close

ప్ర‌త్యేక క‌థ‌నం

నకిలీల బయోత్పాతం!

పుట్టగొడుగుల్లా పురుగుమందుల ఉత్పత్తులు
రాష్ట్రవ్యాప్తంగా యథేచ్ఛగా విక్రయాలు
కోరి కొనితెచ్చుకుంటున్న తెలంగాణ రైతులు
గుంటూరు కేంద్రంగా ఏటా రూ.వందల కోట్ల దందా
పంట పొలాలకు, పర్యావరణానికి పెనుముప్పు
న్యూస్‌టుడే - ఖమ్మం వ్యవసాయం

చిత్రాల్లోని డబ్బాలపై రాసి ఉన్న పేర్లు చూడండి.. ఒక్క అక్షరం తేడాతో రెండింటిపైనా ‘మూవ్‌’ అనే ఉంది కదూ..! నిజానికి ఈ రెండూ నకిలీవే.. గతేడాది ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ‘మూవ్‌’ అనే మందు విక్రయాలు అధికంగా జరిగాయి. ఇప్పుడు ఇదే మందు పేరుతో రకరకాల నకిలీలను అంటగడుతున్నారు. ఒక్క ఖమ్మంలోనే ఐదు రకాల ‘మూవ్‌’ మందులను విక్రయించటం గమనార్హం. ‘మూవ్‌’ పేరుతో ప్లాంటా ప్రొడక్షన్‌, విజయలక్ష్మి ఆగ్రోటెక్‌, హిమామి లైఫ్‌సైన్స్‌ అనే కంపెనీలు బయోలు విక్రయిస్తున్నాయి.

వాటిని చూస్తే పంటలకు ‘బయో’త్పాతం.. అన్నదాతల ఆశలకు అవి శరాఘాతం.. ఆ పురుగుమందుల తయారీ అంతా అక్రమార్కుల ఇష్టారాజ్యం.. నిబంధనలకు అతీతం.. రైతన్నల అమాయకత్వమే ఊతంగా నకిలీలకు సైతం మరిన్ని నకిలీలు సృష్టించటం వారికే సాధ్యం...పర్యావరణానికి, ప్రకృతిహిత జీవులకు హానికరంగా పరిణమిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు కేంద్రంగా తెలంగాణ వ్యాప్తంగా వేళ్లూనుకుందీ నకిలీ బయో మందుల దందా.. దీని ముసుగులో అక్రమార్కులు రూ.కోట్లకు పడగలెత్తుతుండగా.. అమాయక రైతులు పంట దిగుబడులు కోల్పోయి, అప్పుల ఊబిలో కూరుకుపోతుండటం తీరని విషాదం.. ‘చాప కింది నీరు’లా విస్తరిస్తోన్న ఈ అక్రమంలో అధికారులు, అధినాయకుల తెరవెనుక పాత్ర పైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రుగాలం చెమటోడ్చే అన్నదాతలు అడుగడుగునా దోపిడీకి గురవుతున్నారు. విత్తనాలు మొదలుకొని ఎరువులు, పురుగు మందులు, చివరకు పంటను అమ్మే మార్కెట్‌లోనూ మోసపోతున్నారు. వారి అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని అనేకమంది నిలువుదోపిడీ చేస్తున్నారు. తెలంగాణలోని పది జిల్లాల్లో ద్రవరూప జీవన ఎరువుల (బయో మందుల) మాటున నకిలీ దందా జోరుగా సాగుతోంది. పంటలకు ఎలాంటి హానీ చేయని బయో మందులనే వ్యాపారులు రైతులకు విక్రయించేందుకు అనుమతులున్నాయి. వీటి ముసుగులో అక్రమార్కులు నకిలీ ఉత్పత్తులను రైతులకు అంటగడుతూ కోట్ల రూపాయిలు  కొల్లగొడుతున్నారు.

అంతా అనర్థమే
పంటలకు, పర్యావరణానికి మేలుచేసే కోట్లాది సూక్ష్మజీవులు, భూమిలోనూ, ప్రకృతి పరంగానూ మనుగడ సాగిస్తుంటాయి. వీటి ఉనికిని దెబ్బతీసేలా శక్తివంతమైన లామ్డా సైహోలోత్రిన్‌, డెల్టామిత్రిన్‌, సైపర్‌ వంటి రసాయనాలను ప్రమాదకర సాయిలో కలిపి బయో మందులను తయారుచేస్తున్నారు. దీనివల్ల పంటలకు మేలుచేసే మిత్ర పురుగులు నశించి, చీడపీడలు అదుపు చేయలేని పరిస్థితి, దిగుబడులు దిగజారే దుస్థితి తలెత్తిందని వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.

అసలు మందుల ధరలు చుక్కల్లో
రైతులు కొన్నేళ్లుగా పత్తి, మిరప, మొక్కజొన్న, వరి పంటలను ఎక్కువగా వేస్తున్నారు. వీటిపై చీడపీడల అదుపునకు అవసరమైన రసాయన పురుగుమందులు లైసెన్స్‌ కలిగిన దుకాణదారుల వద్ద ఉన్నా ధరలు చుక్కలనంటుతున్నాయి. కోరజాన్‌ రూ.900, డెలిగేట్‌ రూ.1,500, మిరపలో తెగుళ్లు రాకుండా పెరుగుదల వచ్చేందుకు వాడే మరో బ్రాండ్‌ రూ.2వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది. అది ఎకరానికి మాత్రమే వస్తోంది. ఇలాంటి అనేక మందుల ధరలు నాలుగేళ్లలో విపరీతంగా పెరిగాయి. ఈ క్రమంలో సన్న, చిన్నకారు రైతులు నకిలీ బయోమందుల వాడకంపై దృష్టిపెట్టారు. దీన్ని అదనుగా తీసుకున్న వ్యాపారులు గుంటూరును కేంద్రంగా చేసుకుని ఏకంగా భారీ పరిశ్రమనే నడుపుతున్నారు. అక్కడికి వెళ్లిన రైతులకు తెలంగాణ ప్రాంత ఆధార్‌కార్డు ఉంటేనే మందులను విక్రయిస్తున్నారు. ఏపీ రైతులను అనుమతించటం లేదని సమాచారం.

పట్టించుకోని అధికారులు
రాజకీయ నాయకులు, అధికారుల అండదండలతో కొన్నేళ్లుగా గుంటూరులో ఈ నకిలీ బయోల వ్యాపారం జోరుగా సాగుతోంది. ఏపీ రైతులకు వీటిని విక్రయించకుండా కేవలం తెలంగాణ రైతులకే ఇవ్వటంతో అక్కడి ప్రభుత్వం దీన్ని పెద్దగా పట్టించుకోవటం లేదని తెలుస్తోంది. కొందరు అధికారులు, రాజకీయ నాయకులకు వాటాలు ముట్టజెప్పటంతో రూ.కోట్లలో వ్యాపారం జరుగుతున్నా పట్టించుకోవటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇష్టారాజ్యంగా అమ్మకాలు
కొందరు వ్యాపారులు అనుమతిలేని బయో మందులను విక్రయిస్తున్నారు. గతంలో ఈ నకిలీ బయోలపై పలు ప్రాంతాల్లో రైతులు ఆందోళన చేయటంతో ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. దీంతో చాలామంది లైసెన్స్‌ ఉన్న వ్యాపారులు వీటిని తిరిగి ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో కొంతకాలం స్తబ్దంగా ఉన్న స్థానిక వ్యాపారులు.. రైతులు ఎలాగూ గుంటూరు మందులు తెచ్చి వాడుతున్నారనే సాకు చూపించి మళ్లీ బయో మందుల వ్యాపారంపై దృష్టి సారించారు. ఉదాహరణకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఏటా రూ.150కోట్లకు పైగా పురుగుమందుల వ్యాపారం జరుగుతుంది. వీటిలో బయోల వాటా రూ.60కోట్ల వరకు ఉంటుందని ఓకంపెనీ ప్రతినిధి చెప్పారు.

అనుమతుల కోసం అడ్డదారులు
పంటలకు, పర్యావరణానికి మేలు చేసే మిత్రపురుగులకు ఎలాంటి హానీ చేయని ’జీవన ఎరువులను’ సదరు కంపెనీలు మొదటి నమూనాలను రాష్ట్ర వ్యవసాయశాఖ ద్వారా నాణ్యత పరీక్షల నిమిత్తం పంపుతాయి. ఈ పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చే జీవన ఎరువు(బయో)లుగా గుర్తిస్తేనే వాటి విక్రయాలకు అనుమతిస్తారు. ఇక్కడ తిరస్కరణకు గురైన కొన్ని కంపెనీలు బ్రాండ్ల పేరు మార్చుకుని న్యాయస్థానాలను ఆశ్రయించి అనుమతులు తెచ్చుకుంటున్నాయి. వాటిని అడ్డం పెట్టుకుని కొన్నేళ్లుగా విపణిలో యథేచ్ఛగా ఉత్పత్తులను చలామణీ చేస్తున్నా వ్యవసాయశాఖ అధికారులు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు.

బంపర్‌ ఆఫర్లు.. బహుమతుల ఎర
గుంటూరులోని వ్యాపారి తన వద్ద బయోమందులు కొనే రైతులకు బంపర్‌ ఆఫర్లు ఇచ్చి ఆకట్టుకుంటున్నాడు. వ్యాపార స్థాయిని బట్ట¨ వారికి బుల్లెట్‌ వాహనాలు, బంగారు ఆభరణాలు, ఖరీదైన ఎలక్ట్రానిక్‌ పరికరాలను అందజేస్తున్నాడు. అక్కడ మందులు కొనే ప్రతి రైతుకు బిర్యానీ పొట్లం, మద్యం సీసా ఉచితం. ఇలా రకరకాల బహుమతులతో రైతులను ఆకర్షించి సొమ్ము చేసుకుంటున్నారు.

రెండు చేతులా ఆర్జన
కొందరు తయారీదారులు ఒక్కో మందు డబ్బాను రూ.600, రూ.950 ఎంఆర్‌పీ ధరతో డీలర్లకు సరఫరా చేస్తున్నారు. కేవలం రూ.200 నుంచి రూ.250 ధరకే వారికి ఇస్తుండటంతో డీలర్లు రెండు చేతులా ఆర్జిస్తున్నారు. నకిలీ బయోమందుల కంపెనీలు డీలర్లకు ఆకర్షణీయమైన ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. విలాసవంతంగా విదేశాల్లో పర్యటించే ఏర్పాట్లు చేస్తున్నాయి.

* ‘ఫినిష్‌’ పేరుతో ప్లాంటా ప్రొడక్షన్‌, హిమామి లైఫ్‌ సైన్స్‌, విజయలక్ష్మి ఆగ్రోటెక్‌, ఫార్మాకేర్‌టెక్‌ కంపెనీలు బయోలను అమ్ముతున్నాయి.
* ‘లాకర్‌’ పేరుతో ప్లాంటా ప్రొడక్షన్‌, హిమామి లైఫ్‌ సైన్స్‌ అనే కంపెనీలు మందులు విక్రయిస్తున్నాయి.

ఆధార్‌ కార్డు ఉంటేనే..

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌, నల్గొండ, సూర్యాపేట, ములుగు, భూపాలపల్లి, వరంగల్‌ గ్రామీణ జిల్లాల్లో ఏజెంట్ల ద్వారా ప్రస్తుతం బయో మందుల దందా జోరుగా సాగుతోంది. అలాగే.. నిత్యం వందలాది రైతులు రైళ్లు, బస్సులు, ప్రత్యేక వాహనాల్లో గుంటూరుకు వెళ్లి మందులు కొనుగోలు చేస్తున్నారు. ఇదంతా జాతరలా నడుస్తోంది. రైతు ఆధార్‌కార్డు పరిశీలన పూర్తి కాగానే లోపలికి అనుమతించి భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. రైతులు కొనుగోలు చేసిన మందులకు చేతిరాతతో నకిలీ బిల్లులు ఇస్తున్నారు.

అసలే నకిలీలు.. వాటికి మళ్లీ నకిలీలు!

ప్రస్తుతం మార్కెట్‌లో నకిలీ బయోలే జోరుగా విక్రయిస్తున్నారు. గుంటూరు బయోమందులను రైతులు పోటీపడి కొనుగోలు చేస్తుండంతో దాన్ని పోలిన మందులనే చాలామంది సొంతంగా తయారు చేసి అదే పేరుతో రైతులకు అంటగడుతున్నారు. బయో మందుల కంపెనీల్లో పనిచేసిన కొందరు ఏజెంట్లు ఇందులో కీలక పాత్ర పోషిస్తూ ఉత్పత్తులను మార్కెట్‌కు తరలిస్తున్నారు.

* ఖమ్మం జిల్లాలోని మంగళగూడెం, తల్లాడ ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఏపీలోని జగ్గయ్యపేటను కేంద్రంగా చేసుకుని నకిలీలను సరఫరా చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వీరు గుంటూరు బయోమందుల పేరుతో తెలంగాణలోని పలు జిల్లాలకు వీటిని సరఫరా చేస్తున్నారు.
* ఖమ్మం నగరానికి చెందిన వ్యక్తి ఇతర రాష్ట్రాల్లో తయారైన లేబుళ్లతో పెద్దఎత్తున ఓ నకిలీ బయోమందును సరఫరా చేస్తున్నాడు. హైదరాబాద్‌లోని ఐడీపీఎల్‌ ప్రాంతంలో రహస్యంగా మందులను తయారుచేసి తెలంగాణ అంతటా మార్కెట్‌ చేస్తున్నారు. చైనా నుంచి దిగుమతి అయిన రసాయనాలతో కారుచౌకగా ఈ ఉత్పత్తులను సృష్టిస్తున్నట్లు సమాచారం.

 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.