close

ప్ర‌త్యేక క‌థ‌నం

మారుతున్న మధ్యప్రదేశ్‌ రాజకీయం 

చిన్న పార్టీల పెద్ద సవాల్‌ 
ఎస్సీ ఎస్టీ సవరణ చట్టంపై అగ్రవర్ణాల గుర్రు 
భాజపా- కాంగ్రెస్‌లకు కొత్త తలనొప్పులు 
మారుతున్న మధ్యప్రదేశ్‌ రాజకీయం 

మధ్యప్రదేశ్‌ రాజకీయ చరిత్రలో ఈ సారి సరికొత్త సమీకరణలు చోటుచేసుకుంటున్నాయి. దశాబ్దాలుగా రాష్ట్రాన్ని.. అయితే భాజపా, కాదంటే కాంగ్రెస్‌ పాలించాయి. మూడు దఫాలుగానైతే భాజపానే అప్రతిహతంగా ఏలుతోంది. ఎప్పుడూ ద్విముఖ పోరు సాగే ఈ రాష్ట్రంలో ఈ సారి మాత్రం బహుముఖ పోరు తప్పేట్లు లేదు. చిన్న పార్టీలు పెద్ద సవాల్‌ విసురుతున్నాయి. భాజపా, కాంగ్రెస్‌లే కాకుండా.. బరిలో నిలుస్తామంటూ పలు కొత్త పార్టీలూ దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణ తదితర పరిణామాలు రాష్ట్రంలో రాజకీయ చిత్రాన్ని మారుస్తున్నాయి. ఇవే భాజపాకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టేలా ఉన్నాయి.

భోపాల్‌ నుంచి చంద్రకాంత్‌ నాయుడు

బహుముఖం ఎందుకు? 
కొత్తగా పోరు బరిలో.. 
సామాన్య పిచ్డా అల్పసంఖ్యాక్‌ కల్యాణ్‌ సమాజ్‌ (సపాక్స్‌) 
గోంద్వానా గణతంత్ర పార్టీ 
జై ఆదివాసి యువ సంఘటన్‌ 
ఆమ్‌ ఆద్మీ పార్టీ

బహుజన్‌సమాజ్‌ పార్టీ (బీఎస్పీ), సామాన్య పిచ్డా అల్పసంఖ్యాక్‌ కల్యాణ్‌ సమాజ్‌ (సపాక్స్‌), ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)లు ఈ సారి అన్ని స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో నిలుపుతామని ప్రకటించి సరికొత్త రాజకీయ సమీకరణలకు తెరతీశాయి.

ప్రభావవంతమైన ప్రాంతీయ పార్టీ గోంద్వానా గణతంత్ర పార్టీ (జీజీపీ) కూడా పెద్దసంఖ్యలో సీట్లలో పోటీకి ప్రణాళికలు రచిస్తోంది. తొలుత కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటారని వార్తలు వచ్చినా తాజాగా ఆ పార్టీ అధినేత హీరాసింగ్‌ ఖండించారు. మధ్యప్రదేశ్‌తోపాటు ఛత్తీస్‌గఢ్‌లోనూ తాము సమాజ్‌వాదీ పార్టీతో జత కడతామని ప్రకటించారు. రెండు రాష్ట్రాల్లోని గిరిజన నియోజకవర్గాల్లో ఈ పార్టీకి మంచి పట్టుంది.

పశ్చిమ మధ్యప్రదేశ్‌లో గిరిజనుల ప్రాబల్యమున్న 80 స్థానాల్లో పోటీకి ఎస్టీ యువజన సంస్థ జై ఆదివాసి యువ సంఘటన్‌(జేఏవైఎస్‌) సిద్ధమవుతోంది. దీనికి సారథ్యం వహిస్తున్న హీరాలాల్‌ ఎయిమ్స్‌లో యువవైద్యుడు. ప్రస్తుతం ధార్‌ జిల్లాలో ఉంటూ గిరిజన యువతపై పట్టు సాధిస్తున్నారు. యువ సంఘటన్‌తో పొత్తు పెట్టుకుందామని తొలుత కాంగ్రెస్‌ భావించింది. కానీ, సంఘటన్‌ అందుకు సిద్ధంగా లేదు. బాలీవుడ్‌ నటుడు గోవిందాతో ప్రచారం చేయించేందుకు సైతం ఈ పార్టీ ప్రణాళికలు సిద్ధంచేసుకుంది.

మారుతున్న మధ్యప్రదేశ్‌ రాజకీయం 

ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఏర్పాటైన సంస్థ సపాక్స్‌.. రాజకీయ పార్టీగా అవతరించాలని ఇటీవలే నిర్ణయించింది. రాష్ట్రంలోని మొత్తం 230 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను బరిలో నిలుపుతామని సపాక్స్‌ అధినేత హీరాలాల్‌ త్రివేది ప్రకటించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్‌కు వెళ్లకుండా సపాక్స్‌ను తెరపైకి తెచ్చారనే వార్తలు మొదట్లో చక్కర్లు కొట్టాయి. కానీ, ప్రస్తుత భాజపా నాయకత్వంపట్ల వ్యతిరేకతే చోదకశక్తిగా ఆ పార్టీ ముందుకు వెళ్తున్నట్లు తాజా పరిణామాలు స్పష్టంచేస్తున్నాయి.

బీఎస్పీ, ఎస్పీల కొత్త పల్లవి, సపాక్స్‌, జేఏవైఎస్‌ల అరంగేట్రంతో కీలక ప్రత్యర్థులైన కాంగ్రెస్‌, భాజపాలకు ఎదురయ్యే కొత్త సవాళ్లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

రిజర్వేషన్లతో మొదలైన సమరం 
ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందినప్పటి నుంచీ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. తమకు బాసటగా నిలిచే అగ్రవర్ణాల నుంచి భాజపా వ్యతిరేకతను చవిచూస్తోంది. సామాజిక మాధ్యమాల్లోనూ వారు కాషాయ పార్టీపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ అంశంలో పార్టీ శ్రేణులు తీవ్ర గందరగోళంలో ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారంటూ ఎస్సీ వర్గానికి చెందిన జాతవ్‌లు చేపట్టిన నిరసన ర్యాలీల సందర్భంగా పోలీసు కాల్పుల్లో ఐదుగురు మరణించారు. ఈ అల్లర్లను వినియోగించుకొని ఆ వర్గంలో జాతవ్‌లను ఒంటరి చేసేందుకు భాజపా చేసిన ప్రయత్నాలు కొంత సఫలీకృతమయ్యాయి. ఈ పరిణామంతో జాతవ్‌లే తమ బలంగా భావించే బీఎస్పీకి దళిత ఓటుబ్యాంకుపై కొంత పట్టు సన్నగిల్లింది. సవరణ బిల్లుకు అనుకూలంగా, ప్రతికూలంగా తమ ఉనికిని చాటుకోవాలని చిన్న పార్టీలు  నిర్ణయించాయి. అందుకే ఎప్పుడూ లేనివిధంగా పెద్దసంఖ్యలో సీట్లలో పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. మొత్తంమీద రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీ చట్టం సవరణ బిల్లు తదితర అంశాలు ఈ సారి ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయని చెబుతున్నారు. 
 

మారుతున్న మధ్యప్రదేశ్‌ రాజకీయం అతివిశ్వాసంతో చేటు? 
ప్రజాకర్షక పథకాలే అస్త్రాలుగా చేసుకొని భాజపా నేత శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ మూడు దఫాలుగా సీఎం పీఠంపైనే ఉంటున్నారు. ఈ సారీ గెలుపు తమదేననే ధీమాతో ఉన్నారు. అయితే, ఓ వైపు కాంగ్రెస్‌, మరోవైపు చిన్నపార్టీల జోరు నేపథ్యంలో అతివిశ్వాసాన్ని వీడాలని భాజపా అనుకూల రాజకీయ విశ్లేషకులు సైతం ఆ పార్టీని హెచ్చరిస్తున్నారు. అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న కాంగ్రెస్‌ విజయం సాధిస్తే ఆ ఘనతలో ఎక్కువ భాగం భాజపాకే దక్కుతుందని చెబుతున్నారు. ‘‘ఈ ఎన్నికలను భాజపా సులువుగా తీసుకోవడానికి ఎంతమాత్రం వీల్లేదు. కాంగ్రెస్‌కు కొత్తగా పోయేదేంలేదు. కానీ, ఏమాత్రం ఆదమరుపుగా వ్యవహరించినా ప్రభుత్వ వ్యతిరేక పవనాల్లో భాజపా కొట్టుకుపోవడం ఖాయం’’ అని గతంలో అధికార పార్టీకి సన్నిహితంగా ఉన్న సీనియర్‌ జర్నలిస్టు రమేశ్‌ శర్మ విశ్లేషించారు. మరోవైపు బహుముఖ పోటీతో దూరమయ్యే ఓట్లు 20 శాతమే ఉంటాయని.. మిగతా 80 శాతం ఓట్లు ప్రధాన ప్రత్యర్థులైన భాజపా, కాంగ్రెస్‌ల మధ్యే దోబూచులాడుతాయని ఓ వర్గం రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
బీఎస్పీ పట్టుకోల్పోతోందా.. 
మారుతున్న మధ్యప్రదేశ్‌ రాజకీయం ఒకప్పుడు బీఎస్పీకి చంబల్‌, వింధ్య ప్రాంతాల్లో కొంత ప్రాబల్యం ఉండేది. భింద్‌, మొరేనా ప్రాంతాల్లో జాతవ్‌లు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండటంతో 2013లో 35 స్థానాల్లో పోటీ చేసి 4 స్థానాలను(6.29 శాతం ఓట్లు) మాయావతి పార్టీ కైవసం చేసుకుంది. అంతకుముందు ఎన్నికల్లో 8.97 శాతం ఓట్లతో ఏడు సీట్లను సాధించింది. ఇప్పటివరకు బీఎస్పీ ఓట్ల శాతం 8.97 గరిష్ఠం. ఈ నేపథ్యంలో మాయావతి డిమాండ్‌ చేస్తున్న 50 శాతం సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ రాష్ట్ర సారథి కమల్‌నాథ్‌ ససేమిరా అంటున్నారు. అన్ని సీట్లు బీఎస్పీకి ఇవ్వడమంటే అప్పనంగా అధికారాన్ని భాజపాకు అప్పగించడమేననే దృష్టిలో కాంగ్రెస్‌ ఉంది. ఈ సారి ఇతర ప్రాంతీయ పార్టీల రంగప్రవేశంతో బీఎస్పీ ఓట్లు కూడా గణనీయంగా చీలనున్నాయని అంచనా వేస్తున్నారు.
ఎస్పీ తప్పటడుగులతో మొదలు? 
మారుతున్న మధ్యప్రదేశ్‌ రాజకీయం మధ్యప్రదేశ్‌ రాజకీయాల్లో ఈ సారి సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ఎత్తులు తప్పటడుగులతో మొదలయ్యాయని విశ్లేషకులు చెబుతున్నారు. గిరిజనుల్లో మంచి పట్టున్న ఆ పార్టీ నేత అర్జున్‌ ఆర్య ఎన్నికల ముంగిట.. ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. ఈ ప్రకటన వెనక ఉద్దేశాలు వేరే ఉన్నాయా?అన్నది అనుమానం.. ఇటీవల రైతు ఆందోళనల్లో ఆర్య అరెస్టవగా.. విడిపించేందుకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సహకరించారు. ఆర్య త్వరలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నారని.. అందుకే ఎస్పీ నేతలతో సరిగా ఉండటం లేదనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్‌ తిరుగుబాటు అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలన్న ఎస్పీ అధినేత అఖిలేష్‌యాదవ్‌ ఆలోచన వెనక ఎన్నికల అనంతరం చెలిమి సంకేతాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మధ్యప్రదేశ్‌ ఎన్నికలు 
పోలింగ్‌ నవంబరు 28 
ఫలితాలు డిసెంబరు 11

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.