close

ప్ర‌త్యేక క‌థ‌నం

రాజాధిరాజ.. రాజమార్తాండ

దేశ రాజకీయాల్లో రాజవంశీయులు
రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లలో ఎక్కువ

ఎనలేని దర్పం.. నిలువెత్తు ఠీవి.. సుదూరం నుంచి కూడా కనిపించే రాజమహళ్లు.. ఇవన్నీ వారి సొంతం. శయనాగారం లోంచి బయటకు రాగానే వంగి వంగి దండాలు పెట్టే సేవకులు, అడుగుతీసి అడుగు వేస్తే సకల సౌకర్యాలు అందించే నౌకర్లు అందరూ వాళ్ల వద్ద ఉంటారు. అలాంటి రాజకుటుంబాల వాళ్లు కూడా రాజకీయాల్లోకి వచ్చారు.. రాణించారు. ఇప్పటికీ కొంతమంది రాజకీయాల్లో కొనసాగుతున్నారు. రాజకీయ సర్దుబాట్ల కోసం.. తమ మధ్య ఏళ్ల తరబడి ఉన్న శత్రుత్వాలను కూడా వదిలిపెట్టి ఒకే ఒరలో రెండు కత్తుల్లా ఇమిడిపోతున్నారు. ఉత్తరాదిలో ప్రధానంగా రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలలో ఎక్కువ రాజకుటుంబాలు రాజకీయాల్లోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో పూసపాటి, బొబ్బిలి, శత్రుచర్ల, వైరిచర్ల తదితర వంశీకులు ఎప్పటినుంచో రాజకీయ రంగంలో రాణిస్తున్నారు.

జైపుర్‌ రాజవంశం

జైపుర్‌ యువరాణి దియా కుమారి భారతీయ జనతాపార్టీలో చేరి, సవాయ్‌ మాధోపూర్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె తండ్రి బ్రిగేడియర్‌ భవానీసింగ్‌ 1989లో కాంగ్రెస్‌ టికెట్‌పై లోక్‌సభకు పోటీచేసి ఓడిపోయారు. ఆమె నాయనమ్మ రాణీ గాయత్రీదేవి 1960, 70లలో కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా మొదలైన స్వతంత్రపార్టీ వ్యవస్థాపకులలో ఒకరు. ఆమె 1962 నుంచి 1971 వరకు వరుసగా మూడుసార్లు జైపుర్‌ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు.

సిసోదియా రాణా వంశం

రాజస్థాన్‌లోని సిసోదియా రాణా వంశానికి చెందిన మహారాజా రఘునాథ్‌ సింగ్‌  1957లో పార్లమెంటుకు ఎన్నిక కాగా, 1957-67 మధ్య హుకుమ్‌ సింగ్‌ ఎమ్మెల్యేగా చేశారు. చంద్రవీర్‌ సింగ్‌ 1980లో ఎమ్మెల్యేగా గెలవగా, ఆ తర్వాత డాక్టర్‌ జితేంద్రసింగ్‌ ఆయన వారసత్వం (1990-93) అందిపుచ్చుకున్నారు.

పూసపాటి వంశీయులు

ప్రస్తుత విజయనగరం ఎంపీ, కేంద్ర మాజీమంత్రి అశోక్‌ గజపతి రాజు పూసపాటి వంశీయులు. ఆ వంశానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. పూసపాటి విజయరామ గజపతిరాజు (పీవీజీ రాజు) ఎంపీగా పనిచేశారు. ఆయన విజయనగర రాజవంశానికి చెందిన మహారాజా అలక్‌నారాయణ గజపతి, మహారాణి విద్యావతిల పెద్దకొడుకు. పీవీజీ రాజు మొదటి కుమారుడు అనంద గజపతి రాజు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మంత్రిగా, రెండుసార్లు ఎంపీగా పనిచేశారు. టీడీపీ నుంచి బొబ్బిలి ఎంపీగా గెలిచారు. తర్వాత కాంగ్రెస్‌లో చేరి.. ఒకసారి ఓడిపోయి, తర్వాత 1991లో గెలిచారు. 96, 98 ఎన్నికల్లో ఓడిపోయి తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. పీవీజీ రాజు రెండో కుమారుడైన అశోక్‌ గజపతిరాజు ప్రస్తుతం విజయనగరం ఎంపీ, అక్కడి ఎస్టేట్‌కు రాజు. తొలిసారి 1978లో జనతాపార్టీ తరఫున పోటీచేశారు. 36 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో విజయనగరం ఎంపీగా గెలిచి కేంద్రంలో పౌరవిమానయాన శాఖ మంత్రిగా చేశారు. విజయనగరం, బొబ్బిలి రాజుల మధ్య శతాబ్దాలుగా బద్ధవైరం ఉండేది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా కొనసాగింది. రెండు కుటుంబాలూ ఎప్పుడూ వేర్వేరు పార్టీలలో ఉండేవి. గత ఎన్నికలలో వైఎస్‌ఆర్‌సీపీ తరఫున గెలిచిన బొబ్బిలి రాజు రావు సుజయకృష్ణ రంగారావు తెలుగుదేశం పార్టీలో చేరారు. పూసపాటి అశోక్‌ గజపతిరాజుతో వైరానికి స్వస్తి పలికారు. ఇప్పుడు ఎన్నికల్లో టీడీపీ తరఫున బొబ్బిలి నుంచి పోటీ చేస్తుండటంతో పాటు విజయనగరం ఎంపీ అభ్యర్థి అశోక్‌ గజపతికి మద్దతు కూడా పలుకుతున్నారు.
* (తమిళనాడులో పూసపాటి కుమారస్వామి రాజా 1949 నుంచి 1952 వరకు ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, 1954 నుంచి ఒడిశా గవర్నర్‌గా పనిచేశారు. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. కొంతకాలం జైలుజీవితం కూడా గడిపారు.)

జోధ్‌పుర్‌  రాజకుటుంబం

జోధ్‌పుర్‌ మహారాజు హన్వంత్‌ సింగ్‌ తొలిసారి 1952లో లోక్‌సభకు పోటీ చేసి, రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి జైనారాయణ్‌ వ్యాస్‌ను ఓడించారు. ఆయన భార్య కృష్ణకుమారి 1971లో జోధ్‌పుర్‌ ఎంపీగా గెలిచారు. అదే కుటుంబ వారసురాలు చంద్రేశ్‌ కుమారి కటోచ్‌ కూడా తర్వాత జోధ్‌పుర్‌ ఎంపీ అయ్యారు.

పటియాలా రాజు.. సీఎం

పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ పటియాలా రాజకుటుంబానికి చెందినవారు. ఆయన మహారాజా యదవీంద్ర సింగ్‌, రాజమాతా మొహీందర్‌ కౌర్‌ల కుమారుడు. రాజమాత ఎంపీగా పనిచేశారు. అమరీందర్‌ భార్య ప్రణీత్‌ కౌర్‌, కుమారుడు రణీందర్‌ సింగ్‌ కూడా కాంగ్రెస్‌ రాజకీయాల్లో ఉన్నారు.

కోటా వంశం

రాజస్థాన్‌లోని కోటా వంశానికి చెందిన మాజీ మహారాజు బ్రిజ్‌రాజ్‌ సింగ్‌ ఝలావర్‌ నుంచి ఎంపీగా గెలవగా, ఆయన కుమారుడు ఇజయరాజ్‌ సింగ్‌ 2009లో కోటా ఎంపీగా గెలిచినా, 2014లో ఓడిపోయారు.

రాఘోగఢ్‌ నుంచి దిగ్విజయ

రాఘోగఢ్‌ రాజకుటుంబం కూడా రాజకీయాలలో చురుగ్గానే పాల్గొంటోంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయసింగ్‌, ఆయన తమ్ముడు లక్ష్మణ్‌ సింగ్‌, దిగ్విజయ కుమారుడు జైవర్ధన్‌ సింగ్‌ అందరూ కాంగ్రెస్‌లో ఉన్నారు.

వీరభద్రుడూ..

హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రానికి నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన వీరభద్రసింగ్‌ కూడా రాజకుటుంబీకుడే. బుషహర్‌ ప్రాంత రాజు.. రాజా సర్‌ పదమ్‌ సింగ్‌ కుమారుడే వీరభద్రసింగ్‌.

జైసల్మేర్‌

రాజ కుటుంబానికి చెందిన మహారావల్‌ బ్రిజ్‌రాజ్‌ సింగ్‌ భార్య రాజేశ్వరీ రాజ్యలక్ష్మి కూడా రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు.

బీకానేర్‌  వంశం

బీకానేర్‌ మాజీరాజు కర్ణి సింగ్‌ 1951-52 లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసి గెలిచారు. ఆయన మనవరాలు సిద్ధికుమారి రెండుసార్లు బీకానేర్‌ తూర్పు స్థానం నుంచి భాజపా తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు.

గ్వాలియర్‌  ఘనత

రాజకుటుంబానికి చెందిన వసుంధరా రాజె.. తర్వాత రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌ రాజకుటుంబ కోడలిగా వెళ్లారు. రెండుసార్లు ముఖ్యమంత్రిగాను, ఒకసారి కేంద్ర సహాయమంత్రిగాను చేశారు. ఆమె కుమారుడు దుష్యంత్‌ సింగ్‌ ఝలావర్‌-బారన్‌ నుంచి ప్రస్తుత ఎంపీ. బీకానేర్‌కు చెందిన సిద్ధికుమారి, కరౌలీకి చెందిన రోహిణీ కుమారి ఇద్దరినీ రాజకీయాల్లోకి తెచ్చింది కూడా వసుంధరే.

భరత్‌పూర్‌ వంశం

రాజకుటుంబం నుంచి విశ్వేంద్ర సింగ్‌, ఆయన భార్య దివ్యాసింగ్‌ కూడా రాజకీయాల్లో ఉన్నారు. విశ్వేంద్ర కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కాగా, దివ్య బీజేపీ నుంచి భరత్‌పూర్‌ ఎంపీగా గెలిచారు.

సింధియాలు

హారాజా జార్జ్‌ జీవాజీరావు సింధియా భార్య రాజమాత విజయరాజె సింధియా 1962లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె కాంగ్రెస్‌లో చేరి, స్వతంత్ర పార్టీలోకి మారారు. తర్వాత భాజపాలోకి వెళ్లి చివరివరకు అక్కడే ఉన్నారు. భాజపాలో గ్వాలియర్‌ ఎంపీగా గెలిచారు. ఆమె కుమారుడు దివంగత మాధవరావు సింధియా కాంగ్రెస్‌లో చేరి కేంద్రమంత్రిగా పనిచేశారు. తల్లితో చాలాకాలం పాటు ఆయనకు సత్సంబంధాలు ఉండేవి కావు. ఆయన చెల్లెళ్లు వసుంధరా రాజె, యశోధరా రాజె ఇద్దరూ భాజపాలో కీలకనేతలు. మాధవరావు సింధియా కుమారుడు జ్యోతిరాదిత్య సింధియా ప్రస్తుతం గుణ ఎంపీ. మన్మోహన్‌ మంత్రివర్గంలో స్వతంత్రహోదా కలిగిన సహాయమంత్రిగా చేశారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.