close

ప్ర‌త్యేక క‌థ‌నం

పంటలు వర్షార్పణం

అకాల వానలతో అధిక నష్టం
మండు వేసవిలో వడగళ్లు, గాలులు
చేతికొచ్చే దశలో పైర్లు నేలమట్టం
మామిడి కాయలు రాలి రూ.కోట్లు నష్టం
అమ్మకానికి తెచ్చిన ధాన్యంపై వర్షపు నీరు
ఐకేపీ కేంద్రాల్లో టార్పాలిన్లు లేక అవస్థలు
ఈనాడు - హైదరాబాద్‌

కాల వర్షాలు రైతులను నట్టేట ముంచుతున్నాయి. మండుటెండల్లో అకస్మాత్తుగా వడగళ్లు, ఈదురు గాలులతో కూడిన వానలు అన్నదాతల ఆశలను దెబ్బతీస్తున్నాయి. గత జనవరి నుంచి సాగు చేసిన యాసంగి(రబీ) పంటలు కోత దశలో ఉన్నాయి. వర్షంతో పాటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులకు వరి ధాన్యం రాలిపోతోంది. మామిడి రైతుల వేదన వర్ణనాతీతం. ఏటా మామిడి కాయల కోత సీజన్‌ ఏప్రిల్‌లోనే అధికంగా ఉంటుంది. ఈ నెలలోనే వరుసగా వర్షాలు, గాలులతో మామిడి పంటకు నష్టం తీవ్రంగా ఉందని ఉద్యానశాఖ వెల్లడించింది. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటికే రూ.20 కోట్లకు పైగా విలువైన మామిడి కాయలు నేలరాలి అమ్మకానికి పనికిరాకుండా పోయాయి. మామిడి తోటలు అధికంగా ఉన్న జగిత్యాల జిల్లాలో గత ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకూ ఏడుసార్లు వర్షాలు కురవడంతో ఇక్కడ మామిడితో పాటు వరి, మొక్కజొన్న, నువ్వులు, అరటి, బొప్పాయి, మినుము, పెసర వంటి పంటలు దెబ్బతిన్నాయి. ఈ ఒక్క జిల్లాలోనే ఇప్పటికే 21 వేల ఎకరాల్లో దాదాపు రూ.53 కోట్ల విలువైన పంటలు నాశనమైనట్లు వ్యవసాయ, ఉద్యానాధికారులు తెలిపారు. నల్గొండ జిల్లాలో కోత దశలో ఉన్న వరి పైరు 3205 ఎకరాల్లో దెబ్బతింది. రాష్ట్రవ్యాప్తంగా 61,443 ఎకరాల వరకూ పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ, ఉద్యాన శాఖలు అధికారికంగా చెబుతున్నా నష్టం ఇంకా ఎక్కువగా ఉందని రైతులు వాపోతున్నారు. చాలాచోట్ల వరి పైరు నేలవాలి ధాన్యం రాలిపోతోంది. దీనివల్ల పంట దిగుబడి సగానికి సగం తగ్గుతోందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వడగళ్లు పడిన చోట మామిడి కాయలపై మచ్చలు ఏర్పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా 28,867 ఎకరాల్లో మామిడి తోటలు దెబ్బతినడంతో రూ.21 కోట్ల విలువైన పంటను రైతులు నష్టపోయినట్లు ఉద్యానశాఖ ప్రభుత్వానికి నివేదించింది.

కూరగాయల ధరలు ప్రియం
ఇప్పటికే సాగునీటి కొరతతో కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గి దిగుబడి లేక ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వస్తున్నాయి. చిల్లర ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలకు ఏకంగా దాదాపు 1800 ఎకరాల్లో కూరగాయల తోటలు నాశనమై రూ.కోటి విలువైన పంటలను రైతులు నష్టపోయారు. పలుచోట్ల కూరగాయ మొక్కలు వడగళ్ల వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్నాయి.

కొనుగోలు కేంద్రాల్లో ఆరబోస్తే అంతేనా!
వరి ధాన్యాన్ని మద్దతు ధరకు కొనేందుకు ఐకేపీ, వ్యవసాయ మార్కెట్లలో పెద్ద సంఖ్యలో కొనుగోలు కేంద్రాలు తెరిచారు. ఎక్కడా సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ధాన్యం రక్షణ  దైవాదీనంగా మారింది. వందలాది క్వింటాళ్లను ఆరుబయటే ఆరబోస్తున్నారు. చిన్న వర్షం పడినా వాటిని కాపాడేందుకు టార్పాలిన్లు ఉండటం లేదు. చాలాచోట్ల ధాన్యం వర్షపు నీటిలో మునిగి రైతులు నష్టపోతున్నారు. తడిసిన ధానాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చినట్లు మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. కొన్నిచోట్ల రైతుల నుంచి కొన్న ధాన్యాన్ని వెంటనే గోదాములకు తరలించకుండా ఆరుబయటే ఉంచేయడంతో వర్షపు నీటిలో మునిగాయి.

వ్యవసాయ అధికారులకు సమాచారమిచ్చినా రాలేదు

ప్రస్తుత రబీలో అయిదెకరాల్లో 1010 రకం వరి వంగడాలతో సాగు చేశా. ఎకరాకు 50 బస్తాల దిగుబడి వస్తుందనుకున్నా. పొలం కోతకు ముందు అకాలవర్షం, వడగళ్ల వాన రావడంతో పైరు మొత్తం నేలవాలి నష్టం జరిగింది. సగం ధాన్యం గింజలు భూమిపై రాలిపోయాయి. చివరికి ఎకరాకు 25 బస్తాలలోపే దిగుబడి వచ్చింది. జరిగిన నష్టంపై వ్యవసాయ శాఖాధికారులకు సమాచారమిచ్చినా వారు మా గ్రామంలోకి రాలేదు. మా ఊళ్లో 50 మంది రైతులు నష్టపోయారు.

- ఈశ్వర్‌రెడ్డి, రైతు, బొత్తలపాలెం, దామరచర్ల (మండలం)

తని పేరు పల్లెర్ల భూమేష్‌. ప్రస్తుత యాసంగిలో పండించిన వరి ధాన్యాన్ని అమ్మకానికి గ్రామంలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి తెచ్చారు. ఇక్కడ ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఉండటంతో అమ్మకానికి తెచ్చి అక్కడ ఆరబోశారు. కానీ సంఘం వద్ద టార్పాలిన్లు లేకపోవడంతో వర్షానికి ధాన్యం తడిసిపోయింది. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు ఉంచితే ఇలాంటి నష్టాలు జరిగేవి కావని రైతు ఆవేదన చెందారు.

ఆరబోసిన ధాన్యం తడిసిపోయిందని చూపుతున్న రైతు భూమేష్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.