close

ప్ర‌త్యేక క‌థ‌నం

అందుకే నచ్చాను 

కెప్టెన్‌ నమ్మకాన్ని నిలబెట్టా

గాదె హనుమ విహారి.. ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టు సిరీస్‌ విజయంతో చరిత్ర సృష్టించిన టీమ్‌ఇండియా జట్టులోని ఏకైక తెలుగు తేజం. ఓపెనర్‌గా, మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌గా.. ఆఫ్‌ స్పిన్‌ బౌలర్‌గా ఈ సిరీస్‌లో విహారి తన వంతు పాత్ర పోషించాడు. కెప్టెన్‌ కోహ్లి నుంచి కూడా ప్రశంసలు అందుకుని.. మధురానుభూతులతో హైదరాబాద్‌ చేరుకున్న విహారి ‘ఈనాడు’తో మాట్లాడాడు. అతను చెప్పిన టెస్టు సిరీస్‌ ముచ్చట్లు...

జీవితాంతం గుర్తుంచుకుంటా 
అద్భుతమైన విజయమిది. ఆస్ట్రేలియాకు బయల్దేరే సమయంలోనే అందరం అనుకున్నాం.. టెస్టు సిరీస్‌ విజయంతో తిరిగి రావాలని. కోహ్లి ఇచ్చిన సందేశం కూడా అదే. అప్పట్నుంచే మా అందరిలో
విజయేచ్ఛ రగులుతూ ఉంది. ప్రతి రోజూ. ప్రతి సందర్భంలో విజయం గురించే ఆలోచించాం. మ్యాచ్‌లో ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవద్దని గట్టిగా అనుకున్నాం. గత పర్యటనల వైఫల్యాలు పునరావృతం కాకూడదని భావించాం. అలాగే ఆడాం. ఫలితం రాబట్టాం. చరిత్రాత్మక సిరీస్‌ విజయంలో భాగమైనందుకు ఎంతో ఆనందంగా ఉంది. నా జీవితాంతం గుర్తుంచుకునే సిరీస్‌ ఇది.
 
వ్యూహం అదే... 
పెర్త్‌ టెస్టులో బరిలో దిగిన జట్టులో ఒక్క స్పిన్నర్‌ కూడా లేడు. అందుకే కోహ్లి.. నా చేతికి బంతినిచ్చాడు. ఆ సమయంలో వికెట్లు తీయడం కీలకం. 2 వికెట్లు పడగొట్టా. మెల్‌బోర్న్‌ టెస్టులో ఓపెనర్‌ కావాల్సొచ్చాడు. నేను రెగ్యులర్‌ ఓపెనర్‌ కాదని తెలిసి కూడా ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తావా? అని కోహ్లి అడిగాడు. ఎలాంటి ఆలోచన చేయకుండా సరే అన్నా. పెర్త్‌ టెస్టులో ఓడి.. మానసికంగా బలహీనంగా ఉన్న సమయంలో ఇన్నింగ్స్‌ ఆరంభించాల్సి వచ్చింది. 20 ఓవర్ల వరకు వికెట్‌ పడకుండా ఉంటే చాలన్నది వ్యూహం. ఓపెనర్‌గా 66 బంతులు ఎదుర్కొన్నా. 19వ ఓవర్లో ఔటయ్యా. అప్పటికే బంతి పాతబడింది. చివరి టెస్టులో ఆరోస్థానంలో బ్యాటింగ్‌ చేయమన్నారు. అక్కడా పరుగులు చేశా. ప్రతి సందర్భంలోనూ నాకు గుర్తింపు దక్కడం ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. అన్ని అవకాశాలు రావడం కూడా నా అదృష్టం. కెప్టెన్‌ నాకు అప్పగించిన ప్రతి బాధ్యతను సమర్థంగా నిర్వర్తించడం ఎక్కువగా సంతృప్తినిచ్చింది. కోహ్లి కూడా నా విషయంలో ఫిదా అయ్యాడు. ప్రతిసారీ కోహ్లి నమ్మకాన్ని నిలబెట్టినందుకే అతడికి నేను నచ్చాను. 
అతడిని చూస్తే చాలు.. 
కోహ్లి, పుజారాలది భిన్నమైన టెక్నిక్‌. మైదానంలో కోహ్లి కరెంట్‌లా ఉంటాడు. అతడిని చూస్తే చాలు స్ఫూర్తి రగులుతుంది. బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌లో కోహ్లి అత్యంత శక్తిమంతుడిలా కనిపిస్తాడు. అత్యంత త్రీవతతో ఆడతాడు. పుజారా నిదానంగా పని కానిచ్చేస్తాడు. ఎక్కువ ఆవేశపడకుండా ఆడతాడు. వీరిద్దరితో కలిసి ఆడటం చాలా సులువు. ఇద్దరూ పరుగులు రాబడతూ బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తారు. అవతలి ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌కు పని సులువవుతుంది. 
అందరూ అభినందించారు 
సీనియర్‌ ఆటగాళ్లను కాదని నాకిచ్చిన అవకాశాన్ని సవాల్‌గా తీసుకున్నా. ఒత్తిడిగా భావిస్తే ఒక్క బంతి కూడా ఎదుర్కోలేను. కెరీర్‌ ఆరంభంలో ఉన్నా. ఆడితే నిలదొక్కుకుంటా. ప్రతి బంతిని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్నా. ఏకాగ్రత కోల్పోకుండా ఆడా. ఊహించని విధంగా వచ్చిన షార్ట్‌బంతికి ఔటయ్యా. మంచి ఆరంభాన్ని కొనసాగిస్తే బాగుండేదనిపించింది. నేను 10 పరుగులు చేయకపోయినా డ్రెస్సింగ్‌ రూమ్‌లో ప్రతి ఒక్కరు అభినందించడం గొప్పగా అనిపించింది. 
ఒత్తిడి లేదు 
ఏడాది నుంచి మయాంక్‌, నేను ఇండియా-ఎ తరఫున ఆడుతున్నాం. అతను ఓపెనర్‌, నేను వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌. ఇద్దరం కలిసి చాలా ఇన్నింగ్స్‌లు ఆడాం. ఒకరి ఆటపై మరొకరికి అవగాహన ఉంది. మెల్‌బోర్న్‌ టెస్టులో ఇద్దరం కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించాల్సి వచ్చినప్పుడు మాకేం కొత్తగా అనిపించలేదు. ఒత్తిడి అసలే లేదు. ఎప్పట్లాగే ఆత్మవిశ్వాసంతో మైదానంలో అడుగుపెట్టాం. అరంగేట్ర మ్యాచ్‌లోనే మయాంక్‌ అదరగొట్టాడు. 
ఇక దూకుడు పెంచుతా 
టీమ్‌ఇండియా వన్డే, టీ20 జట్లకు ఎంపికవడమే తర్వాతి లక్ష్యం. అందుకు ఐపీఎల్‌ సరైన వేదికగా భావిస్తున్నా. ఐపీఎల్‌కు 2 నెలలకు పైగా విరామం ఉంది. ఈ సమయంలో టీ20లకు అనుగుణంగా ఆటను మార్చుకుంటా. ఫార్మాట్‌ ఏదైనా షాట్లు అవే. టెక్నిక్‌ అదే. టీ20ల్లో తీవ్రత, వేగం ఎక్కువ. నా ఆటతీరులో దూకుడు తీసుకొస్తా.
- ఈనాడు, హైదరాబాద్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.