తక్కువని ఆశపడితే మొదటికే మోసం
తక్కువని ఆశపడితే మొదటికే మోసం

 స్థిరాస్తుల కొనుగోళ్లలో అవగాహనే ముఖ్యం

నకిలీ పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో మోసాలు

రాష్ట్రంలో పెరుగుతున్న ‘భూ’బకాసురులు

తేలిగ్గా సంపాదించేందుకు అక్రమార్కులు ఖాళీ స్థలాలు, వివాదాస్పద భూములను అవకాశంగా మలుచుకుంటున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి తెలివిగా విక్రయిస్తున్నారు. తక్కువ ధరకు లభిస్తుందనే ఆశతో వేల మంది స్థల క్రయవిక్రయాల్లో తలనొప్పులు కొని తెచ్చుకుంటున్నారు. న్యాయస్థానంలో కేసులు, సివిల్‌ తగాదాలు కావటంతో పోలీసులు చేతులెత్తేస్తున్నారు. ఇదే అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. సొంతింటి కల నెరవేర్చుకునేందుకు, పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడిగా ఉంటుందని భావించి కొనుగోలు చేసినవారు చివరకు మోసపోయి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇంటి స్థలాలు/భూములు/ప్లాట్లు కొనుగోలు చేసే ముందే వాస్తవాలను పరిశీలించి వంద శాతం నిర్ధారించుకోవాలని   క్రెడాయ్‌ ఛైర్మన్‌ సీహెచ్‌.రామచంద్రారెడ్డి సూచిస్తున్నారు. రెరా(తెలంగాణ స్టేట్‌ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ), ధరణి వెబ్‌సైట్ల ద్వారా సమాచారం తెలుసుకోవచ్చని వివరించారు.

ఇవి పరిశీలించండి

* భూమికి చట్టపరమైన యజమాని ఎవరనేది నిర్ధారించుకోవాలి. ప్రస్తుత హక్కుదారులు ఎవరో సమాచారం సేకరించాలి. స్థల యజమాని, నిర్మాణదారుల మధ్య ఉన్న ఉమ్మడి ఒప్పందం గురించి తెలుసుకోవాలి. వాటికి సంబంధించిన పత్రాలను అడగాలి. టైటిల్‌ డీడ్‌ ద్వారా క్రయవిక్రయాలు జరిపేందుకు చట్టబద్ధమైన హక్కు ఉంటుంది. అంటే ఆ సంస్థ/వ్యక్తికి ఆస్తిని విక్రయించే అధికారం ఉన్నట్టు అర్థం.

* బ్యాంకు రుణంతో ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నారా అనేది గేటెడ్‌ కమ్యూనిటీస్‌లో ప్లాట్‌ కొనుగోలు చేయాలనుకునే వారికి ఉపయోగపడుతుంది. నిర్మాణదారులు బ్యాంకు రుణం తీసుకున్నారా! సొంత పెట్టుబడి ఉంచారా అనే వివరాలతో పాటు నిర్మాణ సంస్థ ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకోవాలి. కొనుగోలుదారుల నుంచి ముందుగా పెట్టుబడి స్వీకరించటం, బ్యాంకు రుణం పొందితే చట్టబద్ధంగా ధ్రువీకరించిన ప్రాజెక్టుగా గుర్తించవచ్చు.

* వ్యవసాయేతర అవసరాలకు ఉపయోగించేందుకు వీలుగా అనుమతి ఉందా! లేదా! అనేది తెలుసుకోవాలి.

* రూ.లక్షలు, రూ.కోట్లతో కొనుగోలు చేస్తున్న ఫ్లాట్‌/ప్లాటు విక్రయిస్తున్న సంస్థల గత చరిత్ర ప్రాజెక్టుకు లభించిన ఆమోదాలను ఒకటికి రెండుసార్లు చూడాలి.

* గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఉంటే రెరాలో నమోదైందో! లేదో తెలుసుకునే వీలుంది.

* సేల్‌ అగ్రిమెంట్‌, సేల్‌ డీడ్‌ మధ్య చాలా తేడా ఉంది. విక్రయ ఒప్పందం(సేల్‌ అగ్రిమెంట్‌్) ఆస్తి ధరలో 35-40 శాతం చెల్లించనపుడు చేసుకునేది. సేల్‌డీడ్‌ అంటే విక్రయించినట్టుగా చేసుకునే చట్టబద్ధమైన ఒప్పందం. సేల్‌డీడ్‌ జరగనంత వరకూ యజమాని కాలేమని గుర్తించాలి.


ఆలస్యమైనా అన్నీ చూడాలి...

ఆలస్యమైతే నివాస స్థలం/భూమి చేజారుతుందనే తొందరపాటుతో మోసపోతుంటారని షేక్‌పేట్‌ తహసీల్దార్‌ ఎన్‌.శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. కొనుగోలు చేసే స్థల పత్రాలను సంబంధిత ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశీలించి వాస్తవాలు తెలుసుకున్నాకే లావాదేవీలు నిర్వహించాలని సూచించారు.

* ఇనాం, వక్ఫ్‌, ఎసైన్డ్‌, దేవాదాయ తదితర విభాగాల జాబితాలో తాము కొనుగోలు చేసే స్థలం ఉందో..లేదో పరిశీలించాలి. రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌ 1908 సెక్షన్‌ 22(ఎ), ప్రభుత్వ చట్టాల కింద నిషేధిత ఆస్తుల కిందకు రాదని నిర్ధారించుకోవాలి.

* లింకు డాక్యుమెంట్లను సరిచూసుకోవాలి. ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ ద్వారా సర్వే నంబరు, సరిహద్దులు ఒకేలా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. సంబంధిత స్థలాలపై అంతకుముందే విక్రయ ఒప్పందాలు/తాకట్టు(మార్టిగేజ్‌) లేవనే విషయాన్నీ తెలుసుకోవాలి. ఆస్తిపై హక్కు ఉన్న చట్టబద్ధమైన వారసులు/ప్రతినిధులు సమ్మతించి ముందుకొచ్చారా లేదా అనేది చూడాలి.

* చిరునామా ధ్రువీకరణతో పాటు కొనుగోలుదారులు/విక్రయదారుల ఫొటోలు, వేలిముద్రలు పత్రాలపై అతికించారా లేదా చూసుకోవాలి. సాక్షుల ధ్రువీకరణపత్రం, ఐడీ కార్డులు పొందాలి.

* జీపీఏ వంటి డాక్యుమెంట్లు,  వాటి చెల్లుబాటునూ పరిశీలించాలి. ఫీల్డ్‌ మెజర్‌మెంట్‌ బుక్‌లో గ్రామ రెవెన్యూ రికార్డులు, భూమి కొలతలు, పట్టాలు, సర్వే నంబర్లు ఉంటాయి. దాన్ని పరిశీలించవచ్చు.

* ఒప్పందం కుదుర్చుకునే ముందే ఆయా ప్రాంతాన్ని బట్టి పంచాయతీ/పురపాలక సంస్థల నుంచి సర్టిఫై కాఫీ తీసుకోవచ్చు.

* లే అవుట్‌ నిర్మాణానికి గ్రామపంచాయతీ/పురపాలక/డీటీసీపీ/నగరపాలక/అర్బన్‌ డెవలప్‌ అథారిటీ హోదా కలిగిన సంస్థ ఆమోదం ఉందా! లేదా! అనేది చూసుకోవాలి.

* రిజిస్ట్రేషన్‌ దస్తావేజు లేకుండా నోటరీ డాక్యుమెంట్లపై ఆధారపడవద్దు.


తప్పిదాలు ఇలా..

అప్పుడప్పుడు క్రయవిక్రయాల్లో కొన్ని తప్పిదాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఒకటికి రెండు సార్లు పరిశీలించాలి.

* భూలావాదేవీల్లో విక్రయించిన వ్యక్తి పేరు తొలగించకపోవటం, కొనుగోలు చేసిన వారి పేరు చేర్చకపోవటం చేస్తుంటారు.జాగ్రత్తగా గమనించాలి.

* కంప్యూటర్‌లో భద్రపరిచేటపుడు చోటుచేసుకునే పొరపాట్లపై అప్రమత్తత అవసరం.

* మ్యుటేషన్‌ పూర్తయినప్పటికీ పహాణీలో చేర్చకపోవటం లాంటివి జరుగుతుంటాయి.

* యజమాని మరణించినపుడు వారసుల పేర్లలో దొర్లే తప్పిదాల పట్ల అప్రమత్తత అవసరం.

* సోర్స్‌ రిపోర్ట్‌, డాక్యుమెంట్స్‌ నకిలీ/అసలా అనేది కొద్దిమంది గుర్తించలేరు.

- ఈనాడు, హైదరాబాద్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని