close

ప్ర‌త్యేక క‌థ‌నం

మధ్యతరగతికి మహద్భాగ్యం

జీఎస్‌టీ 8 శాతం నుంచి 1 శాతానికి తగ్గింపుతో ఇళ్ల కొనుగోలుదారులకు ఊరట
స్థిరాస్తి రంగానికి మళ్లీ వైభవం
ఈనాడు - అమరావతి

నిర్మాణంలోని నివాస గృహాలపై వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) తగ్గింపుతో గృహ నిర్మాణ రంగానికి ఎంతో ఊరట కలగనుంది. ఇన్నాళ్లూ స్తబ్దుగా ఉన్న ఈ రంగానికి మళ్లీ పూర్వ వైభవం వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పన్ను భారం తగ్గడంతో మధ్య తరగతి కుటుంబాలు, ఉద్యోగులు ఇళ్ల కొనుగోళ్లపై దృష్టి సారించే అవకాశాలున్నాయి. ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ)లో చెల్లింపుల్లోనూ తలెత్తిన గందరగోళానికి పరిష్కారం చూపారు. జీఎస్‌టీ అమలులోకి వచ్చాక రాష్ట్రంలో ఫ్లాట్ల విక్రయాలు గతంలో కంటే 50 నుంచి 60 శాతం తగ్గాయి. రూ.45 లక్షల విలువైన ఒక్కో ఇంటిపై 8 శాతం పన్నులు విధించడంతో అదనంగా రూ.3.60 లక్షలు చెల్లించాల్సి వచ్చేది. దీంతో పలువురు కొనుగోళ్లకు వెనకడుగువేసేవారు. ఈ పరిణామాలతో గత ఏడాది వ్యవధిలో 620 అపార్ట్‌మెంట్లలో 1,850 ఫ్లాట్లు అమ్మకానికి నోచుకోలేదు. ఇప్పుడు పన్నును 1శాతానికి తగ్గించడంతో విక్రయాలు ఊపందుకుంటాయని భావిస్తున్నారు.

మొదటి స్థానంలో విశాఖ..
అపార్ట్‌మెంట్ల నిర్మాణంలో మొదటి స్థానంలో విశాఖపట్నం, రెండో స్థానంలో విజయవాడ, గుంటూరు, మూడో స్థానంలో తిరుపతి, రాజమహేంద్రవరం, కాకినాడ, నెల్లూరు, కర్నూలు ఉన్నాయి. ఈ నగరాల్లో ఏటా 2 వేలకుపైగా నిర్మాణాలకు పట్టణ ప్రణాళిక విభాగం నుంచి అనుమతులు తీసుకుంటున్నారు. గత మూడేళ్ల వ్యవధిలో తీసుకున్న అనుమతులకు సంబంధించి 4 వేల అపార్ట్‌మెంట్లు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో 90 శాతం ఫ్లాట్లలో కార్పెట్‌ ఏరియా 90 స్క్వేర్‌ మీటర్లు (968 చదరపు అడుగులు), మిగతా ప్లింత్‌ ఏరియాతో కలిపి 1,250 నుంచి 1,300 ఎస్‌ఎఫ్‌టీ వరకు ఉంటున్నాయి. వీటిని రూ.40 లక్షల నుంచి రూ.45 లక్షల ధరకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి. ఆయా నగరాల్లో కొన్ని ముఖ్య ప్రాంతాల్లో నిర్మించే అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్ల ధరలు రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉంటున్నాయి. ఇలాంటివి మొత్తం అపార్ట్‌మెంట్లలో పది శాతానికి మించి ఉండవని వ్యాపారులే చెబుతున్నారు. వీటిపై ఇప్పటివరకు విధించిన 12 శాతం జీఎస్‌టీని 5 శాతానికి తగ్గించారు.

జీఎస్‌టీ ఇక రూ.3,600
* రూ.45 లక్షల ధరకు ఫ్లాట్ల కొనుగోలు చేసే కుటుంబాలు ఏప్రిల్‌ 1 తరువాత జీఎస్‌టీ కింద రూ.3,600 చెల్లిస్తే చాలు. ఇప్పటివరకు ఇదే ఫ్లాట్‌పై రూ.3.60 లక్షలు చెల్లిస్తున్నారు.
* రూ.45 లక్షల కంటే ధర తక్కువగా ఉంటే జీఎస్‌టీ కూడా ఇంకా తగ్గే అవకాశాలున్నాయి.
* 45 లక్షల్లోపు ధర, 90 చదరపు మీటర్లలోపు కార్పెట్‌ ఏరియా కలిగిన ఫ్లాట్లన్నీ అందుబాటు ధరల ఇళ్లు (అఫర్టబుల్‌ హౌసింగ్‌) పరిధిలోకి రానున్నాయి. మెట్రో నగరాలంటూ రాష్ట్రంలో లేనందున 60 చదరపు మీటర్ల కార్పెట్‌ ఏరియా నిబంధన వర్తించే అవకాశం లేదు.

తొలగిన గందరగోళం
జీఎస్‌టీపై వ్యాపారులకు ఇప్పటివరకు వెనక్కి ఇచ్చే ఇన్‌పుట్‌ టాక్సు క్రెడిట్‌ (ఐటీసీ) విధానాన్ని కేంద్రం రద్దు చేయడంతో గందరగోళ పరిస్థితికి తెర పడనుంది. ఫ్లాట్లు విక్రయించే సమయంలో ఇప్పటివరకు జీఎస్‌టీ పేరుతో వ్యాపారులు 8 శాతం వసూలు చేస్తున్నారు. వాస్తవంగా ఇందులో కొంత మొత్తాన్ని ప్రభుత్వం ఐటీసీ కింద తిరిగి వ్యాపారులకు చెల్లిస్తోంది. వీటిని కొనుగోలుదారులకు ఇవ్వాల్సిన పలువురు బిల్డర్లు ఇవ్వకుండా చేతులెత్తేస్తున్నారు. కొన్ని చోట్ల ఈ పరిణామాలు వివాదాలకు కూడా దారి తీసిన సందర్భాలున్నాయి. ఇక ఇలాంటి వాటికి తావులేకుండా కేంద్రం ఐటీసీని రద్దు చేసింది.

గృహ నిర్మాణ రంగానికి ఊపు

‘ఫ్లాట్ల విక్రయాలపై జీఎస్‌టీ తగ్గింపు గృహ నిర్మాణ రంగానికి ఎంతో మేలు. ఈ రంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చొరవ తీసుకొని పలు సడలింపులిచ్చింది. జీఎస్‌టీ తగ్గింపుతో ఈ రంగం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది’
- వి.రాముడు, సంచాలకులు, పట్టణ, గ్రామీణ ప్రణాళిక విభాగం

శుభ పరిణామం

‘అనేక ఇబ్బందుల్లో ఉన్న భవన నిర్మాణ రంగానికి జీఎస్‌టీ తగ్గింపు శుభపరిణామం. ఈ తగ్గింపు కోసం అంతా ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో  రాష్ట్రంలో స్తిరాస్థి వ్యాపారం పుంజుకుంటుంది’
- తాళ్లూరి శివాజీ, నెరెడ్కో ఏపీ చాప్టర్‌ ఛైర్మన్‌

మధ్యతరగతి, ఉద్యోగులకు వరం

‘అపార్ట్‌మెంట్లలో 1,250 నుంచి 1,300 ఎస్‌ఎఫ్‌టీ వైశాల్యంలోని ఫ్లాట్లు కొనుగోలు చేసే వారిలో అత్యధికంగా ఉంటున్న మధ్య తరగతి కుటుంబాలు, ఉద్యోగులకు కేంద్ర నిర్ణయం ఒక వరం. జీఎస్‌టీ తగ్గింపుతో వారంతా ఎంతో ఉత్సాహంతో కొనుగోళ్లకు ముందుకొస్తారు.’
   -ఎ.శివారెడ్డి,  క్రెడయ్‌, ఏపీ చాప్టర్‌ ప్రెసిడెంట్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.