close

ప్ర‌త్యేక క‌థ‌నం

సేంద్రియానికి సైసై 

ముందుకొస్తున్న రైతాంగం 
దళారులకు దూరంగా  సొంతంగా మార్కెట్‌ ఏర్పాట్లు 
మక్కువ చూపుతున్న వినియోగదారులు 
ఆసరా అవుతోన్న సర్కారీ విధానం

సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, పండ్లసాగుపై రైతుల్లో ఆసక్తి పెరుగుతోంది. వినియోగదారులూ మక్కువ చూపుతోండటంతో అనేక మంది ఇదే బాట పడుతున్నారు. విస్తరిస్తోన్న సేద్యం నేపథ్యంగా దళారులకు దూరం జరుగుతూ సొంతంగానే మార్కెట్‌ అవకాశాలూ సృష్టించుకుంటున్నారు.

సేంద్రియానికి సైసై 

జడ్బీఎన్‌ఎఫ్‌పై ప్రచారం 
ప్రభుత్వం పెట్టుబడి లేని ప్రకృతి సేద్య విధానం(జడ్బీఎన్‌ఎఫ్‌)పై విస్తృత ప్రచారంతోపాటు శిక్షణ ఇస్తోంది. 2016-17 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 704 గ్రామాల్లో 40,656 మంది రైతులతో సాగు ప్రారంభించగా 2017-18 నాటికి 972 గ్రామాల్లో 1.63 లక్షల మందికి విస్తరించినట్లు స్పష్టం చేసింది. 2018-19 ఆఖరుకు 5.23 లక్షల మంది రైతులు ఈ విధానంలోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.

సామాజిక మాధ్యమాల ద్వారా 
సేంద్రియ ఉత్పత్తుల కొనుగోలుకు ఆర్గానిక్‌ దుకాణాలతోపాటు పట్టణ వినియోగదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. నేరుగా పొలాల వద్దకే వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. అయితే పురుగుమందులు వాడి పండించే పంటలతో పోలిస్తే ఈ విధానంలో దిగుబడులు తక్కువగానే వస్తున్నాయి. నష్టాలు వచ్చినా భరించగలమనే పెద్ద రైతులు, విద్యావంతులే ఇటువైపు ఆసక్తి చూపుతున్నారు. సామాజిక మాధ్యమాల సాయంతో తెగుళ్ల నియంత్రణకు ఎలాంటి కషాయాలు వాడాలో తెలుసుకుంటున్నారు. క్లస్టర్ల వారీగా ఇలాంటి వారిని గుర్తించి ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టిపెట్టాల్సి ఉందని రైతులు స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో మార్కెట్‌కు అనుగుణంగా పంటలసాగుపై రైతులు దృష్టిసారించాలని ప్రకాశం జిల్లా అద్దంకి ఉద్యాన అధికారి నవీన్‌ వివరించారు. ప్రజల ఆహారపు అలవాట్లను గమనిస్తూ డిమాండుకు తగ్గట్లుగా పంటలను ఎంచుకోవాలన్నారు.

ఎకరంలో 14 పంటలు సేంద్రియానికి సైసై 
నల్లబోతుల వేణుగోపాల్‌. ఈయన ఎకరంలో రక్షిత సేద్యం(షేడ్‌నెట్‌) ఏర్పాటుచేసి సేంద్రియ విధానంలో 14 రకాల పంటలు పండిస్తున్నారు. నారునూ విక్రయిస్తున్నారు. రక్షిత సేద్యానికి రూ.26లక్షల వ్యయం కాగా రాయితీగా ప్రభుత్వం రూ.10.85లక్షలు ఇచ్చింది. పంటల పెట్టుబడి రాయితీగా రూ.2.80 లక్షల వరకు అందించింది. కూరగాయలు, పండ్ల సాగు, నారు పెంపకం ద్వారా తాను పెట్టిన పెట్టుబడి తొలి రెండేళ్లలో తిరిగి వస్తుందని వేణుగోపాల్‌ వివరించారు. క్యాబేజి, బ్రకోలి, ఎర్ర క్యాబేజి, కాలీఫ్లవర్‌, యూరోపియన్‌ కుకుంబర్‌, చెర్రీ టమోటా, బేబీకార్న్‌, టమోటా, బీన్స్‌, కొత్తిమీర, క్యాప్సికం, చామంతి, బంతి, పుచ్చ సాగు చేస్తున్నారు. విజయవాడ, గుంటూరు, ఒంగోలు ప్రాంతాల నుంచి పంటలు చూడటానికి వచ్చే వారంతా వినియోగదారులేనని ఆయన వివరించారు. సేంద్రియ విధానంలో పండించినా ప్రస్తుతానికి మార్కెట్‌ ధరలకే విక్రయిస్తున్నానన్నారు. 
65 సెంట్లు.. 12 టన్నులు: షేడ్‌నెట్‌ పక్కనే 65 సెంట్లలో ఉల్లి వేసి సూక్ష్మసేద్య విధానంలో నీరందించారు. సుమారు 12 టన్నుల దిగుబడి రావచ్చని వేణుగోపాల్‌ వివరించారు. కిలో రూ.9 చొప్పున పొలం వద్దే అమ్ముతున్నట్లు చెప్పారు.

ప్రకాశం బెండకు ఆదరణ సేంద్రియానికి సైసై 
ప్రకాశం జిల్లా మేదరమెట్ల రైతు పూసాల శ్రీనివాసరావు సేంద్రియ విధానంలో పండించిన బెండకు చక్కని ఆదరణ లభిస్తోంది. 9 ఎకరాల్లో బెండ సాగుకు ఆయన అగ్ని, నామాస్త్ర,ం వేప, నువ్వులనూనెలనే పిచికారీ చేశారు. మూడెకరాల్లో బొప్పాయితోపాటు శనగ, కంది, వరి సాగు చేస్తున్నారు.

2.5 ఎకరాల్లో పంటకుంట: 25 ఎకరాల్లో సాగుకు సరిపడా నీటి కోసం రెండున్నర ఎకరాల్లో రూ.20లక్షల వ్యయంతో పంటకుంట తవ్వించారు. ఈ మొత్తాన్ని ఉద్యానశాఖ రాయితీపై ఇచ్చింది. మొత్తం సూక్ష్మసేద్య విధానంలోనే నీరందిస్తున్నాన్నారు.

పెరుగుతున్న డిమాండు: కూరగాయలతోపాటు బొప్పాయి, వరి, కంది, శనగ, మినుములు సొంతగానే విక్రయిస్తున్నారు. పప్పు, గుళ్లు చేయించి అమ్మడం వల్ల అదనపు ధర లభిస్తోందని శ్రీనివాసరావు చెప్పారు. బెంగళూరు, హైదరాబాద్‌ ప్రాంతాలవారు వాటిని ఎక్కువగా తీసుకెళ్తున్నారన్నారు. ఆర్గానిక్‌ దుకాణాల నుంచి డిమాండున్నా తమ వద్దకు వచ్చే వినియోగదారులకే ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఈ విధానంలో విత్తనాలు, కూలీల ఖర్చు మినహాయిస్తే పెద్దగా పెట్టుబడి అవసరం లేదన్నారు. పురుగుమందులు వాడకపోవడం వల్ల కూరగాయ పంటల్లో దిగుబడులు తక్కువగానే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

వాటికి బదులు సేంద్రియ ఎరువులివ్వాలి.. సేంద్రియానికి సైసై 
‘ఆవును కొని ఘనజీవామృతం, అస్త్రాలు తయారు చేసుకోవడం చిన్న రైతులకు సాధ్యం కాదు. పొదుపు సంఘాల ద్వారా వీటిని తయారుచేయించి ప్రభుత్వమే ఉచితంగా ఇవ్వాలి’ అని రైతు నేస్తం వ్యవస్థాపకులు వై.వెంకటేశ్వరరావు సూచించారు. ‘ప్రస్తుతం రసాయన ఎరువులపై కేంద్రం రూ.వేల కోట్ల రాయితీలిస్తోంది. సేంద్రియ సాగు ద్వారా ఈ సొమ్మంతా మిగిలినట్లే. అందులో కొంతైనా ఆ రైతులకు ప్రోత్సాహకంగా ఇవ్వాలి. రైతులను పెద్దపెద్ద సంస్థలతో అనుసంధానించడం ద్వారా ఉత్పత్తుల కొనుగోలుకు చర్యలు తీసుకోవాలి’ అని ఆయన పేర్కొన్నారు.

 

 

 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.