Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

అదిగదిగో.. మామ ఇంటిని చూసివద్దామా!

ఆకాశం ఓ ప్రహేళిక! విశ్వం.. ఓ విస్మయాల పుట్ట!!

సుదూర వినీలాకాశంలో చండ్రనిప్పులు కురిపించే ఆ సూర్యుడేమిటి? నిగూఢ నిశిరాత్రి సైతం పండు వెన్నెలలు కురిపించే ఆ చంద్రుడేమిటి? ఈ విశ్వాంతరాళంలో మనిషిని కొన్ని యుగాల పాటు వేధించిన ప్రశ్నలివి. ఎంతో ఉత్సుకత రేకెత్తించిన విశ్వ సందేహాలివి.

..అందుకే ఈ సుదీర్ఘ మానవ ప్రస్థానంలో మనిషి వీటి గురించి పలు విధాల ఆలోచనలు చేశాడు. రకరకాల సమాధానాలు వెతుక్కున్నాడు.

చల్లదనాల చంద్రబింబంలో ఆత్మీయతను పంచే మేన‘మామ’ను చూసుకున్నాం. అందులోనే ఆశ్చర్యాన్ని పెంచే పేదరాసి పెద్దమ్మను గుర్తించాం. అయితే.. మన మనసులకు ఎంత దగ్గరైనా నేటికీ మన ‘మామ’ గురించి మనకు తెలిసింది తక్కువే. నిన్న మొన్నటి వరకూ మనకు కనీసం అక్కడ నీళ్లున్నాయో లేదో కూడా అయోమయమే. మనిషి అక్కడకు వెళితే ఆదరణ ఉంటుందో లేదో తెలీదు. అందుకే మన అన్వేషణ నేటికీ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో వేస్తున్న మరో అడుగే చంద్రయాన్‌-2.
భారత గగన పతాకను వినువీధిలో ఎగరేస్తూ.. ఈ నెల 14 అర్ధరాత్రి దాటాక (15 తెల్లవారుజామున) మబ్బులను చీల్చుకుంటూ పైకి లేవనున్న జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3, అది మోసుకుపోనున్న ఆర్బిటర్‌, ల్యాండర్‌, రోవర్లు చందమామకు సంబంధించిన ఎన్నో వింతలూవిశేషాల మూటవిప్పనున్నాయి. అసలీ చంద్రయానం అడుగడుగూ ఓ సంభ్రమమే. అందుకే నేటి నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక కథనాలు అందిస్తోంది.


చంద్రయాన్‌-2
జాబిల్లి కోసం..
కంభంపాటి సురేష్‌
ఈనాడు - హైదరాబాద్‌

అంతరిక్ష అద్భుతానికి తెరలేచే ఘడియ సమీపిస్తోంది. చందమామపై కాలు మోపేందుకు మన బుజ్జి ‘యంత్రదూత’ నింగికెగసే సమయం ఆసన్నమవుతున్న కొద్దీ.. ‘చంద్రయాన్‌-2’పై సర్వత్రా ఉత్కంఠ, ఆసక్తి పెరుగుతున్నాయి. ఈ సాహసోపేత అంతరిక్ష విన్యాసంపై పలు సందేహాలు.. సంశయాలకు సమాధానాలను సవివరంగా చూద్దాం!

1 ఎందుకు మళ్లీ చంద్రయానం?
మనకు అత్యంత సమీపంలో ఉన్న ఖగోళ బింబం చందమామ. దాదాపు 450 కోట్ల ఏళ్లుగా ఇది భూమికి ఆత్మీయ నేస్తం. పుడమికి సహజసిద్ధ ఉపగ్రహమైన ఈ చంద్రుడికి సంబంధించి మరింతగా అవగాహన పెంచుకునేందుకు చేస్తున్న బృహత్‌ ప్రయత్నమే ఈ చంద్రయాన్‌-2 ప్రయోగం! ఈ వ్యోమనౌకకున్న సాంకేతిక సామర్థ్యంతో చంద్రుడి గురించీ, అక్కడి వాతావరణం గురించీ విస్తృత స్థాయి సమాచారం అందుబాటులోకి రానుంది. తద్వారా భవిష్యత్‌లో అక్కడ ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన పరిజ్ఞానాన్ని సిద్ధం చేయాలన్నది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) లక్ష్యం. భవిష్యత్తు ఖగోళ పరిశోధనలలో జాబిల్లి కీలక పాత్ర పోషించబోతోంది. అక్కడ అపారంగా ఉన్న హీలియం-3 వంటి వనరుల విస్తృతిపై మరింత ఎక్కువ వివరాలు సేకరించగలిగితే అక్కడ మైనింగ్‌ కూడా చేపట్టవచ్చేమో తెలుస్తుంది. అవసరాన్ని బట్టి వాటిని అక్కడి కాలనీల్లో వినియోగించొచ్చు లేదా భూమికి తరలించుకొచ్చి నానాటికీ పెరుగుతున్న మన ఇంధన అవసరాలను తీర్చుకునే అవకాశమూ ఉంటుంది.

2 దశాబ్దాల కిందటే చంద్రుడిపైన మానవులు కాలుమోపారు. అనేక వ్యోమనౌకలు సైతం అక్కడికి వెళ్లాయి. మళ్లీ ఇప్పుడు కొత్తగా భారత్‌ ప్రయోగం చేపట్టాల్సిన అవసరమేంటి?
నిజమే! 1969లో నీల్‌ ఆమ్‌స్ట్రాంగ్‌, బజ్‌ ఆల్డ్రన్‌లు తొలిసారిగా కాలు మోపిన దగ్గరి నుంచి 1972లో చివరిగా దిగిన వ్యోమగామి వరకూ.. ఇప్పటివరకూ 12 మంది చంద్రమండలంపై కాలు మోపారు. అక్కడి శిలల నమూనాలను భూమికి తీసుకొచ్చి, పరిశోధించారు. అమెరికా, సోవియట్‌ యూనియన్‌ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం అంతరిక్ష రంగానికి విస్తరించిన సందర్భంలోనే చంద్రుడికిపైకి యాత్రలు జరిగాయి. అయితే అవి జాబిల్లిపై జెండాలు పాతడానికి, తమదే పైచేయి అనిపించుకోవడానికే పరిమితమయ్యాయి. వాళ్లు చేసిన పరిశోధనలు చాలా పరిమితం. పైగా నాడున్న సాంకేతిక పరిజ్ఞానం, కంప్యూటింగ్‌ సామర్థ్యం కూడా అందుకు పెద్దగా సహకరించలేదు. అందువల్ల అక్కడకు ఎన్నిసార్లు వెళ్లినా ఇప్పటి వరకూ జాబిల్లి గురించి మనకు తెలిసింది చాలా స్వల్పమే. 1950ల నుంచి చంద్రుడిపైకి అనేక వ్యోమనౌకలను పంపినప్పటికీ 2008లో భారత్‌ ప్రయోగించిన చంద్రయాన్‌-1 మాత్రమే తొలిసారిగా జాబిల్లిపై నీటి జాడను గుర్తించింది. తొలిప్రయోగం తర్వాత మానవసహిత అంతరిక్ష యాత్రలపై అటు అమెరికా ప్రభుత్వం నుంచిగానీ, ప్రజల నుంచిగానీ పెద్ద ఆసక్తి లేకపోయింది. ఖరీదైన వియత్నాం యుద్ధంలో చిక్కుకుపోయి ఉండటంతో అమెరికా తన మానవసహిత అంతరిక్ష యాత్రలకు స్వస్తి పలికింది. ఆ తర్వాత చంద్రుడి వద్దకు కొన్ని మానవరహిత యాత్రలు మాత్రమే జరిగాయి. ఆ తర్వాత దృష్టి భూ దిగువ కక్ష్యకు మళ్లింది. 400 కిలోమీటర్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) నిర్మాణం మీదే అగ్రదేశాల ఎక్కువ దృష్టి పెట్టాయి. అందుకే నేటికీ చంద్రుడి గురించి అన్వేషించాల్సింది చాలానే మిగిలి ఉంది.

3 చంద్రయాన్‌-1 కన్నా ఈ రెండో ప్రయత్నం ఎంత భిన్నం?
భారత్‌ 2008లో తొలిసారిగా చంద్రయాన్‌-1 పేరుతో జాబిల్లి కక్ష్యలోకి ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించింది. తాజాగా ప్రయోగిస్తున్న చంద్రయాన్‌-2 దానికి కొనసాగింపే! అయితే మొదటి యాత్రలో మన పరిశోధన కేవలం జాబిల్లి కక్ష్యకే పరిమితమైంది. అక్కడ తిరుగుతూ డేటాను సేకరించి, భూమికి పంపింది. అది చంద్రుడిపై భారత ముద్ర ఉండాలన్న ఉద్దేశంతో ‘మూన్‌ ఇంపాక్ట్‌ ప్రోబ్‌’ (ఎంఐపీ) పేరుతో 35 కిలోల ఇంపాక్టర్‌ను మాత్రం చంద్రుడి ఉపరితలంపైకి జారవిడిచింది. అది బలంగా విసిరేసినట్లుగా చంద్రుడిని ఢీకొంది, ఆ లోపే కొన్ని పరిశోధనలూ సాగించింది. ఇప్పుడు చంద్రయాన్‌-2 తీసుకుపోయే ల్యాండర్‌, రోవర్లు.. ఎంతో సున్నితంగా చంద్రుడి మీద దిగుతాయి. రోవర్‌ అయితే.. జాబిల్లి ఉపరితలంపై కలయతిరుగుతుంది. సొంత బుర్రతో, స్వీయ పరికరాలతో పరిశోధనలు సాగిస్తుంది, ఫొటోలు తీస్తుంది. ఆ వివరాలు భూమికి పంపుతుంది. అందువల్ల చంద్రయాన్‌-1తో పోలిస్తే ఇది అత్యంత సంక్లిష్టమైన, భారీ ప్రయోగం.

4 ఇప్పటి వరకూ ఏయే దేశాలు ఇలా సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేపట్టాయి?
ఇప్పటి వరకూ అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే జాబిల్లిపై మృదువుగా (సాఫ్ట్‌) ల్యాండింగ్‌ సాగించాయి. చంద్రయాన్‌-2 విజయవంతమైతే ఆ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్‌కు విశిష్ట గుర్తింపు దక్కుతుంది.

5 ఒకప్పటి కంటే సాంకేతికంగా బలపడ్డామా?
ప్రచ్ఛన్న యుద్ధం ముగిశాక అమెరికా, ఐరోపాలు చంద్రుడికి సంబంధించిన అంతరిక్ష కార్యక్రమాలను కుదించుకున్నాయి. ఒక విధంగా అంటార్కిటికా పరిశోధనల విషయంలో కూడా ఇలాగే జరిగింది. మొదట్లో ఆ ధ్రువాన్ని చేరుకునేందుకు అంతా విపరీతంగా పోటీలు పడ్డారు. కానీ ఆ తర్వాత 50 ఏళ్లపాటు ఎవరూ పెద్దగా అక్కడి పోలేదు. ఆ తర్వాత అంటార్కిటికాపై ఆవాసాలు నిర్మించుకోవడం మొదలైంది. చంద్రుడిపై పరిశోధన విషయంలోనూ ఇప్పుడు ఇదే దశ మొదలైంది. అంటార్కిటికాలో పరిశోధనల పుణ్యమా అని సాంకేతికంగా ఎంతో పురోభివృద్ధి సాధ్యమైంది. దానివల్ల మోటరైజ్డ్‌ వాహనాలు, గాల్లో రవాణా, కమ్యూనికేషన్‌, కొత్త పదార్థాల అభివృద్ధి వంటివన్నీ ఒనగూరాయి. మరోవైపు మెషీన్‌ లెర్నింగ్‌, సెన్సర్‌ పరిజ్ఞానం, త్రీడీ ముద్రణ, కంప్యూటింగ్‌ పరిజ్ఞానం, రోబోటిక్స్‌లోనూ నూతన ఆవిష్కారాలు వచ్చాయి. ఇవన్నీ కూడా చంద్రుడిపై ఆవాసానికి వీలు కల్పించే పరిజ్ఞానాలే. దీన్ని సాకారం చేసుకొని, అంగారకుడు, సౌర కుటుంబంలోని ఇతర గ్రహాలకూ ప్రయాణం కట్టాలని అంతరిక్ష పరిజ్ఞాన దేశాలన్నీ ఉర్రూతలూగుతున్నాయి.

6 చంద్రయాన్‌-2 యాత్రలో సవాళ్లు ఏమైనా ఉన్నాయా?
చంద్రుడిపై ల్యాండింగ్‌ అనేది నిస్సందేహంగా మన అంతరిక్ష పరిశోధనా రంగం సాధించబోతున్న ఘనతల్లో ఓ అద్భుత ఘట్టం. అయితే ఇందులో అనేక సవాళ్లు, సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయి. 3 లక్షలకు పైగా కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడి వద్దకు మన వ్యోమ పరికరాలను కచ్చితత్వంతో నడిపించటం చాలా కష్టం. ప్రతి దశలోనూ కచ్చితంగా ఎంత అవసరమో బేరీజు వేసి.. సరిగ్గా అంతే స్థాయిలో రాకెట్లను మండించి, నిర్దిష్ట మార్గంలోకి మళ్లించాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన లెక్కలన్నీ ఎంతో పక్కాగా ఉండాలి. అంతిమంగా ల్యాండర్‌ తన వేగాన్ని తగ్గించుకొని, జాబిల్లిపై క్షేమంగా దిగాలి. తన దారి తనే నిర్దేశించుకోవాలి. అందుకు నియంత్రణ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలి. ఈ విన్యాసాల్లో ఎక్కడా తేడాలకు ఆస్కారం ఉండకూడదు. అంత దూరంలోని వ్యోమనౌకతో కమ్యూనికేషన్‌ కూడా అంత తేలిక కాదు. ఇప్పటి వరకూ చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌కు ప్రయత్నించిన వ్యోమనౌకల్లో దాదాపు సగం మాత్రమే విజయవంతం కావడం ఇక్కడ ప్రస్తావనార్హం. కఠిన వాతావరణ పరిస్థితులను అధిగమించి సున్నితమైన పరిశోధన యంత్రాలు సాఫీగా పనిచేయాలి.

7 చంద్రయాన్‌-2 ఎంతకాలం పనిచేస్తుంది?
చంద్రయాన్‌-2లోని ఆర్బిటర్‌ ఏడాది పాటు పనిచేస్తుంది. కానీ చంద్రుడి ఉపరితలంపై దిగే ల్యాండర్‌, రోవర్‌ మాత్రం 14 రోజులకు మించి పనిచేయటం అనుమానమే ఎందుకంటే జాబిల్లిపై పగటి సమయం 14 రోజుల పాటు ఉంటుంది. ఈ 14 రోజులూ సౌరశక్తిని ఉపయోగించుకొని అవి పనిచేస్తాయి. కానీ ఆ తర్వాత చంద్రుడి మీద 14 రోజుల పాటు రాత్రి సమయమే ఉంటుంది. ఆ సమయంలో తలెత్తే శీతల ఉష్ణోగ్రతలను తట్టుకొని ఇవి ఎంత వరకూ పని చేస్తాయన్నది అనుమానమే.

8 జాబిల్లిపై దిగేది ఎక్కడ? అక్కడే ఎందుకు?
మన శాస్త్రవేత్తలు చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలో ల్యాండర్‌, రోవర్‌లను దించుతున్నారు. కీలకమైన ఆ ప్రాంతానికి ఇంతవరకూ ఏ దేశమూ వ్యోమనౌకలను పంపలేదు. ఇస్రో ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అక్కడ ల్యాండింగ్‌కు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. పుష్కలంగా నీరు ఐస్‌ రూపంలో ఉండొచ్చని అంచనా. చంద్రుడు, భూమి, సౌర కుటుంబం పుట్టుక, పరిణామ క్రమానికి సంబంధించిన వివరాలు అనేకం ఇక్కడ నిక్షిప్తమై ఉంటాయని భావిస్తున్నారు.

9 చంద్రయాన్‌-2 పూర్తిగా దేశీయమేనా?
చంద్రయాన్‌-2ను ఇస్రో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించింది. ఆర్బిటర్‌, ల్యాండర్‌, రోవర్‌లను పూర్తిగా మన దేశంలోనే సిద్ధం చేసింది. జాబిల్లిపై పరిశోధనల కోసం వీటిలో పంపుతున్న 14 పరికరాల్లో 13 భారత్‌వే. ఆ పధ్నాలుగోది కూడా అమెరికా తన సొంత పరిశోధనల కోసం (లేజర్‌ రిఫ్లక్టోమీటర్‌) మన ల్యాండర్‌లో పంపుకుంటోంది.

10 చంద్రయాన్‌-2 పయనం ఎలా?
భారత అంతరిక్ష చరిత్రలో చేపడుతున్న అత్యంత సంక్లిష్ట ప్రయోగం చంద్రయాన్‌-2. ఇందులో మూడు విభాగాలు ఉన్నాయి. 1. చంద్రుడి కక్ష్యలోనే తిరిగే ఆర్బిటర్‌ 2. ఆర్బిటర్‌ నుంచి విడిపోయి జాబిల్లి ఉపరితలంపై మృదువుగా దిగే ‘విక్రమ్‌’ ల్యాండర్‌ 3. ల్యాండర్‌ నుంచి విడిపోయి చంద్రుడి నేలపై కలియతిరిగే ‘ప్రగ్యాన్‌’ రోవర్‌. ఈ మూడింటినీ కలిపి ‘కాంపోజిట్‌ మాడ్యూల్‌’ అంటారు. భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్‌ సారాభాయ్‌ పేరిట ల్యాండర్‌కు ‘విక్రమ్‌’ అని నామకరణం చేశారు. మెకానికల్‌ ఇంటర్‌ఫేస్‌ ద్వారా మూడింటిని అనుసంధానించారు.

ఈ నెల 15 నుంచి సెప్టెంబరు 6 వరకు

ఈ నెల 14న అర్ధరాత్రి దాటాక 2.51 గంటల నుంచి 3.01 గంటల మధ్య చంద్రయాన్‌-2ను ఇస్రోకు చెందిన భారీ రాకెట్‌ జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3 మోసుకెళుతుంది. భూమికి 170 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో దాన్ని ప్రవేశపెడుతుంది. అక్కడి నుంచి చంద్రయాన్‌-2 దశలవారీగా తన కక్ష్యను పెంచుకుంటూ జాబిల్లి దిశగా వెళుతుంది. నిర్దేశిత సర్దుబాట్లు చేసుకోవడం ద్వారా చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. అక్కడ 100 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో అంతిమంగా స్థిరపడుతుంది. పలు మార్లు అక్కడ పరిభ్రమించాక సరైన సమయంలో ల్యాండర్‌ను జారవిడుస్తుంది. రాకెట్ల సాయంతో ఆ ల్యాండర్‌ తన వేగాన్ని తగ్గించుకుంటూ మెల్లగా జాబిల్లి ఉపరితలంపై సెప్టెంబర్‌ 6 లేదా 7 తేదీల్లో దిగుతుంది. అందులో నుంచి రోవర్‌ బయటకు వచ్చి చంద్రుడిపై తిరగటం మొదలెడుతుంది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.