సైబోర్గ్‌ల కాలమిది
సగం మనిషి, సగం యంత్రం కలిసిన సైబోర్గ్ తరహా మానవులే భవిష్యత్తులో మనకి కనబడతారు. మెదడు చెప్పినట్టుగా యంత్రం నడుచుకునే రోజులు పోయి... మెదడులో అమర్చిన యంత్రాల కారణంగా శరీరం పనిచేసే రోజులు త్వరలో అత్యంత సహజంగా మారిపోతాయి. ఇప్పటికే ఆ పరిశోధనలు కార్యరూపం కూడా దాల్చాయి. మన శరీరంలో ఏదైనా అవయవానికి పక్షవాతం వస్తే.. మెదడులో అమర్చిన ఎలక్ట్రోడ్లు మెదడు నుంచి సంబంధిత అవయవానికి సంకేతాలు పంపి ఆ అవయవాలు సక్రమంగా పనిచేసేట్టుగా చేస్తాయి. వీటినే బీసీఐ(బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేసెస్)పరికరాలు అంటారు. వీటిని మన మెదడు చుట్టూ ‘బ్రెయిన్ మెష్’లాంటిది అమరుస్తారు. ఈ మెష్ అందించే సంకేతాలే మనల్ని నడిపిస్తాయంటే ఆశ్చర్యం లేదు. అప్పుడు మనం మనుషులమా? యంత్రాలమా? యంత్ర, మనుషులమా! ప్చ్..
|
డ్రైవర్లు అక్కర్లేని కార్లు
ప్రస్తుతం నడిచే పెట్రోల్, డీజిల్ కార్ల స్థానంలో పూర్తి స్థాయి ఎలక్ట్రికల్ కార్లు రోడ్లపై నడుస్తాయి. వీటికి పెట్రోల్ పోయక్కర్లేదు... డ్రైవర్ల అవసరం అసలే లేదు. వాటంతట అవే నడుపుకుంటాయి. రోడ్లమీద వెళ్తూ వెళ్తూ వాటంతట అవే ఛార్జింగ్ చేసుకుంటాయి. నిజానికి ఇది నిజం కావడానికి ఏళ్లూపూళ్లూ అవసరం లేదు. మరో ఏడాదిలో ఈ తరహా స్వయం చోదక కార్లు రోడ్లపైకి రానున్నాయి. ఇప్పటికే చైనాలో సౌరశక్తితో నడిచే ఛార్జింగ్ రోడ్లని నిర్మించారు. ప్రత్యేకించి ఛార్జింగ్ స్టేషన్ల అవసరం లేకుండానే ఈ రోడ్లు వాహనాలని ఛార్జింగ్ చేసిపెడతాయి. ఇవి ప్రపంచం మొత్తం అందుబాటులోకి వస్తే రవాణారంగంలో ఊహించని విధంగా పెనుమార్పులు వస్తాయి. రోడ్లమీద పడిన గుంతల్ని పూడ్చుకోవడం కోసం సంవత్సరాలు తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేదు. ఆ రోడ్లు వాటంతట అవే బాగు చేసుకుంటాయి. ఇంజినీర్లు సెల్ఫ్రిపేరింగ్ రోడ్స్‌కి శ్రీకారం చుడతారన్నమాట.
|
నిరుద్యోగులకు భృతి
మనుషుల ప్రమేయం లేకుండా రోడ్లు వాటంతట అవే నిర్మించుకుని బాగుచేసుకుంటే, డ్రైవర్ల అవసరం లేకపోతే ప్రపంచం మొత్తం ఇలా సూపర్ స్మార్ట్ అయిపోతుంటే మరి మనుషులేం చేస్తారు? ఖాళీగా ఉంటారు. అలాయితే ప్రభుత్వాలు వాళ్లకి ఓ పనిచూపించాల్సిన బాధ్యత ఉంది కదా అంటారా? అలా చూపించలేని పక్షంలో వాళ్లకి నిరుద్యోగ భృతి ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్(యూబీఐ)విధానాన్ని ప్రభుత్వాలు ప్రవేశపెడతాయని రూజ్వెల్ట్ ఇనిస్టిట్యూట్ తేల్చి చెప్పడమే కాకుండా అందుకయ్చే ఖర్చుని కూడా లెక్కకట్టి చెప్పడం విశేషం.
|
మనుషులకు సూపర్‌పవర్స్
మర మనుషులకి సాధ్యం కానీ... మనుషుల మేధస్సుకు మాత్రమే సాధ్యమయ్యేవి కొన్ని ఉంటాయి. అలాంటప్పుడు మనుషులపై ఒత్తిడి పడకుండా వాళ్లకి సూపర్పవర్స్ని అందించే యంత్రాలు కూడా వస్తున్నాయి. ఉదాహరణకి కార్ల కంపెనీల్లో పనిచేసే మనుషులు అధిక బరువులు ఎత్తుతూ, అదేసమయంలో మేధస్సును ఉపయోగించి పనిచేయాల్సిన సందర్భాలు ఉంటాయి. అలాంటప్పుడు మనుషులు ఒత్తిడిని తట్టుకునే విధంగా వేరబుల్ ఎక్సోస్కెలిటన్స్ తరహా పరికరాలు వస్తున్నాయి. ఇవి ధరించి పనిచేయడం వల్ల మనుషులు సూపర్ హ్యుమన్ పవర్స్‌గా అవతరిస్తారు. ప్రమాదకరమైన చోట్ల పనిచేసేవారికి ఈ ఎక్సో స్కెలిటన్స్ రక్షణ కల్పిస్తాయి.
|
అవయవాల కొరత లేకుండా
ఇప్పటికైతే త్రీడీ ప్రింటర్లు ల్యాబ్లవరకే పరిమితమయ్యాయి. త్వరలో అన్ని అవసరాలకీ వాటిని ఉపయోగించుకునే రోజులు రానున్నాయి. ముఖ్యంగా మానవ అవయవాల కొరతని ఈ త్రీడీ ప్రింటర్లు గణనీయంగా తగ్గిస్తాయని అంటున్నారు నిపుణులు. కృత్రిమ మానవ అవయవాలని తయారుచేసి అందించే త్రీడీ ప్రింటర్లకి గిరాకీ పెరగనుంది.
|
ట్రంప్ కల నిజం అవుతుందేమో
2118 నాటికి బహుశా మనం మన మకాంని భూమ్మీద నుంచి మార్స్ గ్రహంపైకి మార్చుకుంటామేమో! అలా నోరెళ్లబెట్టొద్దు. నిజమే. ట్రంప్ లాంటి వాళ్లు దీని గురించి ఇప్పుడిప్పుడు కలలుకంటుంటే... ఎలాన్మాస్క్ వంటివాళ్లు ఇప్పటికే ఆ దిశగా చొరవ తీసుకున్నారు. రానున్న వంద సంవత్సరాల్లో మార్స్‌పైకి మన ఆవాసాలు మారిపోతాయనడం మరీ ఆశ్చర్యపడాల్సిన విషయం కాదని అంటున్నాడు ఆస్ట్రోఫిజిస్ట్, యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాకు చెందిన ప్రొఫెసర్ జెయిమీ మాథ్యూస్. బంగారంలాంటి భూమిని వదులుకుని ఎందుకు ఇలా ఆ అరుణగ్రహంపైకి వెళ్లాల్సి వస్తోంది అనే అనుమానం రావొచ్చు. ఎందుకంటే భూమ్మీద రోజురోజుకు పెరుగుతున్న కర్బన ఉద్గారాలు భూమిని ఆవాసయోగ్యం కాకుండా చేస్తున్నాయి. రానున్న కాలంలో 240 బిలియన్ టన్నుల కార్బన్ భూమ్మీద పేరుకుపోతుంది. ఆ కారణంగానే రానున్న వంద సంవత్సరాల్లో భూ ఉష్ణోగ్రతలు అదుపు చేయలేనంతగా పెరిగిపోయి.. సముద్ర మట్టాలు నాలుగు అడుగులు వరకూ పెరగడానికి ఆస్కారం ఉంది. మంచు ఖండాల్లో మంచు పూర్తిగా కరిగిపోతుంది. దాంతో కోట్ల కొద్దీ ప్రజలకు భూమ్మీద చోటు లేకుండా పోతుంది. దాని ఫలితమే ఇతర గ్రహాలపై మన ఆవాసాల వెతుకులాట.
|
సూపర్ మెటీరియల్స్
అవి దూదికంటే తేలిగ్గా ఉంటాయి. స్టీల్ కంటే 200 రెట్లు బలంగా ఉంటాయి. కాలం తీరితే భూమిలో కలిసిపోతాయి. ఫోన్ తెరల నుంచి సూపర్ కంప్యూటర్ల తయారీ వరకూ దేనికయినా ఉపయోగపడతాయి. ప్లాస్టిక్‌లా ఇబ్బంది పెట్టవు. అటువంటి సూపర్ మెటీరియల్స్ మనకు అందుబాటులోకి రానున్నాయి. ఈ తరహా లక్షణాలతో ఇప్పటికైతే గ్రాఫీన్ మాత్రమే ఉందికానీ త్వరలో మరిన్ని సూపర్ మెటీరియల్స్ మనకు అందుబాటులోకి రానున్నాయి.
|
టైలర్‌మేడ్ మందులు- జీన్ ఎడిటింగ్
జలుబు వస్తే సిట్రిజన్, జ్వరం వస్తే డోలో... మరో జబ్బుకి మరో ముందు... ఇలా ఒక జబ్బుకు ఒకే రకం మందులు అనే విధానానికి చెల్లుచీటీ పడతుంది. ప్రతి మనిషికి తన వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా మందుల్ని అందుకునే రోజులు రానున్నాయి. ఒక వ్యక్తి జన్యుచరిత్ర, అతనుండే వాతావరణ పరిస్థితులు, అతని జీవనశైలిని పరిగణనలోకి తీసుకుని అందుకు తగిన విధంగా మందులు తయారుచేస్తారు. ముఖ్యంగా జీన్ ఎడిటింగ్ ప్రక్రియకి ప్రాధాన్యత పెరుగుతుంది. దాంతో జన్యుపరంగా వచ్చే వ్యాధులని చాలామటుకు నివారించగలుగుతారు. క్యాన్సర్‌ని, వ్యాధినిరోధక శక్తికి సంబంధించిన జబ్బులని అడ్డుకుంటారు. అందుకు మూలకణాలని వీలైనంత ఎక్కువగా సద్వినియోగం చేసుకుంటారు. అండాలని దాచిపెట్టడం... వాటిని ఉపయోగించుకుని గర్భం దాల్చడం అనేది రానున్న రోజుల్లో సామాన్యంగా మారుతుంది.
|