close

తాజా వార్తలు

‘అప్పుడు కట్టబెట్టారు..ఇప్పుడు సాగనంపుతారు’

లఖ్‌నవూ: ఎన్నికల వేళ బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధినేత్రి ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. అత్యధిక సీట్లు కట్టబెట్టి ప్రధాని పదవికి దగ్గర చేసిన యూపీ ప్రజలు.. ఇప్పుడు ఆ కుర్చీ నుంచి మోదీని దించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. యూపీ ప్రజలు తనని ఆశీర్వదించారని గర్వంగా చెప్పుకుంటున్న మోదీ.. అధికారంలోకి వచ్చాక వారిని ఎందుకు విస్మరించారని నిలదీశారు. రాజకీయ లబ్ధి కోసమే మోదీ తన కులాన్ని వెనబడిన కులాల జాబితాలో చేర్చారని ఆరోపించారు. దీంతో ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మరోవైపు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రజల సమస్యల్ని తీర్చడం కోసమే బీఎస్పీ, ఎస్పీ, ఆర్‌ఎల్డీ పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయన్నారు. ఈసారి ఎన్నికల్లో భాజపా ఓడిపోవడం ఖాయమన్నారు. అది గ్రహించిన భాజపా నాయకుల్లో రోజురోజుకీ భయంతో పాటు అసహనం కూడా పెరిగిపోతోందన్నారు.

మరో ఘటనలో బీఎస్పీ-ఎస్పీ సంయుక్తంగా నిర్వహించిన ఓ ప్రచార సభలో మాయావతి అసహనానికి గురయ్యారు. సభలో మాట్లాడుతుండగా.. ఎస్పీ కార్యకర్తలు నినాదాలు చేయడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. క్రమశిక్షణ విషయంలో ఎస్పీ కార్యకర్తలు బీఎస్పీ వారిని చూసి నేర్చుకోవాలన్నారు. అలాగే ఈ సందర్భంగా భాజపా ప్రభుత్వంపైనా ఆమె విరుచుకుపడ్డారు. మీడియా, సర్వే పోల్స్‌ను వక్రీకరించి ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజలు మాత్రం పార్టీల మేనిఫెస్టోలు చూసి నిజా నిజాల్ని తెలుసుకోవాలని కోరారు. 78 లోక్‌సభ స్థానాలున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో 38 స్థానాల్లో బీఎస్పీ పోటీ చేస్తుండగా.. 37 సీట్లలో ఎస్పీ, మూడు స్థానాల్లో ఆర్‌ఎల్డీ బరిలోకి దిగనున్నాయి.  



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net