రం

రిజిస్ట్రేషన్‌ విధానంలో కంప్యూటరీకరణ

త్వరలో కొత్త సంస్కరణల అమలు

 జిల్లాలోని 24 కార్యాలయాలకు ప్రత్యేక యంత్రాలు

 
సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో దస్త్రాలు

 

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లో సంస్కరణలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగా ప్రతి కార్యాలయాన్ని కంప్యూటరీకరించి పాత దస్తావేజులను స్కాన్‌ చేసి సర్వర్‌లో భద్రపర్చనున్నారు. ఇప్పటికే పైలట్‌ ప్రాజెక్టు కింద గన్నవరం రిజిస్ట్రార్‌ కార్యాలయంలో చేపట్టిన ఈ విధానం సత్ఫలితాలు ఇవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు నిర్ణయించారు. దీనిలో భాగంగా ఇప్పటికే జిల్లాలోని అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు స్కానర్లు పంపిణీ చేశారు.

- న్యూస్‌టుడే, నంద్యాల పట్టణం

రిజిస్ట్రేషన్‌ విధానాన్ని పూర్తిగా కంప్యూటరీకరించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో 1999కి ముందు వరకు రాత విధానంలోనే డాక్యుమెంటేషన్‌ జరిగేది. ఆ తర్వాత నుంచి కంప్యూటరీకరణ వచ్చింది. 1999 ముందు రాత విధానం ద్వారా దస్త్రాలను భద్రపరిచేవారు. డాక్యుమెంట్‌ సంఖ్య, వాల్యూమ్‌ నంబరు(పుస్తకం), పేజీ నంబరుతోపాటు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో భద్రపరిచేవారు. ప్రస్తుతం ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల శాఖలో తీసుకువస్తున్న సంస్కరణల్లో భాగంగా పాత దస్తావేజులను స్కాన్‌ చేసి సర్వర్‌లో భద్రపరుస్తారు. ఎవరైనా తాము పోగొట్టుకున్న దస్త్రాలు కావాలంటే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లి సంబంధిత వివరాలను అధికారులకు అందిస్తే వారు వాటిని ఇస్తారు. ఇప్పటి వరకు 1999కి ముందు వివరాలు కావాలంటే క్రయ, విక్రయదారుల భూమి ఉన్న గ్రామం, సూచిక పుస్తకాన్ని బట్టి పత్రాలు ఎక్కడున్నాయో వెతికి వాటిని సరిచూసి ఆధారాలను పరిశీలించి సంబంధిత అధికారి సంతకంతో దరఖాస్తుదారునికి అందిస్తుంటారు. ఈ విధానమంతా సరిగా లేదు. రోజుల తరబడి సమయంతోపాటు అధికారుల ఆసక్తిని బట్టి వివరాలు వచ్చే పరిస్థితి ఉంది. కొన్నిసార్లు అధికారులు, ఉద్యోగుల మీద ఒత్తిడితోపాటు అదనపు పని భారం పడుతుంది. దీంతో ప్రభుత్వం నూతన విధానాన్ని అమలు చేసేందుకు నిర్ణయించింది.

జిల్లాలో ఎలాగంటే...

జిల్లాలో కర్నూలు, నంద్యాల జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో 24 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలున్నాయి. కర్నూలు పరిధిలో 14 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. కర్నూలు, కల్లూరు, ఆదోని, ఆలూరు, ఆస్పరి, నందికొట్కూరు, ఎమ్మిగనూరు, గూడూరు, ప్యాపిలి, కోడుమూరు, డోన్‌, పత్తికొండ, కోసిగి, ఓర్వకల్లు కార్యాలయాలు ఉన్నాయి. నంద్యాల జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయం పరిధిలో నంద్యాల, శిరువెళ్ల, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, బనగానపల్లి, బండిఆత్మకూరు, బేతంచర్ల, కోవెలకుంట్ల, పాణ్యం, అవుకు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. ఒక్కొక్క కార్యాలయం పరిధిలో వాల్యూమ్‌ నంబరు(పుస్తకం) కంప్యూటరీకరణ చేయాల్సినవి వేలల్లోనే ఉన్నాయి. నంద్యాల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం పరిధిలో 1175 పుస్తకాలు కంప్యూటరీకరణ చేయాల్సి ఉంది. అదే కల్లూరు కార్యాలయంలో 2,320కి పైగా ఉన్నాయి. ఆళ్లగడ్డలో 823, ఆత్మకూరు 765, బనగానపల్లి 687, బండిఆత్మకూరు 443, బేతంచర్ల 648, కోవెలకుంట్ల 845, పాణ్యం 729, అవుకు 539, ఆదోని 928, ఆలూరు 632, ఆస్పరి 621, నందికొట్కూరు 649, కర్నూలు 950, ఎమ్మిగనూరు 824, గూడూరు 623, కోడుమూరు 876, డోన్‌ 978, పత్తికొండ 668, కోసిగి 559 పుస్తకాల(వాల్యూం) చేయాల్సి ఉంది. జిల్లాలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో కూడా ఇంకా కంప్యూటర్‌లో నమోదు చేయని దస్త్రాలు వేలల్లో ఉన్నాయి. నూతన విధానం ద్వారా పాత దస్త్రాలన్నీ స్కాన్‌ చేసి కేంద్ర సర్వర్‌లో భద్రపరుస్తారు. పాత దస్త్రాలకు సంబంధించిన నకలు కావాలనుకున్నప్పుడు ఊరు, దరఖాస్తుదారుడి పేరు, రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న సమయం చెబితే డిజిటలైజేషన్‌ విధానం ద్వారా నకలు పొందేందుకు అవకాశం ఉంటుంది.

పెరుగనున్న పారదర్శకత

భూమి దస్త్రాల కంప్యూటరీకరణ ద్వారా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో పారదర్శకత పెరుగనుంది. స్థిరాస్తి క్రయ, విక్రయాల సమయాల్లో జరిగే మోసాలకు అడ్డుకట్ట పడనుంది. జిల్లా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో 1855 సంవత్సరం నుంచి భూమి దస్త్రాలు ఉన్నాయి. నాటి దస్త్రాలు కొన్నిచోట్ల చినిగిపోయి దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో దస్త్రాలన్నీ స్కాన్‌ చేసి సర్వర్‌లో భద్రపర్చడం వల్ల కొత్త వాటిని పొందే అవకాశం ఉంటుంది. రైతులు కూడా తక్కువ సమయంలోనే టైటిల్‌ బీమా, రుణాలు పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం భూమి దస్త్రాలన్నీ బ్లాక్‌ చైన్‌ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఒకే దగ్గరకు తీసుకురానున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలోని 24 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు స్కానర్లను పంపిణీ చేశారు. ఐ బాల్‌ బుక్‌ స్కానర్‌ పేరుతో వీటిని కార్యాలయాలకు చేర్చారు.

పని సులభం కానుంది

దస్త్రాల కంప్యూటరీకరణ గురించి ఇంకా మార్గదర్శకాలు రాలేదు. స్కానర్లు మాత్రం వచ్చాయి. త్వరలో ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ విధానంతో పని మరింత సులభం కానుంది. పారదర్శకత కూడా వస్తుంది. అందరికీ మేలు జరిగే అవకాశం ఉంది.

- బాలసుబ్రహ్మణ్యం, నంద్యాల సబ్‌ రిజిస్ట్రార్‌

https://betagallery.eenadu.net/htmlfiles/112702.html

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.