గాడి తప్పిన పట్టణీకరణ

సంపాదకీయం

గాడి తప్పిన పట్టణీకరణ

ప్రపంచీకరణ నేపథ్యంలో నగరాలు, పట్టణాలు దేశార్థికానికి చోదక శక్తులుగా అవతరించాయి. ఉపాధి అవకాశాలకు ప్రధాన కేంద్రాలై- పోనుపోను ఇంతలంతలవుతున్న వలసలతో అవి కిక్కిరిసిపోతున్నాయి. పెరుగుతున్న జనాభాకు తగినట్లుగా తీరైన పట్టణాభివృద్ధి ప్రణాళికలు కొరవడి సమస్యలకు నిలయాలుగా మారుతున్నాయి. దేశవ్యాప్తంగా 52శాతం పట్టణాలు, నగరాలకు సరైన ప్రణాళికలు లోపించాయని నీతి ఆయోగ్‌ తాజాగా కుండ బద్దలుకొట్టింది. క్రమబద్ధమైన పట్టణీకరణ, మౌలిక వసతుల కల్పనలో సవాళ్లు ముమ్మరిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేసింది. అందుబాటులో ఉన్న భూమిని గరిష్ఠంగా సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్తు అవసరాల మేరకు సదుపాయాల వృద్ధిపై దృష్టిసారించడం పట్టణ ప్రణాళికల మౌలిక లక్ష్యం. వాటికి సంబంధించిన దేశీయ విధానాలు చాలా వరకు బ్రిటిష్‌ వలస పాలన నుంచి వారసత్వంగా సంక్రమించినవే. కొద్దిపాటి నగిషీలతో ఏళ్ల తరబడి అవే అమలవుతున్నాయి. స్థానిక అవసరాలు, ఆర్థిక పురోభివృద్ధికి తోడ్పడేలా వాటిలో కాలానుగుణంగా మార్పుచేర్పులు అవసరమన్నది నీతి ఆయోగ్‌ సిఫార్సు. ప్రభుత్వ రంగంలో పట్టణ ప్రణాళికావేత్తల కొరతనూ ఆ సంస్థ ప్రస్తావించింది. పెద్ద సంఖ్యలో పోగుపడిన ఖాళీలను సత్వరం భర్తీ చేయాలని సూచించింది. దేశవ్యాప్తంగా పట్టణ ప్రణాళికలు కొల్లబోవడానికి ప్రభుత్వ యంత్రాంగంలో మేటవేసిన అవినీతి, అసమర్థత ప్రధాన కారణాలవుతున్నాయి. అవినీతి తిమింగిలాల కాసుల దాహానికి చెరువులు, నాలాలు కుంచించుకుపోతున్నాయి. కొద్దిపాటి వర్షాలకే నగరాలు వరదనీటి సంద్రాలవుతున్నాయి. ఇక నగరాల మౌలిక ప్రణాళికలకు తూట్లుపొడిచే అక్రమ నిర్మాణాల కథ... అంతులేని వ్యధ. ఆ మేరకు భాగ్యనగరంలో పెచ్చరిల్లుతున్న నిబంధనల ఉల్లంఘనపై తెలంగాణ హైకోర్టు నిరుడు కన్నెర్రచేసింది. ఏపీలోని అన్ని పురపాలక, నగరపాలక సంస్థల పరిధిలో దాదాపు ఆరు వేల అక్రమ నిర్మాణాలు పుట్టుకొచ్చిన బాగోతం గతేడాది వెలుగుచూసింది. అక్రమార్కులకు అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వాల అలసత్వమే పట్టణాలకు పెనుశాపంగా మారుతోంది!

ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ గరిష్ఠంగా సాగుతున్న దేశాల జాబితాలో ఇండియా తొలి వరసలో ఉంది. ఈ దశాబ్దం చివరి నాటికి దేశీయంగా పట్టణ జనాభా 60 కోట్లకు పైబడి, 2050కల్లా 85 కోట్లకు మించి ఎగబాకనుందని పలు అధ్యయనాలు చాటుతున్నాయి. వాస్తవ అవసరాలకు అనుగుణంగా వాటిలో మౌలిక వసతుల కల్పన జోరందుకోవాలి. నగర జీవనమంటేనే కాలుష్య కాసారంలో ఉక్కిరిబిక్కిరి కావడమనే భావన జనసామాన్యంలో నాటుకుపోయింది. దాన్ని దూరం చేసేలా ఆరోగ్యకరమైన నగరాలకు రూపునివ్వాలన్నది నీతి ఆయోగ్‌ మేలిమి సూచన! వాతావరణ మార్పుల పాపంలో సింహభాగం వాటా నగరాలదేనని ఐక్యరాజ్య సమితి లోగడే తేల్చిచెప్పింది. విశ్వవ్యాప్తంగా 78శాతం ఇంధన వనరులను అవే వినియోగించుకొని, 60శాతానికి పైగా ప్రమాదకర కర్బన ఉద్గారాలను విడుదల చేస్తున్నాయి. ఫలితంగా వేడి గాలులు, భీకర వర్షాలు విజృంభిస్తూ జనావళిని బెంబేలెత్తిస్తున్నాయి. ఈ దుస్థితి సమసిపోవాలంటే, పట్టణాలకు హరిత శోభను సంతరింపజేసేలా ప్రణాళికలు పదునుతేలాలి. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగమూ జోరందుకోవాలి. చిన్న నగరాల అభివృద్ధితో మేలిమి ఫలితాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఆ దిశగానూ పాలకులు దృష్టిసారించాలి. స్థానిక అవసరాలకు సంబంధించి పౌర సమాజ అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకోవాలి. నీతి ఆయోగ్‌ సిఫార్సు చేసినట్లు- దేశ ప్రణాళికా చట్టాల నవీకరణ అత్యావశ్యకం. అందుకోసం రాష్ట్రాల్లో ఉన్నత స్థాయి సంఘాలను సత్వరం కొలువుతీర్చాలి. ప్రగతికి ప్రతిబంధకాలవుతున్న ప్రణాళికా లోపాలను సరిదిద్దడంలో పాలకులు కంకణబద్ధులైతేనే- సుస్థిరాభివృద్ధికి పట్టుగొమ్మగా పట్టణభారతం కాంతులీనగలుగుతుంది!


మరిన్ని

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న