close

ప్ర‌త్యేక క‌థ‌నం

సూక్ష్మసేద్యానికీ వేసవి సెగ

భూగర్భ జలాల్లో పెరుగుతున్న గాఢత
లోతుకు వెళ్లే కొద్దీ జల కాఠిన్యం
పూడుకుపోతున్న సూక్ష్మ, బిందు సేద్య పరికరాలు

మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల నుంచి ‘ఈనాడు’ ప్రతినిధి: వేసవి విజృంభించే కొద్దీ భూగర్భజలం లోలోతుకు వెళుతూ రైతుల నడ్డివిరుస్తోంది. భూమి పై పొరల్లో నీళ్లు తగ్గిపోవడంతో రైతులు మరింత లోతుకు కొత్త బోర్లు తవ్వుతున్నారు. కొన్ని జిల్లాల్లో 850 అడుగుల వరకు కూడా వేస్తున్నారు. అయితే లోతుకు వెళ్లేకొద్దీ నీరు పూర్తిగా కాఠిన్యంతో ఉండటంతో పెద్దగా ఉపయోగం ఉండటంలేదు. ఈ విషయంపై రైతులు దృష్టిసారించడం లేదు. చెట్లకు మేలు చేసే ఖనిజ లవణాలకు బదులు ఆ నీటిలో ఆమ్ల గుణంతో కూడిన గాఢత (పీహెచ్‌) అధికంగా ఉన్న లవణాలు, ఉప్పుశాతం ఉండటంతో నష్టం కూడా వాటిల్లుతోంది. మొక్కలు, చెట్లు ఆ నీటిని పీల్చుకోలేక శక్తిహీనం అవుతున్నాయని, ఈ నీరు పెద్దగా ఉపయోగపడటం లేదని నిపుణులు చెబుతున్నారు.

సాగుకోసం నేలను తొలుస్తున్నారు
రాష్ట్రంలో భూగర్భ జల ఆధారిత వ్యవసాయమే అధికం. ప్రాజెక్టు కాలువలు అందుబాటులో లేని చోట రైతులు అన్ని పరిస్థితుల్లోనే నేలనే నమ్ముకుంటున్నారు. రూ.లక్షలు ఖర్చుచేసి బోర్లు వేస్తున్నారు. పంటలను కాపాడుకునేందుకు ఎంతలోతైనా వేస్తున్నారు. రాష్ట్రంలో 25 జిల్లాల్లో భూగర్భ జలమట్టం లోతుల్లోకి వెళ్లింది. ప్రధానంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో తక్కువలో తక్కువ 400 అడుగులు తవ్వితేనే నీళ్లు పడుతున్నాయి. వ్యవసాయ కోసం మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లో 850 అడుగుల వరకు తవ్వుతున్నారు. ఒక్కో రైతు రెండు మూడు బోర్లు తవ్వుతున్నారు. నేలలోకి ఇంకుతున్న నీటిశాతం కన్నా భూగర్భంలో నుంచి బయటికి తోడుతున్న నీరే అధికంగా ఉంటోంది. భూగర్భ జలంలో సాధారణంగా నైట్రేట్‌, ఫ్లోరైడ్‌, సల్ఫేట్‌, కాల్షియం, మెగ్నీషియం, సోడియం, బైకార్బొనేట్‌, క్లోరైడ్స్‌, పొటాషియం తదితర మూలకాలు ఉంటాయని, నేల స్వభావం, రాతిపొరలను బట్టి వాటి గాఢత పాళ్లు పెరుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. భూగర్భంలోకి వెళ్లే కొద్దీ రకరకాల పొరలు రావడంతో నీటిలోకి ఈ మూలకాలు ఎక్కువగా చేరి ఖనిజలవణాల శాతంపై ప్రభావం చూపుతాయి. మరోవైపు ఒక మూలకంతో మరోమూలకం కలిసి రసాయన చర్యలు చోటుచేసుంటాయని సూచిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో చాలా జిల్లాల్లో పైపులకు గారపట్టడం, సూక్ష్మ, బిందు సేద్య పరికరాలు పూడుకుపోవడం లాంటి సమస్యలు వస్తున్నాయి.

రాష్ట్రంలో నేల రకాలు ఇవే..
రాష్ట్రంలో గ్రానైట్‌, లేటరైట్‌, క్వార్ట్జ్‌, లైమ్‌ స్టోన్‌, శాండ్‌ స్టోన్‌ తదితర రకాల రాతిపొరలు నేలలో ఉన్నాయి. ఏటా భూగర్భ జలవనరుల శాఖ రెండు సార్లు భూగర్భ జలాల నాణ్యతపై పరీక్షలు నిర్వహిస్తోంది. రాతిపొరలను కఠిన, సాధారణ పొరలుగా విభజించి జిల్లాల నుంచి నమూనాలు సేకరిస్తోంది. నీటిలో కలిసి ఉన్న మూలకాల శాతాన్ని విశ్లేషించి నివేదికలు విడుదల చేస్తోంది.

వర్షాలు తగ్గడంవల్లే..

వర్షాలు తగ్గిపోయిన చోట భూగర్భ జలాలు లోతుకు వెళ్లాయి. భూగర్భంలోకి పోయినకొద్దీ నీటిలో గాఢత పెరుగుతుంది. ఫ్లోరైడ్‌, నైట్రేట్‌, సల్ఫేట్‌, కాల్షియం తదితర మూలకాలు, లవణాలు, ఉప్పు శాతం పెరుగుతాయి. వర్షాలు కురిసి నేలలోకి నీరు ఇంకితే ఇవి కరిగి వాటి గాఢత తగ్గుతుంది. కొన్ని జిల్లాల్లో ఏటా వర్షాల శాతం తక్కువగా ఉంటోంది. దీంతో భూగర్భ జలం అట్టడుగు పొరల్లోనే ఉంటోంది.
- లక్ష్మా, సంయుక్త సంచాలకుడు, భూగర్భ జలవనరుల శాఖ

సేంద్రియ ఎరువులు వాడితేనే ఉపయోగం

లవణాల శాతం అధికంగా ఉన్న నీటిని కూరగాయల మొక్కలు స్వీకరించవు. కుళ్లిపోవడం, ఎండిపోవడం లాంటి సమస్యలు వస్తాయి. ఎరువులను కూడా గ్రహించలేవు. చెట్ల ఆకులపై మచ్చలు రావడం, పాలిపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. సేంద్రియ ఎరువులు వినియోగిస్తే కొంతవరకూ ఉపశమనం ఉంటుంది.

- సునీత, జిల్లా ఉద్యానశాఖ అధికారిణి

నీరు తగ్గింది.. డ్రిప్‌ పోయింది..

నాకు 700 మామిడి చెట్లు ఉన్నాయి. ఉన్న బోర్లలో నీరు తగ్గింది. మళ్లీ నాలుగు బోర్లు తవ్వించాను. 450 అడుగుల వరకు వెళ్లినా నీళ్లు సరిగ్గా లేవు. బిందు సేద్య పరికరాలు ఏర్పాటు చేసి నీళ్లు పెట్టాను. నీటిలోని గాఢతతో ఆ పరికరాలు కొద్దికాలానికే చెడిపోయాయి. పరికరాల్లోని సూక్ష్మ రంధ్రాలు పూడుకుపోయాయి. ఇప్పుడు నీళ్లు లేక పదేళ్ల వయసున్న 250 చెట్లు ఎండిపోయాయి.

- చిమ్ముల ధర్మారెడ్డి, తుమ్మలపల్లి, వంగూరు మండలం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.