close

ప్ర‌త్యేక క‌థ‌నం

సమీకృత వ్యవస్థే సర్వ‘వరద’ నివారిణి!

అస్తవ్యస్త నిర్వహణతోనే నగరాల్లో ఆకస్మిక వరదలు
ప్రజల్లో అవగాహన పెంపొందించాలి
అధికార యంత్రాంగం అప్రమత్తత చాలా అవసరం
తగిన హెచ్చరిక వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి
ముంపు నివారణకు ‘చెన్నై విధానం’ అనుసరణీయం

‘ఈనాడు’ ఇంటర్వ్యూలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌ డైరెక్టర్‌ శైలేశ్‌నాయక్‌

ఎం.ఎల్‌. నరసింహారెడ్డి, ఈనాడు - హైదరాబాద్‌

స్తవ్యస్త నిర్మాణాలు, చిన్ననీటి వనరుల ఆక్రమణ, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, వాతావరణ మార్పుల ఫలితంగా మన దేశంలో నగరాలు, పట్టణాలకు ఆకస్మిక వరద ముప్పు పెరిగిందని సీనియర్‌ శాస్త్రవేత్త, బెంగళూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శైలేశ్‌నాయక్‌ అభిప్రాయపడ్డారు. వరదలను సమర్థంగా ఎదుర్కోవడానికి సమీకృత వ్యవస్థ అవసరమని, అటు ప్రజలు, ఇటు అధికార యంత్రాంగం ఆ దిశగా సన్నద్ధం కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రజల్లో అవగాహన పెంపొందించడంతోపాటు తగిన హెచ్చరిక వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా ఇలాంటి ఉపద్రవాలతో అధిక నష్టం జరగకుండా జాగ్రత్తపడొచ్చని చెప్పారు. చెన్నైకి ఆకస్మిక వరద హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటుచేశామని.. దీన్ని ఇతర నగరాలూ అమలు చేయడానికి అవకాశం ఉందన్నారు. నగరాలు, పట్టణాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వరదను ముందస్తుగా అంచనా వేయడంపై కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. దీనికి నేతృత్వం వహించిన శైలేష్‌నాయక్‌ కేంద్ర భూభౌగోళిక శాఖ కార్యదర్శిగా, ఇస్రో తాత్కాలిక ఛైర్మన్‌గా, హైదరాబాద్‌లోని ఇన్‌కాయిస్‌ సంస్థ డైరెక్టర్‌గానూ పనిచేశారు. వరదలకు కారణాలు, వీటిని ఎదుర్కోవడం ఎలా అన్నదానిపై ఆయన ‘ఈనాడు’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులోని ముఖ్యాంశాలు..

నగరాలు, పట్టణాలను వరద ముంచెత్తడానికి ప్రధాన కారణాలేంటి? గ్రామీణ ప్రాంతాల్లో వరదలకు, పట్టణ ప్రాంతాలకు తేడా?
పట్టణాలు, నగరాల్లో రోడ్లు, భవనాల నిర్మాణం, కాలిబాటలు, చెరువులు, కుంటలు అంతరించడం లేదా ఆక్రమణలకు గురై నీరు భూమిలోకి ఇంకడం గణనీయంగా తగ్గిపోయి భూమిపై నిల్వ పెరిగి ముంపు జరుగుతోంది. వరద నీరు వెళ్లేందుకు అవసరమైన డ్రైనేజీ వ్యవస్థ లేనప్పుడు ముంపు తీవ్రత మరింత పెరుగుతుంది. భారీ, అతి భారీ వర్షాలు, నదీ ప్రవాహ మార్గాలు మారడం, భూ వినియోగంలో మార్పులు ప్రత్యేకించి అడవులు అంతరించడం గ్రామీణ ప్రాంతాల్లో వరదలకు కారణం. భారీ వర్షాలు కురిసే రోజులు పెరుగుతుండగా, సాధారణ, మధ్యస్థంగా వర్షాలు పడే రోజులు తగ్గిపోవడం కూడా గుర్తిస్తున్నాం. వాతావరణ మార్పులే దీనికి కారణం. దీంతోపాటు ప్రస్తుతమున్న మౌలిక సదుపాయాలు ప్రత్యేకించి డ్రైనేజీ వ్యవస్థ అకస్మాత్తుగా భారీగా వచ్చే వర్షపు నీటికి తట్టుకొనే పరిస్థితి లేదు.

వరదను ముందుగానే అంచనావేసే వ్యవస్థ మన దేశంలో ఏ మేరకు పటిష్ఠంగా ఉంది?
ఇందులో ఆరు అంశాలున్నాయి. వర్షపాతాన్ని సరిగా పరిశీలించడం, సముద్రపు పోటు, తుపాన్లు,  మంచు కురవడం, నదులు, వాగుల్లో నీటి ప్రవాహాన్ని లెక్కగట్డడం. వివిధ పద్ధతుల ద్వారా పై సమాచారాన్ని క్రోడీకరించి ఏ సమయానికి ఏం జరుగుతుందో కచ్చితంగా చెప్పడం. ముందస్తు హెచ్చరికలను జారీ చేసే బలమైన వ్యవస్థ. ఈ హెచ్చరికలకు స్పందించి చురుగ్గా కదిలే యంత్రాంగం ఉండటం చాలా ముఖ్యం. మనదేశంలో నదులకు వచ్చే వరద గురించి హెచ్చరించే వ్యవస్థ పటిష్ఠంగా ఉంది. ఒక్క నదులకే కాకుండా అన్నింటికీ కలిపి సమీకృత వ్యవస్థను అభివృద్ది చేయాలి. తీవ్రమైన తుపాను వల్ల భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు 50 వేల చదరపు కిలోమీటర్లకుపైగా కవర్‌ చేయాల్సి ఉంటుంది. దీనికి తగ్గట్లుగా స్పందించే వ్యవస్థను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది.

వ్యక్తిగతంగా, సామూహికంగా, ప్రభుత్వస్థాయిలో చేపట్టాల్సిన ప్రాథమిక చర్యలేంటి?
ముందుగానే వరదను అంచనా వేసే పటిష్ఠ విధానాన్ని అభివృద్ధి చేయడానికి మానవ, సామాజిక వ్యవస్థలు చాలా కీలకం. వరద నష్ట తీవ్రతను ప్రజలు అర్థం చేసుకొనే సామర్థ్యాన్ని పెంచడంతోపాటు స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలి. స్థానిక అధికారులు ఇచ్చే ఆదేశాలకు ప్రజలు స్పందించేలా చూడాలి. దీంతోపాటు ప్రభుత్వ యంత్రాంగం సమయానుకూలంగా స్పందించాలి. అడ్డదిడ్డంగా రోడ్లు నిర్మించడం, డివైడర్లు చాలా ఎత్తు ఉండటం కూడా కొన్ని సందర్భాల్లో వరదలకు కారణమవుతున్నాయి.

వరద హెచ్చరిక వచ్చిన వెంటనే ప్రభావిత ప్రజలు ఏం చెయ్యాలి?
సాధారణంగా మూడు రకాల హెచ్చరికలు జారీ చేస్తారు. పరిశీలిస్తుండటం, అప్రమత్తంగా ఉండటం, వెంటనే ఖాళీచేయాలని హెచ్చరించడం. ఈ మూడింటిని బట్టి ఏది అవసరమైతే అది తక్షణం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలి. స్థానిక అధికారులు ఇచ్చే ఆదేశాలను కచ్చితంగా పాటించేలా ప్రజలను సిద్ధం చేయడం ఉత్తమ మార్గం.

విపరీతంగా పెరుగుతున్న పట్టణీకరణ, బాధ్యతారాహిత్య నీటి యాజమాన్యం, వాతావారణ మార్పు, వరదలకు సంబంధించి ఇందులో ఏది ఎక్కువగా ప్రభావం చూపుతుంది?
నగరాలు, పట్టణాలను వరద ముంచెత్తడానికి ఏదో ఒక దాన్ని వేలెత్తిచూపడం చాలా కష్టం. ఇవన్నీ కలిసే ఈ పరిస్థితిని తెచ్చాయి. కాకపోతే ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో ఏది ఎక్కువ ప్రభావానికి గురి చేసిందనేదాంట్లో వ్యత్యాసం ఉండొచ్చు. అత్యధిక వర్షాలతో సహజంగానే వరదలు సంభవిస్తాయి. తీవ్రత పెరగడానికి మాత్రం అనేక కారణాలుంటాయి. ఈ పరిస్థితి రాకుండా నివారించడానికి విధానాలున్నాయి. అనేక రాష్ట్రాల్లో వీటి అమలు ప్రధాన సమస్య. సరైన ప్రణాళిక లేకపోవడం, పట్టణాలు, నగరాల్లో జీవ వైవిధ్యం, పర్యావరణానికి సంబంధించిన అంశాలను నిర్లక్ష్యం చేయడం సమస్యగా మారుతోంది.

నగరాలు, పట్టణాల్లో భారీ వరదలను అంచనా వేసే అవకాశం ఉందా? ఇందుకు ఉన్న పద్ధతిని వివరిస్తారా?
నగరాలు, పట్టణాల్లో వరదలను ముందుగా పసికట్టడం సాధ్యమే. చెన్నై నగరానికి ఇలాంటి వ్యవస్థను రూపొందించాం. ఇందులో ఆరు ప్రధాన అంశాలున్నాయి. ప్రాంతీయ వాతావరణాన్ని తెలుసుకోవడం, సముద్రపు పోటు, తుపాను తీవ్రతను అంచనా వేసే మోడలింగ్‌. ప్రవాహాలను పర్యవేక్షించడం, ఎగువ ప్రాంతాల్లో నీటి లభ్యతకు సంబంధించిన సమాచారం, వరదతో ముంపునకు గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాలతో సమన్వయం చేయడం. ఈ మొత్తం ప్రక్రియ ఆటోమేషన్‌తోనే చేయొచ్చు. వార్డు స్థాయిలో ముంపునకు సంబంధించిన వివరాలూ తెలుసుకోవచ్చు. పరిష్కారానికి టోపోగ్రఫీ కీలకమైంది. వివిధ భూభౌతిక పరిస్థితులను బట్టి భూభాగాలు వేర్వేరుగా ఉంటాయి. సముద్రపు అలలతోపాటు రిజర్వాయర్లలో నీటి మట్టాలనూ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటివి తక్కువ ఖర్చుతోనే అభివృద్ధి చేయడానికి ప్రయత్నించాలి. ఈ సాంకేతిక పరిజ్ఞానం మొదటి హెచ్చరిక 72 గంటల ముందుగా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ప్రతి ఆరుగంటలకోసారి తాజా సమాచారాన్ని అప్‌డేట్‌ చేయాలి. దీంతో ప్రజలను తరలించడానికి తగిన సమయం దొరుకుతుంది.

దేశంలో ఏ ప్రాంతంలోని నగరాలు ఎక్కువగా వరదలకు గురవుతున్నాయి? ముంబయి, చెన్నై, హైదరాబాద్‌ లాంటివి వరద తీవ్రతను చూశాయి. వీటి నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలేంటి?
దక్షిణ హిమాలయ ప్రాంతంలోని సింధు, గంగా నదీ తీరమైదానం, తూర్పు సముద్ర తీర ప్రాంతాలు ఎక్కువగా వరదలకు గురయ్యే అవకాశం ఉంది. ఆయా ప్రాంతాల్లోని భూమి స్వభావమే దీనికి కారణం. అన్ని ప్రధాన నగరాల్లో వరద తీవ్రత గుర్తించి హెచ్చరించే వ్యవస్థ ఉండాలి. వరదలు ముంచెత్తితే ఎదుర్కొనే సన్నద్ధతకు వ్యక్తిగతంగా, స్థానికంగా, రాష్ట్ర స్థాయిలో సామర్థ్యం పెంచడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.