close
Updated : 09/08/2021 13:24 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

46 ఏళ్ల ఈ ఒలింపియన్‌ కథేంటో తెలుసా?!

యుక్త వయసులోనే క్రీడల్లోకి రావడం.. వయసు పైబడకముందే రిటైర్మెంట్‌ ప్రకటించడం.. చాలామంది అథ్లెట్లు ఇదే సూత్రాన్ని పాటిస్తుంటారు. మరికొంతమంది అమ్మయ్యాక ఆటకు గుడ్‌బై చెబుతుంటారు. కానీ వయసు 50 ఏళ్లకు సమీపిస్తోన్నా ఆటల్లో కొనసాగడం, ఒలింపిక్స్ వంటి విశ్వ క్రీడలకు అర్హత సాధించి పతకాలు కొల్లగొట్టడం అంత సులభమైన విషయం కాదు.. కానీ తన విషయంలో మాత్రం ఆటకు, వయసుకు అసలు సంబంధమే లేదంటోంది ఉజ్బెకిస్థాన్‌కు చెందిన జిమ్నాస్ట్‌ ఒక్సానా చుసోవిటినా. ప్రస్తుతం 46 ఏళ్లున్న ఆమె.. తాజా టోక్యో ఒలింపిక్స్‌ క్రీడల్లోనూ మెరిసింది. తన మెరుపు విన్యాసాలతో అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే తృటిలో పతకం చేజారినా.. క్రీడాభిమానుల కరతాళధ్వనుల మధ్య తన సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలికింది. ఇలా లేటు వయసులో ఒలింపిక్స్‌లో పాల్గొనడం ఒక ఘనతైతే.. వరుసగా ఎనిమిది సార్లు విశ్వక్రీడల్లో పాల్గొని తన ప్రతిభను నిరూపించుకొని అరుదైన కీర్తిని మూటగట్టుకుంది ఒక్సానా. జీవితంలో ఎత్తుపల్లాలెన్నో ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్న ఈ గ్రేట్‌ ఒలింపియన్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

జిమ్నాస్టిక్స్‌.. పేరు తలచుకోగానే ఒళ్లు గగుర్పొడిచే క్రీడాకారిణుల విన్యాసాలే గుర్తొస్తాయి. ఇలాంటి సాహస క్రీడలోకి 13 ఏళ్ల వయసులో ప్రవేశించింది ఒక్సానా. 1975లో ఉజ్బెకిస్థాన్‌లోని బుఖారా అనే నగరంలో పుట్టిన ఆమె.. అరంగేట్రంలోనే అదరగొట్టింది. ‘యూఎస్‌ఎస్‌ఆర్‌ జూనియర్‌ నేషనల్‌ ఛాంపియన్‌షిప్స్‌’లో గెలిచి ఔరా అనిపించింది. తన క్రీడా ప్రతిభతో ఆ మరుసటి ఏడాదే సీనియర్‌ ప్లేయర్‌గా ప్రమోషన్‌ పొందింది.

కొనసాగిన పతకాల వేట!

వేదికేదైనా పతకాలు కొల్లగొట్టడమే లక్ష్యంగా ముందుకు సాగిన ఒక్సానా.. 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో తొలిసారి పాల్గొంది. యునిఫైడ్‌ టీమ్‌ (ఒకప్పటి సోవియట్‌ యూనియన్‌ టీమ్‌) సభ్యురాలిగా ఈ గేమ్స్‌లో పాల్గొని బంగారు పతకాన్ని కైవసం చేసుకున్న ఈ అథ్లెట్‌.. ‘పతకాల దాహం తీరనిద’న్నట్లుగా తన క్రీడా నైపుణ్యాల్ని ప్రదర్శించింది. తన 33 ఏళ్ల అథ్లెటిక్‌ కెరీర్‌లో భాగంగా.. రెండు ఒలింపిక్‌ పతకాలు (1992 బార్సిలోనా - యునిఫైడ్‌ టీమ్‌లో స్వర్ణం, 2008 బీజింగ్‌ - వాల్ట్‌లో రజతం), 11 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ మెడల్స్‌ (3 స్వర్ణాలు, 4 రజతాలు, 4 కాంస్యాలు), రెండు ప్రపంచకప్‌ మెడల్స్‌ (1 స్వర్ణం, 1 కాంస్యం), ఎనిమిది ఏషియన్‌ గేమ్స్‌ మెడల్స్‌, నాలుగు ఏషియన్ ఛాంపియన్షిప్‌ పతకాలు, నాలుగు యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌ పతకాలను తన ఖాతాలో వేసుకొని ప్రపంచంలోనే అత్యుత్తమ జిమ్నాస్ట్‌లలో ఒకరిగా మన్ననలందుకుంది.

కొడుకు కోసం పడరాని పాట్లు..!

రెజ్లర్‌ బజోదిర్‌ కుర్బనోవ్‌ను వివాహమాడిన ఒక్సానా.. 1999లో అలీషర్‌ అనే కొడుక్కి జన్మనిచ్చింది. అప్పుడు ఆమెకు 25 ఏళ్లు. ఆ మరుసటి ఏడాది జరిగిన సిడ్నీ ఒలింపిక్స్‌లో పాల్గొంటుందో లేదో, ఇక్కడితోనే తన జిమ్నాస్టిక్‌ ప్రస్థానం ముగుస్తుందేమో అనుకున్నారంతా! కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఈ పోటీల్లో పాల్గొంది ఒక్సానా. అంతేనా.. టాప్‌ 10లో నిలిచింది కూడా! అమ్మయ్యాక కూడా మహిళలు తమ కెరీర్‌ను కొనసాగించగలరని తన రీఎంట్రీతోనే నిరూపించిందామె. 
అయితే 2002లో తన కొడుక్కి లుకేమియా సమస్య ఉందని తెలిసింది. కొడుక్కి అత్యుత్తమ చికిత్స అందించాలన్న ఉద్దేశంతో కుటుంబంతో కలిసి జర్మనీ వెళ్లింది ఒక్సానా. అక్కడ చికిత్సకయ్యే ఖర్చు భారీగా ఉండడంతో డబ్బు కోసం అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేది. అక్కడా సక్సెస్‌ సాధించి సొంత డబ్బుతో తన కొడుకును పూర్తి ఆరోగ్యవంతుడిని చేసుకుంది. ‘కన్న బిడ్డ ప్రాణాంతక సమస్య నుంచి బయటపడ్డాడన్న సంతోషం ముందు ఏ పతకమైనా దిగదుడుపే! ఈ ఆనంద క్షణాన్ని ఏ విజయంతోనూ పోల్చలేను..’ అంటూ అమ్మగా ఉప్పొంగిపోయిందామె.

రిటైర్మెంట్‌ ప్రకటించి.. వెనక్కి తీసుకుంది!

బీజింగ్‌లో తన కొడుక్కి చికిత్స చేయించే క్రమంలో ఆ దేశం తరఫునే బీజింగ్‌, లండన్‌ ఒలింపిక్స్‌లో పాల్గొంది ఒక్సానా. అయితే లండన్‌లో ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో రిటైర్మెంట్ ప్రకటించిందామె. 
అయితే - ‘ఇక నేను రిటైరవుతున్నట్లు నిన్న రాత్రి ప్రకటించా.. కానీ ఉదయానికల్లా మనసు మార్చుకున్నా..’ అంటూ తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుందీ గ్రేట్‌ అథ్లెట్‌. అయితే ఆ తర్వాత రియో ఒలింపిక్స్‌లో పతకం గెలుచుకోకపోయినా.. తన అద్భుతమైన క్రీడా విన్యాసాలతో అందరి మన్ననలందుకుందామె.

ఇప్పుడు మనసు మార్చుకోను!

ఇక ప్రస్తుతం తన 46 ఏళ్ల వయసులోనూ టోక్యో ఒలింపిక్స్‌లోకి దూసుకొచ్చిన ఒక్సానా.. ఈ విశ్వ క్రీడల్లో పాల్గొనడం ఇది వరుసగా ఎనిమిదోసారి. ఈ నేపథ్యంలో క్రీడల్లో పాల్గొనడానికి, వయసుకు అసలు సంబంధమే లేదంటోంది. ఈ క్రీడల్లో మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ పతకం గెలుచుకోలేకపోయిందామె. అయినా లేటు వయసులో పడుచు పిల్లలా పోటీ పడుతూ అందరి మనసులు గెలుచుకుందీ అథ్లెటిక్‌ మామ్‌. అయితే గతంలో రిటైర్మెంట్‌ ప్రకటించి వెనక్కి తీసుకున్నట్లుగా.. ఇప్పుడు మనసు మార్చుకోనంటోంది ఒక్సానా.

‘ఈ ఒలింపిక్స్‌తో నా కెరీర్‌కు గుడ్‌బై చెప్పాలనుకున్నా.. ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. అలాగని జిమ్‌లో కసరత్తులు చేయడం మాత్రం మానను. నా 22 ఏళ్ల కొడుకు నా కోసం ఎదురుచూస్తున్నాడు. వాడితో సమయం గడపాలి.. అమ్మగా, ఆలిగా నా బాధ్యతల్ని పూర్తిగా నిర్వర్తించాలి.. ఇప్పటిదాకా నన్ను ఆదరించి, ప్రోత్సహించిన వారందరికీ ధన్యవాదాలు..!’ అంటూ భావోద్వేగానికి లోనైంది ఒక్సానా.

తన 33 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికిన ఈ గ్రేట్‌ ఒలింపియన్‌ను అభిమానులంతా కరతాళధ్వనుల మధ్య ఇంటికి సాగనంపారు. ఇలా ఎనిమిది సార్లు ఒలింపిక్స్‌లో పాల్గొని అరుదైన కీర్తి గడించిన ఆమె.. మూడు వేర్వేరు దేశాలకు (యునిఫైడ్‌ టీమ్‌, జర్మనీ, ఉజ్బెకిస్థాన్‌) ప్రాతినిథ్యం వహించిన ఏకైక అథ్లెట్‌గా సరికొత్త చరిత్రను తన పేరిట లిఖించుకుంది.

సాహో ఒక్సానా!


CSPNyYMnwcW

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని