close

తాజా వార్తలు

ప్రధాని అభ్యర్థి రేసులో నేను లేను..

సమాజ్‌ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్ 

లఖ్‌నవూ (ఉత్తరప్రదేశ్‌): దేశానికి తదుపరి ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలన్న విషయాన్ని ప్రాంతీయ పార్టీలే నిర్ణయిస్తాయని సమాజ్‌ వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్‌ యాదవ్ వ్యాఖ్యానించారు. తాను మాత్రం ప్రధాని రేసులో లేనని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ‘భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌ కంటే ప్రాంతీయ పార్టీలకు అధిక సీట్లు వస్తాయి. తదుపరి ప్రధాని ఎవరన్న విషయాన్ని ప్రాంతీయ పార్టీలే నిర్ణయిస్తాయి. ప్రధాని అభ్యర్థి రేసులో నేను లేను. కానీ, ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన నేతే‌ తదుపరి ప్రధానిగా ఉంటే సంతోషిస్తాను’ అని వ్యాఖ్యానించారు.   

కాగా, మహాకూటమి నుంచి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరన్న విషయాన్ని వెల్లడించాలని భాజపా నేతలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల తర్వాతే ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి. ఈ విషయంపైనే అఖిలేశ్‌ స్పందిస్తూ ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఉత్తర్‌ప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో మాయావతి నేతృత్వంలోని బహుజన్‌ సమాజ్‌ పార్టీతో కలిసి ఎస్పీ పోటీ చేస్తోంది. కేంద్రంలో భాజపా, కాంగ్రెస్‌కు మెజార్టీ రాకపోతే ఈ కూటమి కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. 



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net