close

ప్ర‌త్యేక క‌థ‌నం

తోడ్పాటుతోనే అన్నదాతకు మనుగడ 

రాయితీల విస్తృతి పెరుగుతోందంటున్న పనగడియా 
అవే..రైతుల కష్టాల్ని తీర్చలేవని జయతీఘోష్‌ స్పష్టీకరణ 
ఆదాయ సుస్థిరత దక్కేలా చూడాలని స్వామినాథన్‌ సూచన 
వ్యవసాయ సంక్షోభంపై ‘ఈనాడు’తో నిపుణుల వెల్లడి

సత్యపాల్‌ మేనన్‌ 
‘ఈనాడు’ డిజిటల్‌ ప్రతినిధి

న్నికల వేళ అన్ని పార్టీలూ రైతుల అజెండాతోనే ముందుకొస్తున్నాయి. భారీ తాయిలాలు, హామీలతో ముంచెత్తుతున్నాయి. మరోవైపు.. వీటికయ్యే వ్యయభారానికి తగినట్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయ వనరుల్ని సమకూర్చుకునే మార్గాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రుణమాఫీలు, రాయితీలు, తాయిలాల సాధ్యాసాధ్యాలు చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ ఇవి రైతులను సంక్షోభం నుంచి ఎంతమేర బయటపడేస్తాయనే సందేహాలూ ఉన్నాయి. అసలు..వ్యవసాయ సంక్షోభానికి మూల కారణాల్ని ప్రభుత్వాలు గుర్తించగలుగుతున్నాయా? రైతుల సమస్యలకు సమర్థమైన పరిష్కారాలు, వ్యూహాలను గుర్తించడంలో విఫలమవుతున్నాయా? రైతుల ఆర్థిక స్థితిగతుల్ని మెరుగు పరిచేందుకు ఎలాంటి వ్యూహాల్ని అమలు పరచాల్సిన అవసరం ఉంది? ఇలాంటి వ్యవసాయ సంక్షోభం సంబంధిత సమస్యలపై నీతిఆయోగ్‌ మాజీ ఉపాధ్యక్షులు అరవింద్‌ పనగడియా, అభివృద్ధి ఆర్థికవేత్త జయతీ ఘోష్‌, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్‌ తమ అభిప్రాయాలను ‘ఈనాడు’తో పంచుకున్నారు.

సంక్షేమం కోసం వెచ్చించే వ్యయాలన్నింటినీ తాయిలాలు, రాయితీలుగా చూడొద్దు. కొన్ని రాయితీలు ఆర్థిక కార్యకలాపాల క్రియాశీలతను పెంచడంలో తోడ్పడతాయి. రైతులకు నగదు బదిలీకన్నా.. అలాంటి డబ్బుల్ని వ్యవసాయ పునరుద్ధరణ కోసం పెట్టుబడులకు ఉపయోగించడం మంచిది. 

-జయతీఘోష్‌ 

వ్యవసాయం ఆర్థికంగా లాభసాటిగా మారాల్సి ఉంది. అప్పుడే యువరైతులు ఈ రంగంలో కొనసాగుతారు. వ్యవసాయ విధానాల రూపకల్పన ప్రక్రియలో రైతులు, విధానకర్తల మధ్య తగినంత చర్చ జరగడం లేదు. ఇలాంటి చర్చల్ని మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.

- ఎంఎస్‌ స్వామినాథన్‌

కొద్దిపాటి వ్యవసాయ ఆదాయాన్నే చాలామంది పంచుకోవాల్సి వస్తోంది. రైతుల్ని వ్యవసాయం నుంచి బయటికి తీసుకొచ్చి, పరిశ్రమలు, సేవారంగంలో లాభదాయక ఉద్యోగిత కల్పించకపోతే వారిని సౌభాగ్యవంతుల్ని చేయలేం. 

-అరవింద్‌ పనగడియా

సార్వత్రిక ఎన్నికలకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. అన్ని భావజాలాల రాజకీయ పక్షాలూ రైతులకు ఆర్థికంగా పునర్‌ వైభవం కల్పించాలన్న అజెండాతోనే ముందుకొస్తున్నాయి. భారీ తాయిలాలు, హామీలతో ముంచెత్తుతున్నాయి. రైతుబంధు పథకం కారణంగానే తెలంగాణ ఎన్నికల్లో తెరాసకు ఘన విజయం సాధ్యమైందనే వాదన ఉండటంతో, ఇది పలు పథకాలకు మార్గం చూపినట్లయింది. కేంద్రంలో ఎన్డీయే, ఏపీలో తెదేపా సర్కారు రైతులకు నగదు బదిలీ పథకాలు తెచ్చాయి. ఒడిశా, ఝార్ఖండ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతులకు తాయిలాలు ప్రకటించాయి. పలు ఇతర రాష్ట్రాలూ ఇదే బాట పట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఇదే జరిగితే భారత్‌ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రజాకర్షక పథకాన్ని ప్రవేశపెట్టిన దేశంగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఈ పథకాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాలపై పెనుభారాన్నీ మోపనున్నాయి. మరి..ఆ స్థాయి భారం మోయదగినదేనా? అనేదే ప్రశ్నార్థకం. వీటిని తట్టుకునే స్థాయిలో కేంద్రంగానీ, రాష్ట్రాలుగానీ ఆదాయ వనరుల్ని సమకూర్చుకోగలవా? అనే ప్రశ్నలూ తలెత్తుతున్నాయి.

రైతులపై సానుభూతి, సహానుభూతి విషయంలో రాజకీయ ఉద్దేశాలు, లక్ష్యాలు స్పష్టమవుతున్నా.. రుణమాఫీలు, రాయితీలు, తాయిలాల సాధ్యాసాధ్యాలు, వాటి ప్రామాణికత చర్చనీయాంశమైంది. ఈ తరహా మద్దతు చర్యలు రైతులకు ఉపశమనం అందించగలవా? వ్యవసాయ సంక్షోభానికి మూల కారణాల్ని గుర్తించడంలో ప్రభుత్వాలకు సరైన పరిష్కారం దొరకడం లేదా? ప్రస్తుతం దేశ రైతాంగాన్ని పట్టి పీడిస్తున్న వ్యవసాయ సంక్షోభంపై నీతిఆయోగ్‌ మాజీ ఉపాధ్యక్షులు, కొలంబియా విశ్వవిద్యాలయంలో భారత రాజకీయ ఆర్థిక వ్యవస్థ ఆచార్యులు అరవింద్‌ పనగడియా, జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌, అభివృద్ధి ఆర్థికవేత్త జయతీఘోష్‌, ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, హరిత విప్లవ సృష్టికర్త ప్రొ.స్వామినాథన్‌లు ‘ఈనాడు డిజిటల్‌’కు ఇచ్చిన ఇంటర్యూలో తమ అభిప్రాయాలను వెల్లడించారు. 

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం విరివిగా తాయిలాలు పంచే కార్యక్రమంతో ముందుకు సాగుతోంది? ఇలాంటి రుణమాఫీలు, రాయితీలు, తాయిలాలతో దీర్ఘకాలంలో ఏవైనా ప్రయోజనాలు ఉంటాయా?

అరవింద్‌ పనగడియా

ప్రజలు పెద్ద సంఖ్యలో వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న ప్రజాస్వామిక దేశంలో ఎన్నికల సంవత్సరంలో ఇలాంటివి ఇవ్వక తప్పదు. ఇటీవలి సంవత్సరాల్లో వీటి విస్తృతి మరింతగా పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం.. 2003-04 నుంచి గణనీయమైన వృద్ధి నమోదవుతుండటంతో కేంద్ర, రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకు ఆర్థిక పరమైన వెసులుబాటు చిక్కింది.

జయతీఘోష్‌ 

న్నికల ముందు తాయిలాలు వాస్తవానికి చాలా చిన్నవి. పైగా వీటిని చాలా ఆలస్యంగా ఇస్తున్నట్లే. ఎన్నో ఏళ్లుగా ఆర్థిక సామర్థ్యాన్ని, స్థోమతను, జీవనోపాధిని కోల్పోయి, రకరకాల కష్టాలు అనుభవిస్తున్న రైతులు తదితరుల కష్టనష్టాలను ఇవి తీర్చగలవని అనుకోలేం.

ఎంఎస్‌ స్వామినాథన్‌ 

ప్రభుత్వం తాయిలాల్ని పంచే కార్యక్రమానికి దిగిందనే వాదనను అంగీకరించను. దీర్ఘకాలంగా నిర్లక్ష్యానికి గురైన సమస్యలు, అవసరాల్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. వ్యవసాయం ఆర్థికంగా లాభసాటిగా మారాల్సి ఉంది. అప్పుడే యువరైతులు ఈ రంగంలో కొనసాగడం, కొత్తవారు ఆకర్షితులవడం జరుగుతుంది.


మీ అభిప్రాయంలో రాయితీలు, తాయిలాలు ఆర్థిక సంక్షోభానికి ఉపశమనం అందించగలవా?

లేదు. అవి ఉపశమనం కాలేవు. సంక్షోభానికి మూలకారణాల్లోకి వెళ్లి, అరికట్టాల్సిన అవసరం ఉంది. దానిని పూర్తిస్థాయిలో నిర్మూలించలేకపోయినా, విస్తృతిని భారీగా తగ్గించే అవకాశం ఉంటుంది.

-అరవింద్‌ పనగడియా

సంక్షేమం కోసం వెచ్చించే వ్యయాలన్నింటినీ తాయిలాలు, రాయితీలుగా చూడొద్దు. ఉదాహరణకు.. సార్వత్రిక పింఛన్లనేవి సామాజిక భద్రతలో కీలకం. వృద్ధులు గౌరవంగా జీవించేందుకు ఏ పౌర సమాజమైనా వాటిని అందించాల్సిందే. కొన్ని రాయితీలు ఆర్థిక కార్యకలాపాలను పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. (భారీ పారిశ్రామికవేత్తలకు పెద్ద ఎత్తున కన్షెషన్లు ఇస్తున్నా.. వాటినెవరూ రాయితీలుగా పరిగణించడం లేదన్న సంగతిని ఇక్కడ గమనించాలి.)

-జయతీఘోష్‌ 

రైతులకు ఆదాయ సుస్థిరత దక్కేలా చూడటం ముఖ్యం. ఇది అంతర్గత, బహిర్గత మార్కెట్‌పై ఆధారపడి ఉంటుంది. రైతు అనుకూల, మహిళా అనుకూల మార్కెట్‌ విధానం అవసరం.

- ఎంఎస్‌ స్వామినాథన్‌


రైతాంగ సంక్షోభాన్నితగ్గించేందుకు అమలు చేయాల్సిన పరిష్కారాలు లేదా వ్యూహాలఅమలులో లోపం ఎక్కడుంది?

జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 15 శాతమే కాగా, 45 శాతంమంది దీనిపై ఆధారపడుతున్నారు. దీనివల్ల కొద్దిపాటి వ్యవసాయ ఆదాయాన్నే చాలామంది పంచుకోవాల్సి వస్తోంది. ఇందుకు పరిష్కారంగా సన్న,చిన్నకారు రైతులు అత్యధిక దిగుబడి సాధించేలా ప్రోత్సహించడంతోపాటు, పరిశ్రమలు, సేవారంగాల్లో మంచి వేతనాలు దక్కేలా చూడాలి. అప్పుడే భూమి, శ్రామికుల మధ్య నిష్పత్తిలో మార్పులు వచ్చి రైతులు వ్యవసాయంలో కొనసాగేందుకు తోడ్పడుతుంది.

-అరవింద్‌ పనగడియా

 తరహా సమస్యలకు ఒకే దెబ్బతో పరిష్కారం కుదరదు. రుణాలు, నీటి నిర్వహణ, పరిశోధన, అనుబంధ సేవలు, పెట్టుబడి ధరలు, పెట్టుబడి సరఫరాకు సంబంధించిన సమస్యలు, ఉత్పత్తి ధరలు, మార్కెటింగ్‌, సేకరణ, పంటబీమా, పంట తర్వాత ప్రక్రియ, పశుపోషణ నిర్వహణ వంటి అంశాలతో సమస్యల్ని పరిష్కరించేలా ఒక సమగ్ర విధానం అవసరం. ప్రభుత్వ వ్యయాల్ని గణనీయంగా పెంచుతూ క్రమపద్ధతి, సహనంతో కూడిన సుస్థిర వ్యూహాలు అవసరం.

-జయతీఘోష్‌ 

వ్యవసాయ విధానాల రూపకల్పన ప్రక్రియలో రైతులు, విధానకర్తల మధ్య తగినంత చర్చ జరగడం లేదు. ఇలాంటి చర్చల్ని మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అప్పుడే సమస్యలు, పరిష్కారాలపై చర్యల విషయంలో ఏక సంధానత సాధ్యమవుతుంది.

- ఎంఎస్‌ స్వామినాథన్‌


రుణదాతలు, నకిలీ ఎరువులు, విత్తనాలు, దక్కని గిట్టుబాటు ధర, మార్కెట్‌ అండ లేకపోవడం, మౌలిక సదుపాయాల కొరత, వివిధ సంస్థల నుంచి తగిన మార్గదర్శకత్వం లేకపోవడం వంటివన్నీ విషవలయంలా మారి రైతుల కష్టాలకు కారణమవుతున్నాయా?

రైతుల కష్టాలకు ఈ అంశాలన్నీ కారణమే, కాకపోతే, చాలా కొద్దిపాటి ఉత్పత్తిపై, చాలా ఎక్కువమంది రైతులు ఆధారపడటమే తీవ్ర సమస్య.

-అరవింద్‌ పనగడియా

వును కచ్చితంగా నిజమిదే.

-జయతీఘోష్‌  

ర్థిక కష్టాలు, వ్యవసాయ కుటుంబాల్లో సంక్షోభం వంటివాటికి చాలా కారణాలుంటాయి. అవి సాధారణమైనవి మాత్రమే కాకుండా, స్థానిక పరిస్థితులను బట్టి ఉంటాయి. మామూలుగా చెప్పాలంటే రైతుల బాగోగుల్ని నిర్ణయించేవి రుతుపవనాలు, మార్కెట్‌లే.

- ఎంఎస్‌ స్వామినాథన్‌


వ్యవసాయ ఉత్పాదకతలో మిగులు ఉన్నా, రైతుల ఆర్థిక స్థితిగతుల్లో ఎలాంటి మార్పు కనిపించదు. ఇలాంటి వైరుధ్యాన్ని మీరెలా చూస్తారు?

హార ధాన్యాల దిగుబడులు ఏమాత్రం పెరిగినా ధరల్లో భారీ క్షీణత కనిపిస్తోంది. వీటికి ఎగుమతి మార్కెట్లు కూడా చాలా పరిమితంగా ఉన్నాయి. రైతులకు పరిశ్రమలు, సేవారంగంలో ఉద్యోగిత కల్పించకపోతే వారిని సౌభాగ్యవంతుల్ని చేయలేం. జనాభాలో 5 శాతంగా ఉండే పన్ను చెల్లింపుదార్ల నుంచి 65 శాతంగా ఉండే గ్రామీణ జనాభాకు ఆదాయాన్ని పునఃపంపిణీ చేయడంలోనూ పరిమితులు ఉన్నాయి.

-అరవింద్‌ పనగడియా

నోట్లరద్దు, ఆ వెంటనే వచ్చిన జీఎస్టీలతో అసంఘటిత ఆర్థిక వ్యవస్థ కకావికలమైంది. ఇది జీవనోపాధి, ఉద్యోగితలపై ప్రభావం చూపింది. ప్రభుత్వ ఉద్యోగిత కార్యక్రమాలు, ప్రభుత్వ సేవల్ని గణనీయంగా విస్తరించడం వంటి రెండు అంశాలు ఎక్కువ స్థాయిలో సానుకూల ప్రభావాల్ని చూపి, మరింత డిమాండ్‌ను సృష్టిస్తాయి. దీనివల్ల ఆర్థిక కార్యకలాపాలు బాగా పెరిగి, పంట ధరలు పెరిగేందుకు దారితీస్తుంది.

-జయతీఘోష్‌  


లక్షిత నగదు బదిలీ పథకాలు లబ్ధిదారుల కొనుగోలు అలవాటుపై ప్రభావం చూపి, మంచికన్నా కీడే ఎక్కువ చేస్తాయనే వాదన కూడా ఉంది. మీరేమంటారు?

లాంటి డబ్బుల్ని మద్యంపై ఖర్చు పెడతారనేదే మీ ఉద్దేశమైతే, మొత్తం లబ్ధిదారుల్లో అలాంటి వారు 5 శాతం కూడా ఉండరు. పూర్తిగా బాధ్యతాయుతంగా ఉండే మిగతా 95 శాతం రైతులకు చాలా ఉపశమనం దక్కుతుంది.

-అరవింద్‌ పనగడియా

క్షిత నగదు బదిలీ పథకాలు ఎదుర్కొంటున్న సమస్యేమిటంటే అసలైన లబ్ధిదారులను అన్యాయంగా మినహాయించడం, ఇతరుల్ని చేర్చడం. ఇది ద్రవ్యోల్బణం పెరగడానికి కారణమవడంతో, బదిలీ చేసిన నగదుకు వాస్తవ విలువ తగ్గిపోతోంది. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం.. ప్రభుత్వ ఉపాధి పథకాలతోపాటు నాణ్యమైన, చవకైన రీతిలో ప్రభుత్వ సేవల్ని అందించాల్సి ఉంది.

-జయతీఘోష్‌ 


ప్రత్యక్ష నగదు బదిలీ నేపథ్యంలో వ్యవసాయంలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గుతాయా?

1990ల నుంచి ప్రభుత్వాలు వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టకుండా, ప్రత్యామ్నాయంగా ఎరువులు, కనీస మద్దతు ధరలు, ప్రజాపంపిణీ పథకం తదితర సబ్సిడీలపైనే దృష్టిపెట్టాయి. దురదృష్టవశాత్తు ఇవే ప్రజాదరణ పొందాయి. ఈ క్రమంలో ప్రస్తుతమున్న రాయితీల్ని ప్రభుత్వ పెట్టుబడుల దిశగా మార్చాలని ఎవరూ కోరుకోవడం లేదు.

-అరవింద్‌ పనగడియా

వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు ఇప్పటికీ తక్కువగానే ఉన్నాయి. దానికి తోడు అంతకంతకు తగ్గిపోతున్నాయి. రైతులకు భారీ స్థాయిలో ఇచ్చే నగదు బదిలీతో ప్రయోజనాల కన్నా నష్టమే కలుగుతుంది. ఇలాంటి డబ్బుల్ని వ్యవసాయ పునరుద్ధరణ కోసం పెట్టుబడులపై ఖర్చు చేయడం మంచిది.

-జయతీఘోష్‌  


మా సిఫార్సుల్ని ఎందుకు తీసుకోలేదో తెలియదు 

మద్దతు ధరల్ని లెక్కించే విషయంలో రైతులపై జాతీయ కమిషన్‌(ఎన్‌సీఎఫ్‌) రూపొందించిన ఫార్ములాను తిరస్కరించడానికి కారణమేంటి? 
స్వామినాథన్‌: మా సిఫార్సుల్ని స్వీకరించకపోవడానికి కారణం ఏమిటనేది నాక్కూడా తెలియదు. వాటిని పూర్తిగా అమలు చేస్తే చాలా ఖర్చవుతుందనేది మాకు చెప్పిన విషయం. 
సంక్షోభంలో చిక్కిన రైతుల్ని బయట పడేసేందుకు ఈ ఫార్ములా సరైన పరిష్కారమేనని అనుకుంటున్నారా? 
స్వామినాథన్‌: ప్రస్తుతానికైతే రైతుల సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఎన్‌సీఎఫ్‌ సిఫార్సులే తగినవి. 
రైతులకు పంట ఉత్పత్తి వ్యయంలో కనీసం 150 శాతం దక్కేలా ప్రభుత్వం కనీస మద్దతు ధర నిర్ణయించడం సరైనదేనా, రైతుల సమస్యలకు ఇది మార్గం చూపగలదా? 
స్వామినాథన్‌: మేం సూచించిన ‘సీ2ప్లస్‌50శాతం’ ఫార్ములా సేకరణ ధర అత్యంత యోగ్యమైన విధానం. 
సీ2ప్లస్‌50శాతం: ఇందులో రైతు చెల్లించేసిన వ్యయాలు, కుటుంబ శ్రమ విలువ, సొంత మూలధన ఆస్తుల విలువపై వడ్డీ, భూమికి చెల్లించిన కౌలు, సొంతభూమికి కౌలు విలువ వంటి వ్యయాలన్నీ జతచేర్చి ‘సీ2’గా వ్యవహరిస్తారు. వీటికి 50 శాతం అదనంగా కలిపి కనీస మద్దతు ధర నిర్ణయించాలనేది ఈ ఫార్ములా సూచిస్తుంది.

 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.