Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఇలా చేస్తే ‘గోదావరి’ సద్వినియోగం


వడ్డే, కంభంపాటి సూచనలు
ఈనాడు - అమరావతి

ఆంధ్రప్రదేశ్‌ భూభాగం నుంచే గోదావరి జలాలు కృష్ణమ్మకు మళ్లించాలని వ్యవసాయశాఖ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అభిప్రాయపడ్డారు. గోదావరి జలాలు సోమశిలకు మళ్లిస్తూ దిగువ అవసరాలు తీర్చుకోవాలని, ఆ మేరకు ఎగువన శ్రీశైలం జలాలను రాయలసీమ, తెలంగాణ ఎగువ ప్రాజెక్టులకు వినియోగించుకోవాలని జలవనరులశాఖ నిపుణులు కంభంపాటి పాపారావు పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డి, ఇతర పథకాలకు తెలంగాణ వారి భూభాగం నుంచి గోదావరి జలాలు మళ్లించుకోవచ్చని అభిప్రాయపడ్డారు.

సంయుక్త ప్రాజెక్టులు కాదు-స్వతంత్ర ప్రాజెక్టులతోనే..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు సంయుక్తంగా కొత్త ప్రాజెక్టులు నిర్మించకుండా, ఎవరికి అవసరమైన మేరకు వారు స్వతంత్రంగా కొత్త ప్రాజెక్టులు ఏర్పరుచుకుని గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవచ్చుv. ఇలా చేస్తే ఏ రకంగాను ఒకరిపై మరొకరు ఆధారపడాల్సిన అవసరం ఉండదు.
* శ్రీశైలం ప్రాజెక్టు ఎగువన తెలంగాణ రాష్ట్రానికి బీమా (20టీఎంసీలు), నెట్టెంపాడు (25), కల్వకుర్తి(25) ఎస్‌ఎల్‌బీసీ(30)లకు మొత్తం 100 టీఎంసీల అవసరం ఉంది. తెలంగాణ కొత్త ప్రాజెక్టులు పాలమూరుకు 90టీఎంసీలు, కల్వకుర్తి-2కు 30 టీఎంసీలు మొత్తం 120 టీఎంసీలు కావాలి.
* శ్రీశైలం దిగువన కృష్ణా నదిలో మొత్తం 463 టీఎంసీల నీటి అవసరాలు ఉన్నాయి. నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ కింద తెలంగాణకు 99 టీఎంసీలు, ఏపీకి 33 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి. సాగర్‌ కుడి కాలువ కింద 132 టీఎంసీలు ఏపీకి, కృష్ణా డెల్టా వ్యవస్థకు 181 టీఎంసీలు, హైదరాబాద్‌ తాగునీటికి 19 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి. ఈ 463 టీఎంసీల నీటిని శ్రీశైలం నుంచి దిగువకు వదలకుండా 118 టీఎంసీలు తెలంగాణ, 345 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్‌ వినియోగించుకోవాలి.
* గోదావరి జలాలను వివిధ మార్గాల ద్వారా రెండు రాష్ట్రాలు మళ్లించుకోవాలి. తెలంగాణ అవసరాల కోసం దుమ్ముగూడెం నుంచి సాగర్‌ టెయిల్‌పాండ్‌కు 118 టీఎంసీలు, తుపాకులగూడెం నుంచి 120 టీఎంసీలు (పాలమూరు ఎత్తిపోతల, కల్వకుర్తి -2 ఎత్తిపోతల కోసం), సీతారామ ఎత్తిపోతల ద్వారా మరో 20 టీఎంసీలు తీసుకోవాలి. ఏపీ అవసరాల కోసం పోలవరం జలాశయం నుంచి 400 టీఎంసీలు సోమశిలకు మళ్లించుకోవాలి.
* కృష్ణాలో 75శాతం విశ్వసనీయ లభ్యత మేరకు మరో 200 టీఎంసీల మిగులు జలాలు వస్తే వాటిని ఏపీ అవసరాల కోసం వినియోగించుకోవచ్చు. ఎలాగూ ఎగువ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు నీరు అందే అవకాశం ఉంది కాబట్టి కృష్ణా మిగులు జలాలు ఇలా వాడుకోవచ్చు. ఇలా చేస్తే ఇక శ్రీశైలం జలాశయానికి ప్రత్యేకంగా గోదావరి నుంచి మళ్లింపు అవసరం ఉండదు.

 
 
 
 

 

- కంభంపాటి పాపారావు, జలవనరుల నిపుణులు

(విశ్రాంత ఇంజినీరు, గోదావరి పెన్నా అనుసంధాన ప్రతిపాదనపై ఒక ముసాయిదా సిద్ధం చేశారు. హంద్రీనీవా ఎత్తిపోతల ప్రణాళికలోనూ  భాగస్వాములు)

ఆంధ్రప్రదేశ్‌ భూభాగం నుంచే మళ్లించాలి


పోలవరం కుడి కాలువ కుడి గట్టు ఆధారంగా మరో సమాంతర కాలువను ఏర్పరచాలి. ఆ నీటిని కృష్ణా నదిలోకి తీసుకురావాలి. వైకుంఠపురం వద్ద బ్యారేజి నిర్మించే పనులకు ఇప్పటికే టెండర్లు అప్పగించారు. ఆ బ్యారేజిలోకి మళ్లించాలి. అక్కడి నుంచి పులిచింతల డ్యామ్‌లోకి ఎత్తిపోయాలి. అక్కడి సమీపంలోని నాగార్జునసాగర్‌ కాలువలోకి నీటిని ఎత్తిపోతల ద్వారా మళ్లించాలి. ఈ నీటి ద్వారా నాగార్జునసాగర్‌ కుడి కాలువ ఆయకట్టు అవసరాలు తీర్చుకోవాలి. మొదట్లో ప్రతిపాదనలు రూపొందించినా అనంతర కాలంలో పక్కకు పెట్టిన నాగార్జునసాగర్‌ రెండో దశ పనులు కూడా ఈ నీటితో చేపట్టే ఆస్కారం ఉంటుంది.
* ఈ ప్రణాళిక వల్ల ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 512 టీఎంసీల కృష్ణా జలాల్లో కనిష్ఠంగా 200 టీఎంసీలు నీటి అవసరాలను గోదావరి జలాల ద్వారా వినియోగించుకోవచ్చు. ఇక్కడ ఇలా 200 టీఎంసీలు వినియోగించుకుంటే ఆ మేరకు ఆ నీటిని శ్రీశైలం నుంచి హంద్రీ నీవా, గాలేరు నగరి, వెలిగొండ ప్రాజెక్టులకు వినియోగించుకోవచ్చు. తెలంగాణ చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, నెట్టెంపాడు, కల్వకుర్తి తదితర ప్రాజెక్టులకు అవసరమైన నీటిని గోదావరి నుంచి ఆ ప్రభుత్వ ఖర్చుతో మళ్లించుకోవడం సముచితంగా ఉంటుంది.

- వడ్డే శోభనాద్రీశ్వరరావు, వ్యవసాయశాఖ మాజీ మంత్రి

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.