close

ప్ర‌త్యేక క‌థ‌నం

తల్లీ బిడ్డ.. సక్సెస్‌

ఇట్టా సాంబశివరావు

ఈనాడు - అమరావతి

ఒకప్పుడు..
సర్కారీ ఆసుపత్రుల్లో ప్రసవాలంటే హడలిపోయే పరిస్థితి.. అలాగని ఇళ్ల దగ్గర కాన్పులు చేసుకోలేరు.. ధైర్యం చేసి ప్రైవేటు ఆసుపత్రుల్లో కాలు పెట్టలేరు.. కాన్పునకు నిరుపేదింటి ఆడపడుచులు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. ఎక్కడైనా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగినా తిరిగి ఇళ్లకు చేరాలంటే నరకయాతన.

ఆ బాధ ఇప్పుడు తీరుతోంది..
ఆ ప్రయాణం ఇప్పుడు సురక్షితమయ్యింది..
ఆ బిడ్డకు ఇప్పుడు భరోసా దొరికింది..
తల్లీ బిడ్డల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పుడు లక్షల మంది పేదింటి ఆడపడుచుల జీవితాల్లో మాతృత్వపు వెలుగులు పంచుతున్నాయి. తల్లిపేగు తెంచుకుని ఈ లోకంలోకి వచ్చిన శిశువుకు ఆత్మీయ రక్షణ దొరికింది.. మహిళలు గర్భం దాల్చినప్పట్నుంచి కాన్పు తర్వాత ఇంటికి చేరే వరకు.. పోషకాహారం, వైద్యుల పర్యవేక్షణ, ఆసుపత్రులకు వెళ్లటం, ప్రసవించాక తల్లీబిడ్డా ఇంటికి చేరటం వరకూ.. అండగా నిలుస్తోంది ప్రభుత్వం. మాతాశిశు మరణాలను తగ్గించేందుకు ఎన్నో వర్ధమాన దేశాలు ఆపసోపాలు పడుతుండగా.. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్‌ ఎంతో ముందడుగు వేసి చాలావరకూ సఫలీకృతమైంది.

 

గర్భిణులకు అంగన్‌వాడీ కేంద్రాలలో ప్రభుత్వం బలవర్థకమైన ఆహారం క్రమం తప్పకుండా అందిస్తోంది. ప్రతి రోజు మధ్యాహ్నం 100 మి.లీ. పాలు, గుడ్డు, ఆకుకూరతో పప్పును ఇస్తోంది. రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులను గుర్తించి వారికి అదనంగా పోషకాహారాన్ని అందించటం రాష్ట్రానికే ప్రత్యేకం. ప్రాంతాన్ని బట్టి చిరుధాన్యాలు, బెల్లం, పల్లీ ఉండలు, ఎండు ద్రాక్ష, రాగిపిండి, రాగిరొట్టె, జొన్న రొట్టె వంటివీ ఇస్తోంది. దేశంలో ఇలా అదనపు పౌష్టికాహారం అందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశే కావటం విశేషం! దీనివల్ల గర్భిణుల ఆరోగ్యం మెరుగుపడి శిశువులూ చక్కటి ఆరోగ్యంతో జన్మిస్తున్నారు.

ప్రైవేటు కాన్పులకూ ప్రోత్సాహకాలు

ఇప్పటి వరకూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులకే ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం తాజాగా తల్లి సురక్ష పథకం కింద ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవాలకూ ఆ ఖర్చు చెల్లించేలా మరో పథకాన్ని ప్రారంభించింది. ప్రభుత్వం ఖరారు చేసిన ఫీజులకు అనుగుణంగా కాన్పులు చేసేందుకు ముందుకొచ్చే ప్రైవేటు ఆస్పత్రులకు బిల్లులు చెల్లిస్తున్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్కానింగ్‌ పరీక్షలు అందుబాటులోకి తెచ్చారు. ‘తల్లీబిడ్డ చల్లగా’ పథకంలో నగర ప్రాంతాల్లోని గర్భిణులకు రూ.5500, గ్రామీణ ప్రాంతాల వారికి రూ.6000 ప్రత్యేకంగా అందిస్తున్నారు. ఆసుపత్రుల్లో కాన్పులు జరిగేలా చొరవ తీసుకోవడంతో రాష్ట్రంలో ప్రసవ మరణాలు చాలావరకు తగ్గాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగే ప్రతి ప్రసవానికీ కొంత మొత్తం చొప్పున వైద్యులకు, సిబ్బందికి ప్రోత్సాహకాలూ ఇస్తున్నారు.

బూచోళ్లకు చెక్‌

ప్రభుత్వాసుపత్రుల్లో శిశువుల అపహరణ పెద్దసమస్యగా మారింది. దీన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం.. శిశువులు, తల్లులకు ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌లు అమర్చే విధానం ప్రవేశపెట్టింది. 12 బోధనాస్పత్రులు, 11 వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రుల్లో ఇప్పటివరకు 2 లక్షల మందికి ఈ ట్యాగ్‌లు వేశారు.

ఎక్స్‌ప్రెస్‌.. రయ్‌రయ్‌

ఏజెన్సీలు, మారుమాల గ్రామాల్లో ఉండే బాలింతలు ప్రసవానంతరం బిడ్డను తీసుకుని ఇళ్లకు వెళ్లాలంటే నానాయాతన పడేవారు. ఈ సమస్యను అధిగమించి వారిని క్షేమంగా ఇళ్లకు చేర్చేందుకు ప్రభుత్వం ‘తల్లీబిడ్డ’ ఎక్స్‌ప్రెస్‌ ఉచిత సేవలు అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లో జీపీఎస్‌తో 279 వాహనాలను అందుబాటులో ఉంచారు. ఇప్పటివరకు 9,86,449 మంది బాలింతలను ఇళ్లకు తరలించారు.

బేబీ కిట్‌.. సూపర్‌ హిట్‌

ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పు అనంతరం శిశువుల కోసం రూ.773 విలువైన ఎన్టీఆర్‌ బేబి కిట్‌ అందిస్తున్నారు. తువ్వాలు, బేబీ బెడ్‌, గొడుగు, దోమతెర, సోప్‌వాటర్‌ ఇందులో ఉంటాయి. 2016 సెప్టెంబరు నుంచి ఇప్పటివరకు 7,65,819 మందికి వీటిని అందించింది. అలాగే ఆసుపత్రుల్లో కాన్పు జరిగితే డిశ్చార్జ్‌  సమయంలోనే జనన ధ్రువీకరణపత్రం జారీ చేస్తున్నారు.

సాయం మరువలేం
- అబ్దుల్‌ ఫర్జానా(22), కలిదిండి, కృష్ణా జిల్లా

గర్భం వచ్చినప్పట్నుంచి ప్రతి నెలా స్థానిక ఏఎన్‌ఎంలు పరీక్ష చేసేవారు. మంచి ఆహారం ఇచ్చేవాళ్లు. ఇప్పుడు బేబీ కిట్‌ను అందించారు. ఆసుపత్రి నుంచి ఇంటికి రావడానికి డబ్బులు ఖర్చు పెట్టకుండా తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనంంలో ఇంటికి చేరుకున్నాం. ప్రభుత్వ చర్యలు ఎంతో సౌకర్యంగా ఉన్నాయి.

ఖరీదైన సేవలు ఉచితంగా
- మార్తమ్మ(23), కొల్లూరు.

మొదట్నుంచి ఏఎన్‌ఎంల సలహా పాటించా. ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచి, వైద్య సేవలు అందించారు. బిడ్డ పుట్టిన తర్వాత జనన ధ్రువీకరణపత్రం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా అక్కడిక్కడే అందించారు. ఖరీదైన వైద్య సేవలు ఉచితంగా అందుతుండడం ఎంతో సంతోషంగా ఉంది.

కార్పొరేట్‌ భవనం కాదు ప్రభుత్వాసుపత్రి

చుట్టూ పచ్చదనం.. ఆహ్లాదకర వాతావరణం.. చూడటానికి కార్పొరేట్‌ కార్యాలయంలా కనిపిస్తున్న ఈ అద్దాలమేడ.. రాయలసీమలోనే అతిపెద్ద ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి. తిరుపతిలో రూ.77 కోట్లతో నిర్మించిన ఈ భవనాన్ని రెండేళ్ల కింద ప్రభుత్వం ప్రారంభించింది.

తెల్లరేషనుకార్డు దారులకు వైద్యం వరం

తెల్లరేషన్‌కార్డు కలిగిన కుటుంబాలకు కార్పొరేట్‌ వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సంకల్పించింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఏడాదికి రూ.5 లక్షల వైద్య సేవలు అందించే కార్యక్రమం అమల్లోకి రానుంది. దీనివల్ల 1.44కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్టు ద్వారా అమలు చేస్తున్నారు.

హాయిగా నిరీక్షించొచ్చు

దవాఖానాకు వెళితే దుర్గంధం భరించలేక.. కూర్చునేందుకు స్థలం లేక ఏ చెట్టు నీడనో వేచి ఉండే దుస్థితికి కాలం చెల్లింది. అనంతపురం జిల్లా హిందూపురంలోని ప్రభుత్వాసుపత్రిలో నిఘా కెమెరాలు, ప్రత్యేకంగా ఉంచిన కుర్చీలతో అందుబాటులోకి వచ్చిన ఆహ్లాదకరమైన నిరీక్షణ హాలిది!

దవాఖానా.. శుభ్రతకు చిరునామా

గుంటూరు జనరల్‌ ఆసుపత్రిలో ఎలుక కరిచి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన దరమిలా పారిశుద్ధ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. 11 బోధనాసుపత్రులు,  సామాజిక ఆసుపత్రులు, ఇతర ప్రధాన ఆసుపత్రుల్లో ఎంపిక చేసిన ప్రైవేటు సంస్థతో శుభ్రతపై దృష్టి పెట్టింది. వీటిల్లో పడకలపై రోజుకో రంగు దుప్పటి మారుస్తున్నారు. ఈ చర్యలతో దుర్వాసన చాలావరకు తగ్గింది.

వీడియోలో చూస్తారు.. వైద్యం చేస్తారు

దగ్గర్లో వైద్యులు లేకపోతే రోగులు పడే ఇబ్బందులెన్నో! దీనికి విరుగుడుగా ప్రభుత్వం వైద్యులను వీడియో సాయంతో రోగులతో మాట్లాడించి వైద్యసాయం అందిస్తోంది. విజయవాడలో ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ట్యాబ్‌లో వైద్యులతో మాట్లాడుతున్న ఓ యువతి.

‘మహాప్రస్థానం’ సేవలు

ఆసుపత్రుల్లో చనిపోయిన ఆప్తుల భౌతిక కాయాలను స్వస్థలాలకు ఉచితంగా అంబులెన్సులలో తరలిస్తున్నారు. 2017 జూన్‌లో ‘మహాప్రస్థానం’ పేరిట 13 బోధనాసుపత్రులు, 4 జిల్లా ఆసుపత్రుల్లో 53 అంబులెన్సు సేవలు ప్రారంభించారు. ఈ మార్చి నాటికి 36,467 భౌతిక కాయాలను తరలించారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.