
ప్రత్యేక కథనం
బీజింగ్ దారికి రాకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
రాజీ ఫార్ములా కోసం అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ ప్రయత్నాలు
నిషేధానికి మరోసారి కసరత్తు
దిల్లీ: పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాద ముఠా అధిపతి మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే అంశంపై అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్లు చైనాతో తీవ్రస్థాయి చర్చలు సాగిస్తున్నాయి. అతడిపై ఐరాసలో చేసే తీర్మాన పాఠంలో మార్పులు తదితర అంశాల్లో రాజీ కోసం ప్రయత్నిస్తున్నాయి.
అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు ఐరాస భద్రతా మండలిలోని 1267 అల్‌ఖైదా ఆంక్షల కమిటీలో ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా ప్రతిపాదించిన తీర్మానాన్ని వరుసగా నాలుగోసారి చైనా బుధవారం అడ్డుకున్న సంగతి తెలిసిందే. గత నెల 14న జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో ఆత్మాహుతి దాడితో సీఆర్పీఎఫ్ జవాన్లను జైష్ ముఠా చంపేసిన నేపథ్యంలో ఈ తీర్మానం తెరపైకి వచ్చింది. మరోసారి తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు ఈ మూడు దేశాలు యోచిస్తున్నాయి. దీనిపై రెండు రోజులుగా చైనాతో తీవ్ర చర్చలు సాగిస్తున్నాయి. రాజీ కోసం ప్రయత్నిస్తున్నాయి. ఈ రాజీసూత్రం సాకారమైతే అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐరాస ప్రకటిస్తుంది. ఈ తీర్మానంలోని పాఠం చైనాకు ఆమోదయోగ్యంగా ఉంటుంది. తీర్మానంలో కొన్ని మార్పులను చైనా సూచించినట్లు తెలుస్తోంది. వాటిపై ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికాలు పరిశీలన సాగిస్తున్నాయి. తీర్మాన స్ఫూర్తిని మార్చనంత వరకూ చైనా సూచించిన మార్పులు తమకు సమ్మతమేనని ఈ మూడు దేశాలు పేర్కొన్నాయి. అయితే సమస్యను కొలిక్కి తీసుకురావడానికి దీర్ఘకాలం వేచి చూసేందుకు భద్రతా మండలిలోని ఇతర సభ్యదేశాలు సిద్ధంగా లేవు. నెలలు, వారాల పాటు సంప్రదింపులు కుదరదని రోజుల వ్యవధిలోనే ఇది తేలిపోవాలని చైనాకు స్పష్టంచేశాయి. చైనా ఈసారి ఒకింత సహకార ధోరణితోనే ఉందని ఐరాస అధికారులు చెబుతున్నారు. మరోవైపు చైనా తీరు మారుతుందన్న విశ్వాసం తమకు లేదని పలువురు పేర్కొన్నారు. రాజీ ఫార్ములా విషయంలో చైనా వైఖరి సరిగాలేదన్న భావన వస్తే తమ లక్ష్యాల సాధన కోసం ప్రత్యామ్నాయ విధానాల వైపు మొగ్గుతామని భద్రతా మండలిలోని ఇతర దేశాలు స్పష్టంచేశాయి. భద్రతా మండలిలో బహిరంగ చర్చ వంటి ఇతర అంశాలపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు ఐరాసలోని అధికారులు చెప్పారు.
ఎంతకాలమైనా వేచి చూస్తాం: భారత్
మసూద్ అజార్ విషయంలో చైనాతో ఎంతకాలమైనా సహనంతో భారత్ వ్యవహరిస్తుందని దిల్లీలో అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఉగ్రవాదం విషయంలో తమ వైఖరిలో ఎలాంటి రాజీ ఉండబోదని పేర్కొన్నాయి. పాకిస్థాన్ భూభాగం నుంచి పలు ఉగ్రవాద ముఠాలు పనిచేస్తున్నాయని, వాటిలో కొన్నింటి వల్ల చైనా ప్రయోజనాలకూ హాని కలుగుతోందని వివరించాయి.
ఈ విషయం చైనాకూ తెలుసని పేర్కొన్నాయి. పాక్‌తో ఈ సమస్యలను పరిష్కరించుకోవాల్సిన బాధ్యత చైనాదేనని తెలిపాయి. గత కొన్ని రోజులుగా ఉగ్రవాదంపై పాక్ చేపట్టిన చర్యలన్నీ పైపై మెరుగులేనని తెలిపాయి. ఉగ్రవాదంపై పోరు విషయంలో పాకిస్థాన్‌కు నిబద్ధత ఉంటే దావూద్ ఇబ్రహీం, సయ్యద్ సలాహుద్దీన్, ఇతర ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించాలని డిమాండ్ చేశాయి. వీరంతా భారత పౌరులేనని, దేశంలో అనేక ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డారని పేర్కొన్నాయి.
ఉగ్రవాదంపై పాక్ గట్టి చర్యలు తీసుకోవాలి: అమెరికా
పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద ముఠాలపై గట్టి చర్యలు తీసుకునేలా ఒత్తిడి చేసే అంశంపై అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ సర్కారు దృష్టి సారించింది. అమెరికా సీనియర్ దౌత్యవేత్త ఒకరు ఈ విషయాన్ని తెలిపారు. పుల్వామా దాడిపై ప్రతిస్పందన విషయంలో తాము భారత్‌కు బహిరంగ మద్దతు ప్రకటించామని చెప్పారు. పాక్ తన పద్ధతి మార్చుకోకుంటే వీసా ఆంక్షలు, ‘నాటో కూటమి వెలుపలి మిత్రపక్ష’ హోదాను ఉపసంహరించడం, పౌర సాయాన్ని తగ్గించడం వంటి చర్యలను తీసుకునే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. మరోవైపు ఉగ్రవాదానికి ఆశ్రయమివ్వడానికి పాక్ స్వస్తి పలకాలని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో కూడా స్పష్టంచేశారు.
మరిన్ని

దేవతార్చన
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి
- శరణార్థులకు పౌరసత్వం
- భాజపాకు తెరాస షాక్!
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- అమ్మ గురుమూర్తీ!