close

సంపాదకీయం

జై కిసాన్‌!

రుగాలం స్వేదం చిందిస్తూ కష్టాలే పెట్టుబడిగా నష్టాలే దిగుబడిగా కోట్లాది సాగుదారులు దశాబ్దాల తరబడి జీవనభద్రత కొరవడి కునారిల్లుతున్న వ్యవసాయ ప్రధాన దేశమిది. కేంద్రం ఎంత కప్పిపుచ్చజూసినా గ్రామీణార్థికం నీరసించి గిరాకీ తెగ్గోసుకుపోయి చాపకింద నీరులా మాంద్యం విస్తరించిన దశలోనైనా- రేపటి కేంద్ర బడ్జెట్‌ సరైన దిద్దుబాటు చర్యలకు వేదికవుతుందా అన్న శంకలు ముమ్మరిస్తున్నాయి. భారత్‌కు స్వాతంత్య్రం లభించి 75 సంవత్సరాలయ్యే చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయాలన్న ఘనతర లక్ష్యం కొన్నాళ్లుగా మోతెక్కుతోంది. వాస్తవంలో నష్టదాయక సేద్యం అన్నదాత మెడకు ఉరితాళ్లు పేనుతూనే ఉందని, కాడీ మేడీ వదిలేసి వేరే బతుకు తెరువుకు రైతుల వెంపర్లాట కొనసాగుతూనే ఉందని సర్కారీ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వాల రాయితీ రుణ పథకాలు గ్రామీణ వ్యవసాయదారులకు సవ్యంగా చేరడం లేదంటున్న ‘గావ్‌ కనెక్షన్‌’ అధ్యయన నివేదిక, 48 శాతం రైతులు సేద్యంలో తమ బిడ్డల్ని కొనసాగనివ్వబోమంటున్నారని తాజాగా నిర్ధారించింది. ఎగుమతులే వెన్నుదన్నుగా ఆసియా పులులనిపించుకుంటున్న చైనా, కొరియా, తైవాన్‌ వంటి దేశాలకు, ఇండియాకు మౌలికంగా ఒక భేదముంది. వాటికి భిన్నంగా భారత్‌ది వినియోగ ప్రధాన వ్యవస్థ. మూడింట రెండొంతుల దేశ జనాభా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, నేటికీ 54 శాతం జనావళికి వ్యవసాయమే ముఖ్య జీవనాధారం. సగానికి పైగా సేద్య కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయని ఎన్‌ఎస్‌ఎస్‌ఓ (జాతీయ నమూనా సర్వే కార్యాలయం) లెక్క చెబుతోంది. పల్లెపట్టుల్లో నైరాశ్యం చెల్లాచెదురై, రైతులూ వ్యవసాయ కూలీల కొనుగోలు శక్తి పెంచే ఉద్దీపన చర్యలు చురుకందుకుంటేనే- దేశార్థికం కుదుటపడగలిగేది. బడ్జెట్లో సేద్యానికి ఊతమివ్వడమన్నది రైతాంగానికేదో మహోపకారం చేసినట్లు కాదు, మాంద్యం ఊబినుంచి దేశాన్ని క్షేమంగా గట్టెక్కించడానికి... అదే- తక్షణ కర్తవ్యం!

శత్రువును పారదోలే వీర సైనికుడికి, జాతిజనుల ఆకలిబాపే రైతుబిడ్డకు సమ ప్రాధాన్యమిచ్చి దేశ ప్రధానిగా లాల్‌బహదూర్‌ శాస్త్రి ‘జై జవాన్‌ జై కిసాన్‌’ అని నినదించారు. ఆ స్ఫూర్తికి పట్టంకట్టే ప్రణాళికాబద్ధ చర్యలు కొల్లబోయి, జీవితాలనే పణంపెట్టే దుస్థితిలో అన్నదాతలెందరో విలవిల్లాడుతున్నారు. పోనుపోను పెట్టుబడి వ్యయం ఇంతలంతలవుతుండగా ఖర్చుపెట్టిన మొత్తాన్నయినా రాబట్టుకోలేని దురవస్థ వారి వర్తమానాన్ని విషాదభరితం చేసి, భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఆహార పంట వరి సాగుచేసే రైతులు ప్రతి ఎకరాకూ పెట్టుబడిలోనే ఆరు వేల రూపాయల దాకా నష్టపోతుంటే- ఏం తినాలి, ఎలా బతకాలి? పత్తి, సోయాచిక్కుడు, పొద్దుతిరుగుడు పువ్వు వంటి పంటల ఉత్పత్తి వ్యయానికి, కేంద్రం విదిపే కనీస మద్దతు ధరకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. రైతు ఆదాయం పెంచేందుకు విపణి సేవల్ని అందుబాటులోకి తేవాలని, వైపరీత్యాల వేళ ఆర్థికంగా తగినంత తోడ్పాటు అందించాలని నాలుగేళ్లనాడు జాతీయ కర్షక సంఘాలు ప్రధాని మోదీకి మొరపెట్టుకున్నాయి. వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్‌ కోసం కేంద్రం ప్రవేశపెట్టిన ప్రతిష్ఠాత్మక ఈ-నామ్‌ (ఎలెక్ట్రానిక్‌ జాతీయ వ్యవసాయ విపణి) వ్యవస్థ ఇప్పటికీ సవ్యంగా కుదురుకున్న దాఖలాలు లేవు. సేద్య రంగాన విస్తృత పరిశోధనలు, పెట్టుబడుల పెంపుదల ఎండమావుల్ని తలపిస్తున్నాయి! రైతుహితాన్ని, జాతి ఆహారభద్రతను అనుసంధానించి పొరుగున జనచైనా ధీమాగా ముందడుగేస్తోంది. ఏ దశలోనూ రైతుల ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతినకుండా ఇజ్రాయెల్‌ నుంచి అమెరికా వరకు ఎన్నో దేశాలు అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకుంటున్నాయి. అదే ఇక్కడ- రైతుల కష్టానికి సరైన గిట్టుబాటు కల్పిస్తే ధరోల్బణానికి రెక్కలు మొలుస్తాయంటూ ప్రభుత్వాలు పొద్దుపుచ్చుతున్నాయి. సాధారణంగా అత్యధిక కుటుంబాల బడ్జెట్లో ఆహారానిదే తొలి పద్దు. దాన్ని జాతికందించే అన్నదాతల ప్రయోజనాల పరిరక్షణకు బడ్జెట్లలో సమధిక ప్రాధాన్యం దక్కకపోవడమే విషాదం!

భారత్‌కన్నా తక్కువ సేద్య యోగ్యభూములు కలిగిన చైనా స్వీయ ఆహార అవసరాల్లో 95 శాతం దాకా సొంతంగా తీర్చుకుంటోంది. విస్పష్ట పంటల ప్రణాళిక అన్నది లేని ఇండియా పప్పుదినుసులు, వంటనూనెలనే కాదు- ఉల్లిపాయల్ని సైతం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం చూస్తున్నాం. అయిదేళ్ల వ్యవధిలో దేశీయంగా సాగువిస్తీర్ణం 60 లక్షల ఎకరాల మేర కుదించుకుపోయిందని నిరుటి సేద్య గణన స్పష్టీకరించడం తెలిసిందే. దేశంలో పెద్దయెత్తున పోగుపడిన వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు అలసత్వానికి చిరునామాలైన పర్యవసానంగా- ఏటికేడు దిగుబడుల క్షీణతతో వివిధ దేశాల సరసన భారత్‌ వెలాతెలాపోతోంది. రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకంటూ కేంద్రం ఏడంచెల కార్యాచరణ వ్యూహం ప్రకటించిన తరవాతా క్షేత్రస్థాయిలో పరిస్థితి తేటపడలేదు, పొలాల్లో సంక్షోభాలు సద్దుమణగలేదు. రుణవసతి, మార్కెట్‌ సదుపాయాలు, బీమా రక్షణలపై అరకొర చర్యలు మినహా సమగ్ర దిద్దుబాటు వ్యూహాలు ఎంతకూ పట్టాలకు ఎక్కడం లేదు. భూమి ధరను, కౌలువ్యయాన్ని పరిగణనలోకి తీసుకోవడం కుదరదన్న నీతిఆయోగ్‌ వాదనకే ఓటేసి- కూలీలపై ఖర్చును, ఎలుకలు తదితరాల వల్ల వాటిల్లుతున్న నష్టాల్నీ గాలికొదిలేసి సీఏసీపీ (జాతీయ వ్యవసాయ వ్యయ ధరల కమిషన్‌) సిఫార్సుల ప్రాతిపదికన ప్రకటిస్తున్న ‘మద్దతు’ అక్షరాలా క్రూరపరిహాసం. ఈ దారుణ అవ్యవస్థ ఇలాగే కొనసాగడం, దేశ ఆహార భద్రతకే తీవ్రాఘాతం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా కళ్లు తెరవాలి. రైతు శ్రమకు సరైన గిట్టుబాటు లభిస్తేనే గ్రామీణ భారతం తేరుకుంటుంది. దేశార్థికం తెప్పరిల్లుతుంది. ‘జై కిసాన్‌’ స్ఫూర్తితో ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్లు రూపుదాల్చి శాస్త్ర సాంకేతికత పొలంగట్లకు చేరువైనప్పుడే- అన్నదాతల బతుకుల్లో అసలైన సంక్రాంతి, జాతికి స్థిర అభ్యున్నతి!

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.