close

ప్ర‌త్యేక క‌థ‌నం

కలాం మాట ఇస్రోకి బంగారు బాట

‘కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి’ ఇవి మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం చెప్పిన మాటలు. ఆయన మాటలను అచ్చు గుద్దినట్లు ఇస్రో పాటించింది. యావత్ భారతీయులందరి కలలు ఒక్క ఇస్రోనే కనింది. ఆ కల పేరే చంద్రయాన్‌-2. దీన్ని సాకారం చేసుకోవడానికి ఇస్రో శాస్త్రవేత్తలు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సుమారు 16 వేల మంది కష్టం చంద్రయాన్‌-2. భారతీయులందరూ గర్వంగా తలెత్తుకునేలా చంద్రయాన్‌ను చంద్రుడిపైకి పంపింది. అయితే, తానొకటి తలిస్తే దైవమొకటి తలిచినట్లు.. ఆఖరి క్షణంలో చంద్రయాన్‌ ల్యాండర్‌ విక్రమ్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తి సంకేతాలు తెగిపోయాయి. చంద్రుడి మీదికి ల్యాండయ్యే 15 నిమిషాలు ఎంతో క్లిష్టమైనవని ఇస్రో ఛైర్మన్‌ కె.శివన్‌ ముందే చెప్పారు. 14 నిమిషాల పాటు సజావుగానే సాగినా.. కోట్లాది మంది భారతీయుల తరఫున ఇస్రో కన్న కల  నిమిషంలోనే చెదిరిపోయింది. ప్రతిష్ఠాత్మక ఘట్టాన్ని టీవీలకు అతుక్కుపోయి చూస్తున్న భారతీయుల ముఖాల్లో నైరాశ్యం ఆవహించింది. ఇస్రో చరిత్రలో ఇది ఒక్కటే కాదు.. కలాం హయాంలో 1979లోనూ ఇలాంటి వైఫల్యాన్ని చవి చూసింది. ఆ సమయంలో కలాం కుంగిపోలేదు. పైపెచ్చు ప్రతి ఒక్కరిలోనూ స్ఫూర్తి నింపేలా నడుచుకున్నారు. అప్పుడు జరిగిన ఆ ఘటన గురించి  2013లో జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు. ఆ మాటలు వింటే ఎవరికైనా వంద కప్పుల కాఫీ తాగిన ఎనర్జీ రాకుండా మానదు.

‘‘అది 1979 సంవత్సరం. ఎస్‌ఎల్‌వీ-3 ప్రయోగం కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆ సమయంలో భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం ప్రాజెక్టు డైరెక్టర్‌గా, సతీష్‌ ధావన్‌ ఇస్రో ఛైర్మన్‌గా ఉన్నారు. వేల మంది శాస్త్రవేత్తలు 10 సంవత్సరాలకు పైగా ఈ ప్రాజెక్టు కోసం కష్టపడ్డారు. ఈ క్రమంలో దాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు సమయం ఆసన్నమైంది. కౌంటింగ్‌ పూర్తయింది. కానీ కంప్యూటర్‌ ప్రయోగాన్ని లాంచ్‌ చేయకుండా నిలిపివేసింది. ఆ సమయంలో కలాం భరోసా ఇచ్చి ఉపగ్రహాన్ని పంపేలా నిపుణులకు సూచించారు. అప్పుడు ఆ ప్రయోగం ఒక్కో దశ పూర్తి చేసుకుంటూ చివరి దశలో విఫలమైంది. ఆ సమయంలో కలాం దేశవ్యాప్తంగా ఎన్ని విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందోననే ఆందోళనలో ఉన్నారు. అయితే, సతీశ్‌ ధావన్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రయోగం వైఫల్యానికి పూర్తి బాధ్యత తానే వహించారు.  ఆ తర్వాత వైఫల్యాన్ని ఒక అనుభవంగా తీసుకుని మళ్లీ శ్రమించారు. 1980 జులై 18న విజయవంతంగా ఎస్‌ఎల్‌వీ ద్వారా ‘రోహిణి ఆర్‌ఎస్‌ 1’ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశ పెట్టారు. మీడియా సాక్షిగా ధావన్‌..ఆ క్రెడిట్‌ మొత్తం యావత్‌ భారత శాస్త్రవేత్తలకు ఇచ్చారు’’

‘‘అప్పట్లో ఎస్‌ఎల్‌వీ వైఫల్యానికి ధావన్‌ బాధ్యత వహించారు. మలి ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహిస్తామన్నారు. అలాగే నిర్వహించారు.. వైఫల్యాన్ని ఎలా విజయంగా మలచుకోవాలి, దాన్ని సరైన మార్గంలో ఎలా నిర్వహించుకోవాలనే అంశంపై మాట్లాడుతూ ఈ విషయాన్ని గుర్తు చేశారు. ఆ రోజు వైఫల్యాన్ని గొప్ప అనుభవంగా భావించి పని చేయడం వల్లనే విజయం సాధించామని చెప్పారు. కాబట్టి వైఫల్యాన్ని అనుభవంగా మార్చుకోవడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ఒక పుస్తకం చదవడం ద్వారా సంపాదించే జ్ఞానం కన్నా, అనుభవం ద్వారానే ఎక్కువ నేర్చుకోగలమని చెప్పారు. అయితే, ఈ మాటలను కూడా ఇస్రో బలంగా నమ్మింది. కలాం మాటలను విశ్వసించింది కాబట్టే సంబంధాలు తెగిపోయిన ల్యాండర్‌లో రోజుకో పురోగతి కనిపిస్తోంది. ఎందుకంటే విక్రమ్‌ ల్యాండర్‌ జాడను కనిపెట్టినట్లు నిన్న ఇస్రో ప్రకటించింది. ల్యాండర్‌ ముక్కలు కాలేదని, సింగిల్‌ పీస్‌గానే ఉన్నట్లు ఇస్రో తాజాగా వెల్లడించింది. ల్యాండర్‌తో కమ్యూనికేషన్‌ కోసం పట్టువీడని విక్రమార్కుడిలా పోరాడుతోంది. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.