close

ప్ర‌త్యేక క‌థ‌నం

చిన్నారులను ఎదగనిద్దాం! 

ఎదుగుదల లోప నివారణకు కేంద్రం ప్రత్యేక కార్యాచరణ 
‘ఇంటి వద్దే చిన్నారుల సంరక్షణ’ పథకానికి రూపకల్పన 
దృశ్య మాధ్యమ సమీక్షలో కేంద్ర అధికారుల మార్గనిర్దేశం

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో ఎదుగుదల లోపంతో బాధపడుతున్న ఐదేళ్లలోపు చిన్నారులు దాదాపు 33.3శాతం మంది ఉండగా, తెలంగాణలో 28.1శాతం మంది ఉన్నారు. పౌష్టికాహార లోపమే కాకుండా వేర్వేరు అవయవాల ఎదుగుదల లోపం, పుట్టుకతోనే అవకరాలు తదితర సమస్యల కారణంగా చిన్నారుల్లో మరుగుజ్జుతనానికి దారితీస్తోంది. జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే-4 ప్రకారం రాష్ట్రంలో ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 38.3శాతం మంది పిల్లలు ఎత్తు ఎదుగుదల సమస్యను ఎదుర్కొంటున్నారు. పిల్లల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడంలో భాగంగా అత్యధిక తల్లిదండ్రులు తరచూ విధులకు వెళ్లక ఉపాధి కోల్పోతున్నారు. ఆరోగ్యంపై పెట్టే ఖర్చు సైతం నిరుపేద కుటుంబాల్లో ఆర్థికంగా ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలో సత్వర దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ‘ఇంటి వద్దే చిన్నారుల సంరక్షణ’ పథకానికి శ్రీకారం చుట్టింది. క్షేత్రస్థాయిలో ప్రధానంగా ఆశాలు, ఏఎన్‌ఎంలను భాగస్వాములను చేయడం ద్వారా రెండేళ్ల వరకు చిన్నారుల ఎదుగుదలను క్రమం తప్పకుండా పర్యవేక్షించే విధానాన్ని అమలు చేయనుంది. దీనిపై బుధవారం అన్ని రాష్ట్రాల వైద్యారోగ్యశాఖ అధికారులతో దృశ్య మాధ్యమ సమీక్షను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ అధికారులు నిర్వహించారు. రాష్ట్రం నుంచి ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు, జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉన్నతాధికారులు డాక్టర్‌ పద్మజ, డాక్టర్‌ సుధీరా, డాక్టర్‌ జనార్ధన్‌ తదితరులు పాల్గొన్నారు. పథకం అమలుపై కేంద్ర అధికారులు మార్గనిర్దేశనం చేశారు. 
రూ.15 కోట్లకు ప్రతిపాదనలు 
తొలుత జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో ఈ పథకాన్ని ప్రారంభించాలని రాష్ట్ర అధికారులు గతంలోనే ప్రతిపాదించారు. దిల్లీలో గత నెలలో జరిగిన జాతీయ ఆరోగ్య మిషన్‌ పథకాల సమీక్షలో ఈ జిల్లాల్లో పథకం అమలుకు సుమారు రూ.1.51కోట్లు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసి ప్రతిపాదనలు రూపొందించారు. అప్పుడు కేంద్ర అధికారులు దీనికి పచ్చజెండా ఊపకపోవడంతో పథకం అమలును పక్కనపెట్టారు. బుధవారంనాటి సమీక్షలో మూడు జిల్లాల్లో కాకుండా మొత్తం అన్నిజిల్లాల్లో పథకాన్ని అమలుచేసేలా ప్రతిపాదనలు రూపొందించాలని కేంద్ర అధికారులు సూచించారు. 33జిల్లాల్లో ‘ఇంటి వద్దే చిన్నారుల సంరక్షణ’ పథకం అమలుకు సుమారు రూ.15కోట్ల వరకు వ్యయమవుతుందని రాష్ట్ర అధికారులు అంచనావేశారు. త్వరగా ప్రతిపాదనలు పంపిస్తే సత్వరమే ఆమోదిస్తామని కేంద్ర అధికారులు స్పష్టంచేశారు.

పథకం అమలు తీరిది 
గ్రామాల్లో ఈ పథక అమలు బాధ్యత ప్రధానంగా ఆశాలు, ఏఎన్‌ఎంలదే. 
పిల్లలు పుట్టాక ఆర్నెళ్ల వరకు తల్లి పాలు, తర్వాత ద్రవ, ఘనాహారాలను కొద్దికొద్దిగా తీసుకునేలా చిన్నారులున్న ఇంటింటికెళ్లి అవగాహన కల్పిస్తారు. 
వయసుకు తగ్గట్లుగా ఎదుగుదల లేని పిల్లలపై ప్రత్యేక దృష్టిపెడతారు. 
ఉదాహరణకు మెడ నిలబెట్టడం, పాకడం, కూర్చోవడం, నిలబడడం, పదాలను ఉచ్ఛరించడం.. ఇలాంటివి వయసుతోపాటు కచ్చితంగా వస్తున్నాయా? లేదా? అనేది పరిశీలిస్తారు. 
3, 6, 9, 12, 15, 18, 21, 24 నెలల వరకు క్రమం తప్పకుండా శిశువు ఎదుగుదలను క్రమం తప్పకుండా పరిశీలిస్తారు. 
ముఖ్యంగా మూడు అంశాలను పరిశీలిస్తారు. 1.పౌష్టికాహారాన్ని అందించడం 2.తొలిదశలో శిశువు ఎదుగుదల ఎలా ఉంది? 3.చేతులను పరిశుభ్రంగా ఉంచడం.. వీటిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు. 
వయసుకు తగ్గట్లుగా శిశువు ఎదుగుదల లేకపోతే, సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యుల వద్దకు తీసుకెళ్లడంలో సహకరిస్తారు. 
దీనికి సంబంధించి ఆశాలకు, ఏఎన్‌ఎంలకు త్వరలోనే శిక్షణ ఇస్తారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.