Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

లక్ష కోట్ల స్థిరాస్తి వ్యాపారం

దూసుకుపోతున్న రియల్‌ రంగం
అమ్మకాలు, కొనుగోళ్లు లక్ష కోట్లకు పైనే
రిజిస్ట్రేషన్ల విలువే రూ.85 వేల కోట్లు
ప్రభుత్వ ధరకంటే 40 శాతం ఎక్కువకు రిజిస్ట్రేషన్‌
మూడు లక్షల ఎకరాల వ్యవసాయ భూముల అమ్మకం
రియల్‌ రారాజు రంగారెడ్డి జిల్లా
హైదరాబాద్‌ చుట్టుపక్కల కొనసాగుతున్న జోరు
విస్తరిస్తున్న అపార్ట్‌మెంట్ల సంస్కృతి
ఈనాడు - హైదరాబాద్‌

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ 1.82 లక్షల కోట్ల రూపాయలు. రాష్ట్రంలో గత ఆర్థిక సంవత్సరంలో భూములు, ఫ్లాట్లు, ప్లాట్ల క్రయ విక్రయాల్లో చేతులు మారింది అక్షరాలా లక్ష కోట్ల రూపాయలపైనే. పెట్టుబడి... అవసరం...అంతకు  మించి ఆస్తులకు పెరుగుతున్న డిమాండ్‌ నేపథ్యంలో ఒక్క 2018-19 ఆర్థిక సంవత్సరంలోనే రాష్ట్రంలో లక్ష కోట్లు చేతులు మారడం విశేషం. స్థిరాస్తుల క్రయ విక్రయాలలో గత రికార్డులు తుడిచిపెట్టుకుపోతున్నాయి. శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌ మహానగరం... చుట్టుపక్కల జిల్లాల్లో దూసుకుపోతున్న రియల్‌ రంగం నేపథ్యంతోపాటు రాష్ట్రంలో మిగిలిన ప్రధాన నగరాలు...పట్టణాల్లో కూడా శరవేగంగా పెరుగుతోంది. ఇళ్లు, ఇళ్ల స్థలాలు...వ్యవసాయ భూములు విక్రయాల జోరు కొనసాగుతోంది. రాష్ట్రంలో 2018-19 ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్‌ శాఖ రిజిస్టర్‌ చేసిన భూములు, ప్లాట్లు, ఫ్లాట్ల విలువ రూ.85 వేల కోట్లకు పైనే. ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్‌ విలువకంటే 40 శాతానికి పైగా చెల్లించి రిజిస్ట్రేషన్లు చేసుకోవడం గమనార్హం. వాస్తవానికి అంతకు మించిన ధరకే క్రయవిక్రయాలు జరుగుతాయనేది అందరికీ తెలిసిందే. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో రియల్‌ దూకుడు కొనసాగుతోంది. హైదరాబాద్‌ చుట్టు పక్కల జిల్లాల్లో వ్యవసాయ భూముల విక్రయాలు జోరు మీదున్నాయి. ఒక్క ఏడాదే రాష్ట్రంలో మూడు లక్షల ఎకరాలకు పైగా వ్యవసాయ భూముల విక్రయాలు జరిగాయి. విక్రయించిన భూముల సగటు విస్తీర్ణం ఎకరంలోపే ఉండటం ప్రత్యేకం. 2018-19లో రిజిస్ట్రేషన్ల శాఖకు అంచనాలకు మించి ఆదాయం వచ్చింది. ఐదేళ్లలో రిజిస్ట్రేషన్ల సంఖ్య రెట్టింపు కాగా రాబడి 140 శాతం పెరిగింది. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌లోనూ రంగారెడ్డి జిల్లా ముందు వరుసలో ఉండగా తర్వాతి స్థానాల్లో నల్గొండ, మేడ్చల్‌-మల్కాజిగిరి, మెదక్‌, కరీంనగర్‌లు ఉన్నాయి.

3.2 లక్షల ఎకరాల భూములు అమ్మకం

వ్యవసాయ భూములు బంగారమయ్యాయి. ఒక వైపు నగరాలు, పట్టణాల్లో పెరుగుతున్న జనాభా నేపథ్యంలో విస్తరిస్తున్న నగరాలు, పట్టణాల చుట్టు పక్కల వ్యవసాయ భూముల విక్రయాల జోరు కొనసాగుతోంది. అధికారికంగానే ఒక్క ఏడాదిలో క్రయ విక్రయాలు జరిగిన వ్యవసాయ భూముల విలువ రూ.15 వేల కోట్లు పైనే. రాష్ట్రంలో 3.2 లక్షల ఎకరాల వ్యవసాయ భూములు అమ్మకం జరగ్గా 3.6 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లలో కూడా పూర్వపు మెదక్‌, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్‌లు ముందు వరుసలో ఉన్నాయి. విక్రయించిన వ్యవసాయ భూముల సగటు విస్తీర్ణం ఎకరంలోపే ఉండటం ప్రత్యేకం.

ఇళ్ల కొనుగోలులో మేడ్చల్‌ ముందు

హైదరాబాద్‌ చుట్టు పక్కల ఇండిపెండెంట్‌ ఇళ్లకు, విల్లాలకు డిమాండ్‌ బాగా ఉంది. ఇండిపెండెంట్‌ ఇళ్ల నిర్మాణంలో కూడా హైదరాబాద్‌ చుట్టుపక్కల జిల్లాలే ముందున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 93,750 ఇళ్లు విక్రయించగా, ఈ జిల్లాలోనే అత్యధికంగా 18,915 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. రంగారెడ్డి, హైదరాబాద్‌  తరువాత స్థానాల్లో నిలిచాయి. సంగారెడ్డి జిల్లాలోనూ ఎక్కువ సంఖ్యలో ఇళ్ల విక్రయాలు జరిగాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి సహా చుట్టపక్కల ఉన్న జిల్లాల్లోనే ఇళ్ల విక్రయాలు అధికంగా ఉండటం గమనార్హం. గేటెడ్‌ కమ్యూనిటీలు బాగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇండిపెండెంట్‌ ఇళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఏదో ఒక గూడు కోసం తాపత్రయం

తడిసిమోపెడవుతున్న అద్దెలు....రోజు రోజుకు పెరుగుతున్న ధరల నేపథ్యంలో నివాసానికి గూడు ఏర్పాటు చేసుకునే ఆలోచన పెరుగుతోంది. ఫలితంగానే అవకాశం ఉన్న చోట ఇండిపెండెంట్‌ ఇల్లు... నగరాల్లో అయితే ఫ్లాట్లను కొనుక్కునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఫ్లాట్లకు (అపార్ట్‌మెంట్లకు) మేడ్చల్‌-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువ డిమాండ్‌ ఉంది. రాష్ట్రంలో మొత్తం 69,204 అపార్ట్‌మెంట్ల అమ్మకాలు జరగ్గా మేడ్చల్‌ మల్కాజిగిరి తొలిస్థానంలో నిలిచింది. హైదరాబాద్‌, సంగారెడ్డి తరువాతి స్థానాల్లో ఉన్నాయి. అపార్ట్‌మెంట్ల సంస్కృతి ఇతర జిల్లాల్లోనూ విస్తరిస్తోంది.

ఇళ్ల స్థలాలకే అత్యంత ప్రాధాన్యం

ఇళ్లు, ఫ్లాట్లకంటే ఇళ్ల స్థలాల కొనుగోలుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇళ్లు, ఫ్లాట్ల కంటే ఇళ్ల స్థలాల కొనుగోలుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. రాష్ట్రంలో గత ఏడాది 6.06 లక్షల మంది ఏదో ఒక స్థిరాస్తిని కొనుక్కోగా ఇందులో 4.4 లక్షల మంది ఇళ్ల స్థలాలను కొనుక్కోవడం విశేషం. ఇళ్ల స్థలాల (ప్లాట్లు) క్రయవిక్రయాల్లోనూ రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాలే అగ్రస్థానంలో ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 4,43,864 పాట్ల క్రయవిక్రయాలు జరగ్గా అందులో 2,41,960 సగానికి పైగా ఈ జిల్లాల్లోనే ఉన్నాయి. యాదాద్రి, నల్గొండ జిల్లాలు తరువాతి స్థానంలో ఉన్నాయి.

విస్తరిస్తున్న అపార్ట్‌మెంట్ల సంస్కృతి

నగరాలకే పరిమితమైన అపార్ట్‌మెంట్‌ సంస్కృతి క్రమంగా రాష్ట్రంలో అన్ని జిల్లాలకు విస్తరిస్తోంది. ప్రధాన నగరాలతో పాటు కొత్తగా ఏర్పాటైన జిల్లా కేంద్రాల్లో కూడా అపార్ట్‌మెంట్ల సంస్కృతి పెరుగుతోంది. మంచిర్యాల, సిరిసిల్ల, సిద్దిపేట, భద్రాది కొత్తగూడెం జిల్లాల్లోనూ అపార్ట్‌మెంట్లు వెలుస్తున్నాయి.

అంచనాలు మించిన రిజిస్ట్రేషన్‌ శాఖ ఆదాయం

సాధారణంగా ప్రభుత్వం నిర్దేశించిన మార్కెట్‌ విలువ మేరకు రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటారు. గడచిన ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నిర్దేశించిన రేటు కంటే 40 శాతం ఎక్కువ మొత్తానికి రిజిస్ట్రేషన్లు చేసుకోవడం గమనార్హం.రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.6,612 కోట్ల రాబడి వచ్చింది. రూ.5400 కోట్ల రాబడి వస్తుందని అంచనా వేయగా రూ.1212 కోట్లు అదనంగా వచ్చింది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.