close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఆధునిక దీపం వెలగదు పాపం

ఎల్‌ఈడీ దీపాల్లో నిర్లక్ష్యపు చీకట్లు
నాణ్యత, రోజూవారీ నిర్వహణ పట్టించుకోని సంస్థ
వినియోగం, కరెంటు పొదుపుపై ఆడిట్‌ పూజ్యం

ఎల్‌ఈడీ దీపాలు.. ఇటీవలి కాలంలో విపరీతమైన ప్రాచుర్యంలోకి వచ్చిన అంశమిది. చక్కటి వెలుగుతోపాటు విద్యుత్తు ఆదా వీటిలోని కీలక, ఆకర్షణీయమైన అంశాలు.. కాని వీటి ఏర్పాటులో చూపుతున్నంత వేగం, ఉత్సాహం ప్రైవేటు కంపెనీలు, విద్యుత్‌, మున్సిపల్‌, పంచాయతీల సిబ్బంది వాటి నిర్వహణలో చూపడం లేదు. వీధుల్లోనే కాకుండా ఇళ్లలోనూ తప్పనిసరిగా వీటిని ఏర్పాటు చేసుకునేలా చూడాలని కేంద్రం ఆదేశించింది. దీంతో ‘లైట్‌-ఎమిటింగ్‌ డయోడ్‌’ (ఎల్‌ఈడీ) దీపాలను రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పంపిణీ చేస్తున్నారు. వీధుల్లో ఎల్‌ఈడీ దీపాల ఏర్పాటుకు ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా రూ.600 కోట్ల వరకూ ఖర్చయినట్లు అంచనా. ఇళ్లలో ఈ దీపాల పంపిణీకి మరో రూ.33.45 కోట్ల వరకూ ఖర్చుపెట్టారు. వీధి దీపాలను ‘విద్యుత్‌ సామర్థ్య సేవల కంపెనీ’ (ఈఈఎస్‌ఎల్‌) సొంత ఖర్చుతోనే రాష్ట్రంలో ఏర్పాటు చేస్తోంది. వాటి ఏర్పాటు తరవాత మున్సిపాలిటీకి ఆదా అయ్యే కరెంటు బిల్లు సొమ్మును ఏడేళ్ల పాటు తమకు చెల్లించాలని ఒప్పందం చేసుకుంది. అప్పటివరకూ దీపాల నిర్వహణ కూడా సదరు కంపెనీదే. ఒక దీపం ఏర్పాటుచేస్తే కనీసం 50,000 గంటల సమయం వెలుగుతుందని తయారీ కంపెనీలు చెబుతున్నాయి. అంటే కనీసం పదేళ్లపాటు కాలిపోకూడదు. కానీ ఒకటీ, రెండేళ్లలోనే కాలిపోతున్నవి ఎన్నో. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఏడాదిలో 20,000కు పైగా దీపాలు మార్చేశారు. పైగా ఒక వీధిలో వంద దీపాలు ఏర్పాటుచేస్తే కచ్చితంగా 98 (శాతం) వెలుగుతాయని వాటి ఏర్పాటుకు ముందు చెబుతున్నారు. కానీ ఆ స్థాయిలో వెలగడం లేదు. 90 శాతం వరకే ఉంటున్నాయి. ఒక దీపం కాలితే, మళ్లీ దానిని రోజుల తరబడి మార్చకపోవడంతో ఆ వీధిలో అంధకారం రాజ్యమేలుతోంది. మున్సిపాలిటీల్లో దీపాల ఏర్పాటుకు చేసుకున్న ఒప్పందాల ప్రకారం పనులు చేయడం లేదు.


 

నర్సంపేటలో మళ్లీ పాత దీపాలే

ఒప్పందం ప్రకారం వరంగల్‌ జిల్లా నర్సంపేట పట్టణంలోని వీధుల్లో ఎల్‌ఈడీ దీపాలు అమర్చడంతో పాటు వాటికి సంబంధించి క్లాంపులు, సీసీఎంఎస్‌ వంటి బాక్స్‌లు బిగించే పనులను కంపెనీయే చేయాలి. దీపాల నిర్వహణ బాధ్యత పూర్తిగా గుత్తేదారులదే. అవి కాలినా, వెలగకపోయినా వాటిని తొలగించి కొత్త దీపాలు అమర్చాలి. రోజూ దీపాల ఆఫ్‌, ఆన్‌ పనులతో పాటు ఫ్యూజులు వేయడం వంటి పనులు చేసేందుకు ఇద్దరు కార్మికులను, పర్యవేక్షణకు, సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు సరిచేసేందుకు మరో నలుగురిని కంపెనీ నియమించాలి. కానీ నర్సంపేటలో దీపాలు బిగించి వెళ్లారే తప్ప నిర్వహణ బాధ్యతలు వదిలేశారు. మున్సిపాలిటీ అధికారులు తొలుత మొత్తం 2,650 బల్బులు కావాలని ప్రతిపాదనలు పంపారు. గుత్తేదారు 1,974 పంపంగా వాటిని బిగించాక వివిధ వార్డుల్లో 150 దాకా దీపాలు కాలిపోయాయి.

కరెంటు పొదుపు దేశానికి మేలు

దేశంలో బొగ్గు నిల్వలు తరిగిపోతున్నాయి. థర్మల్‌ పవర్‌ ఉత్పత్తి వల్ల అనేక కాలుష్య సమస్యలు ఏర్పడుతున్నాయి. విద్యుత్తును పొదుపు చేయడం అందరి బాధ్యత. పొదుపు వల్ల విద్యుత్తు బిల్లు, ఆర్థికభారం తగ్గుతాయి. ఎల్‌ఈడీ దీపాలే కాకుండా ఫ్యాన్లు, మోటార్లు వాడితే కరెంటు 50 శాతం వరకూ పొదుపు చేయవచ్చు. ప్రతీ ఇంటికి సౌరవిద్యుత్‌ ఏర్పాటు చేసుకుంటే కొంతకాలానికి కరెంటు ఉచితంగా వస్తుంది.
- ఇ.శ్రీనివాసాచారి, కన్వీనర్‌, రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్‌, తెలంగాణ

ఇంటి కరెంటు బిల్లు తగ్గాలంటే..

ఒక ఇంటిలో ఒకటి లేదా రెండు ఎల్‌ఈడీ దీపాలు ఏర్పాటుచేస్తే కరెంటు బిల్లు పెద్దగా తగ్గదు. మొత్తం అన్నీ ఎల్‌ఈడీలు పెట్టుకుంటేనే బిల్లు తగ్గుతుంది.

- దక్షిణ డిస్కం ఉన్నతాధికారి

ఏటా రూ. 493 కోట్లు ఆదా..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణలో 45.36 లక్షల ఎల్‌ఈడీ దీపాలను పంపిణీ చేయడంవల్ల ఏటా 813.56 మిలియన్‌ యూనిట్ల కరెంటు ఆదా అవుతోంది. ఇంత కరెంటు కొనుగోలుకు సరఫరాకు అయ్యే ఖర్చు రూ. 493 కోట్లు మిగులుతున్నట్లే. రాష్ట్రవ్యాప్తంగా ఒకరోజు సగటున వాడకం 200 ఎంయూలు. ఈ లెక్కన చూస్తే రాష్ట్రమంతా 4 రోజుల పాటు వాడేంత కరెంటు ఆదా అయినట్లు అంచనా. ఇదీ ఎల్‌ఈడీ దీపాల వాడకం మహిమ!

ఇంధన కోడ్‌ అమల్లో..

వాణిజ్య భవనాలకు ‘ఇంధన సంరక్షణ భవన కోడ్‌’ (ఈసీబీసీ) తప్పనిసరిగా అమలుచేయడంలో తెలంగాణ మెరుగ్గా ఉన్నట్లు ఎన్‌ఆర్‌ఈడీసీఎల్‌ వర్గాలు తెలిపాయి. వాణిజ్య భవనాల్లో సౌరవిద్యుత్‌, ఎల్‌ఈడీ దీపాల ఏర్పాటు వంటి కార్యక్రమాలతో ఏటా 21 ఎంయూల విద్యుత్‌ను ఆదా చేస్తున్నారు. తెలంగాణలో అమర్చిన ఎల్‌ఈడీ దీపాలు, సౌరవిద్యుత్‌ వల్ల ఇప్పటివరకూ ఏటా 1.26 లక్షల టన్నుల ఇంధన చమురు వినియోగానికి సమానంగా పొదుపు అయినట్లు ‘ఇంధన సామర్థ్య మండలి’ (బీఈఈ) వివరించింది.

ధరలో దగానే..

ఇళ్లలో ప్రజలు సాధారణంగా ఒక గదిలో 40 లేదా 60 వాట్ల సామర్థ్యం గల సాధారణ బల్బు పెడుతున్నారు. కానీ 9 వాట్ల ఎల్‌ఈడీ దీపం ఆ గదికి సరిపోతుంది. ఎల్‌ఈడీ దీపం ధర ఒక్కో కంపెనీ ఒక్కో రకంగా చెబుతున్నాయి. జీహెచ్‌ఎంసీ మున్సిపల్‌ కార్యాలయాల్లో రూ.65కి అమ్ముతుంటే మార్కెట్‌లో రూ. 55 నుంచి 75 దాకా ఉన్నాయి. ధరలు తగ్గిస్తే ప్రజలు ఎక్కువగా కొనే అవకాశముందని అధికారులు వివరించారు.

గజ్వేల్‌ పట్టణంలోనూ ఇదే పరిస్థితి

గజ్వేల్‌ పట్టణంలో సైతం ఎల్‌ఈడీ వీధి దీపాల నిర్వహణ సరిగా లేదు. కొన్ని మున్సిపాలిటీలు, పంచాయతీల్లో వీటికి ఆన్‌ ఆఫ్‌ స్విచ్‌లు, తీగలు సరిగా లేకపోవడంతో పగటిపూటా వెలుగుతున్నాయి. వీటి ఏర్పాటు వల్ల వాస్తవంగా ఎంత కరెంటు ఆదా అయిందనే లెక్కలను ప్రతీ సబ్‌స్టేషన్‌ వారీగా సేకరించడంలోనూ డిస్కంలు శ్రద్ధ పెట్టలేదు.

కరెంటు బిల్లు సగం తగ్గింది

ఏడాది క్రితం దాకా ఇంటికి, దుకాణానికి కలిపి నెలకు రూ. 750-800 కరెంటు బిల్లు వచ్చేది. ఎల్‌ఈడీ బల్బుల వాడకంతో బిల్లు సగం తగ్గింది. ఇప్పుడు రూ. 400- 450 వస్తోంది..
-మల్యాల వినయ్‌కుమార్‌. నర్సంపేట పట్టణ వాసి
-సిద్దిపేట నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి


 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.