close

ప్ర‌త్యేక క‌థ‌నం

వేగంగా నిండుతున్న శ్రీశైలం

రోజుకు అయిదు అడుగుల మేర చేరిక
ఈనాడు - హైదరాబాద్‌

శ్రీశైలం జలాశయానికి ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. రోజుకు దాదాపు అయిదు అడుగుల మేర నీటి మట్టం పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా గురువారం మధ్యాహ్నానికి 875.70 అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి 3.18 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ఇదంతా కృష్ణానది నుంచి వస్తున్నదే. కర్ణాటకలో ఉజ్జయిని (భీమా నదిపై) ప్రాజెక్టు కూడా పూర్తిస్థాయిలో నిండింది. అక్కడి నుంచి దిగువకు 1.25 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. భీమా నది ద్వారా ఈ వరద నారాయణపేట జిల్లా కృష్ణా మండలం సమీపంలో కృష్ణానదిలో కలుస్తుంది. తుంగభద్రలో కూడా ప్రవాహం పెరిగింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు సగానికి నిండింది. రోజుకు దాదాపు ఎనిమిది టీఎంసీల స్థాయిలో ప్రాజెక్టులో నీటి నిల్వ పెరుగుతోంది. సుమారు అయిదు రోజుల్లో ఈ జలాశయం నుంచి కూడా ప్రవాహం దిగువకు రానుంది. తుంగభద్ర నది జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ సమీపంలో కృష్ణానదిలో కలుస్తుంది. దీంతో అయిదు రోజుల్లో శ్రీశైలానికి ప్రవాహం భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

గోదావరి పరీవాహకంలో...
గోదావరి పరీవాహకంలో ఎల్లంపల్లి దిగువన నదిలో ప్రవాహం కొనసాగుతోంది. గురువారం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ 46 గేట్లను ఎత్తి ఉంచారు. 2.86 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా 2.86 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. అన్నారం బ్యారేజీలో 17 గేట్లను తెరిచారు. ఇన్‌ఫ్లో 1,03,000 క్యూసెక్కులు ఉండగా అవుట్‌ఫ్లో అంతే మేర ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల, వెంకటాపురం మండలాల్లో కురుస్తున్న వర్షాలకు తాలిపేరు ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో కురుస్తున్న వర్షాలకు కిన్నెరసాని వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోనూ వాగులు ఉప్పొంగుతున్నాయి. పేరూరు వద్ద గోదావరిలో 6.53 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. ధవళేశ్వరం ఆనకట్టను దాటి 9.87 లక్షల క్యూసెక్కుల వరద సముద్రంలో కలుస్తోంది.

భద్రాద్రిలో మొదటి ప్రమాద హెచ్చరిక
భద్రాచలం, న్యూస్‌టుడే:  భద్రాచలం వద్ద గోదావరికి వరద పోటెత్తుతోంది. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో 43 అడుగులు రాగా మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఆ తర్వాత వరద 42 అడుగులకు తగ్గి సాధారణ స్థాయికి చేరింది. గురువారం మళ్లీ పెరుగుదల చోటు చేసుకుని మధ్యాహ్నం 3 గంటలకు 43 అడుగులు రావడంతో మొదటి ప్రమాద హెచ్చరిక అమల్లోకి వచ్చింది. రాత్రి 9 గంటలకు 45.2 అడుగులకు చేరుకుంది. వరద 48 అడుగులకు చేరుకుంటే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.