close

ప్ర‌త్యేక క‌థ‌నం

బిందువు ఆగితే సింధ్‌ ఎడారే !

సింధు, ఉపనదుల జలాలను మళ్లించనున్న భారత్‌
పాకిస్థాన్‌ ఆర్థికవ్యవస్థకు కోలుకోలేని దెబ్బ

పుల్వామాలో ఉగ్రదాడి నేపథ్యంలో ‘‘సింధు జలాల ఒప్పందం’’పై దృష్టి కేంద్రీకరించాలని భారత్‌ భావిస్తోంది. భారత్‌లోని తూర్పు ప్రాంతం నుంచి పాకిస్థాన్‌కు ప్రవహిస్తున్న సింధు, దాని మూడు ఉపనదుల నీటిలో మెజార్టీవాటా నీళ్లు మనం ఏటా పొరుగుదేశానికి ఉదారంగా వదిలేస్తున్నాం. ఇకపై మన వాటా నీటిని పూర్తిగా మన అవసరాలకే వాడుకోవాలని నిర్ణయించినట్లు కేంద్ర జలవనరుల మంత్రి నితిన్‌ గడ్కరీ చెబుతున్నారు. ఇదే జరిగితే పాకిస్థాన్‌లోని పంజాబ్‌, సింధ్‌ప్రాంతాల్లో కరవు తాండవించే ప్రమాదం ఉంది. పొరుగుదేశం ఆర్థికవ్యవస్థ అతలాకుతలం కావడం ఖాయం.

ఏమిటీ ఒప్పందం?

భారత్‌, పాకిస్థాన్‌ సరిహద్దుల మధ్య ప్రవహిస్తున్న సింధు, దాని ఉపనదుల జలాలను పంచుకోవడానికి సెప్టెంబరు 9, 1960లో ఇరుదేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. ప్రపంచబ్యాంకు మధ్యవర్తిత్వంలో అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ, పాక్‌ అధ్యక్షుడు ఆయూబ్‌ఖాన్‌ ఒప్పందపత్రాలపై సంతకాలు చేశారు.

ఎన్ని నదులు?

సింధు నదికి ఐదు ఉపనదులు ఉన్నాయి. ఈ ఆరు నదుల్లో మూడు భారత్‌కు, మూడు పాక్‌కు పంచారు. సట్లెజ్‌, బియాస్‌, రావిలను తూర్పునదులుగా పేర్కొంటారు. వీటిని భారత్‌కు కేటాయించారు. జీలం, చీనాబ్‌, సింధులను పశ్చిమనదులుగా వ్యవహరిస్తారు. వీటిని పాకిస్థాన్‌కు కేటాయించారు.

దా‘రుణ’మైన ఒప్పందం!

నదులన్నీ భారత భూభాగం మీదుగా ప్రవహిస్తున్నా, నదీజలాల్లో మనదేశానికి 20శాతం, పాకిస్థాన్‌కు 80శాతం కేటాయించారు. పైగా మనకు కేటాయించిన మూడునదుల్లో నీళ్లను ఆపడానికి ఇష్టమొచ్చినట్లు ప్రాజెక్టులు నిర్మించడానికి వీల్లేదు. ఏటా 5900 ట్రిలియన్‌ మీటర్ల క్యూబిక్‌ అడుగుల నీటిని పాకిస్థాన్‌ కోసం భారత్‌ త్యాగం చేస్తోందని అంచనా. ఏడు లక్షల ఎకరాలకు మించి భారత్‌లో సాగునీటిని అందించడానికి వీల్లేదు. విద్యుత్తు ప్రాజెక్టులు నిర్మించాలన్నా, నదులపై డ్యాములు కట్టాలన్నా పాక్‌ అంగీకరించాలి.

పాకిస్థాన్‌కు ఎందుకంత కీలకం?
జమ్మూకశ్మీరు మీదుగా ప్రవహిస్తున్న చీనాబ్‌, జీలం, సింధునదీ జలాలపైనే పాకిస్థాన్‌ ఆర్థికంగా ఆధారపడి ఉంది. ఈ నదీజలాల వల్లే పంజాబ్‌, సింధ్‌ ప్రాంతాల్లో వ్యవసాయం చేయగలుగుతోంది. ఆరు నదీజలాల వల్ల 1,10,000 చ.కి.మీ. విస్తీర్ణంలో సాగు చేయగలుగుతోంది. ఇది రాజస్థాన్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మొత్తం విస్తీర్ణంతో సమానం.

భారత్‌ ఏం చేయబోతోంది?

* తూర్పుప్రాంత నదీజలాలను మళ్లించి జమ్మూకశ్మీరు, పంజాబ్‌ల సస్యశ్యామలం
* రావి నదిపై షాపుర్‌-కంది వద్ద డ్యామ్‌ నిర్మాణం
* రావి-బియాస్‌ అనుసంధానం ద్వారా వచ్చే నీటిని మనదేశంలోని రాష్ట్రాలకు మళ్లింపు

తుల్‌బుల్‌ ప్రాజెక్టు పునఃప్రారంభం

* జీలం నది ప్రారంభం అవుతున్న చోట 439 అడుగుల పొడవునా డ్యామ్‌ నిర్మించాలని భారత్‌ గతంలో ప్రయత్నించింది. పాకిస్థాన్‌ అభ్యంతరం చెప్పడంతో 1987లో ఇది ఆగిపోయింది. ఈ నది నీటిలో ఏర్పడిన 74 చదరపు కిలోమీటర్ల సరస్సు మనదేశంలోనే అత్యంత స్వచ్ఛమైనది.

* ఈ డ్యామ్‌ నిర్మించగలిగితే అనంత్‌నాగ్‌ నుంచి శ్రీనగర్‌, బారాముల్లాలకు 20 కిమీ పొడవునా 365 రోజులూ పడవలు నడపవచ్చు. సోపోర్‌ నుంచి బారాముల్లా మధ్య 22 కిమీ పొడవునా, చలికాలంలో తప్ప మిగిలిన కాలంలో నౌకాయానం చేయవచ్చు.

పాక్‌ వ్యవసాయాన్ని శాసించనున్న భారత్‌
* మనం ప్రాజెక్టు నిర్మిస్తే పాకిస్థాన్‌ నిర్మిస్తున్న మూడు కాలువల ప్రాజెక్టు అటకెక్కుతుంది. చీనాబ్‌, జీలం, ఎగువ బారిదోబ్‌ నదుల నుంచి తవ్వుతున్న కాలువల్లో నీరు ఉండదు. దీంతో ఈ నదీపరివాహక ప్రాంతాల్లో కరవు తాండవిస్తుంది. ఒకవేళ మనం ఉద్దేశపూర్వకంగా జీలం నీటిని ఒక్కసారిగా వదిలేస్తే పాక్‌ ఆక్రమిత కశ్మీరు, పాకిస్థాన్‌లను వరదలు ముంచెత్తుతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ ప్రాంతాల్లో పాక్‌ ప్రజలు పంటలు వేయాలో, వద్దో భారత్‌ నిర్ణయిస్తుంది.

-ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.