close

తాజా వార్తలు

దేశం వెనక్కు వెళ్ళిపోయింది..

గోరఖ్‌పూర్‌: మహాకూటమి నుంచి దేశానికి కొత్త ప్రధానమంత్రి రాబోతున్నారని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. దేశాన్ని ముందుకు నడిపిస్తానని మభ్యపెట్టి 2014లో అధికారంలోకి వచ్చిన భాజపా పాలన వల్ల దేశం కొన్నేళ్లు వెనక్కి వెళ్లిపోయిందని అన్నారు. ఉన్న ఉద్యోగాలు పోగొట్టారని, వారి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించలేకపోయారంటూ విమర్శించారు. లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నిరుద్యోగులను కూడా మోసం చేశారని అన్నారు. రైతులకు రూ.1.5 లక్షలు రుణమాఫీ అమలు చేస్తానని, చేయలేకపోయారన్నారు. ఇలా అందర్నీ మోసం చేసిన మోదీకి కాలం చెల్లిందని ఎద్దేవా చేశారు. గతంలో ఛాయ్‌వాలాగా చెప్పుకొని మోదీ గద్దెనెక్కారని, ఇప్పుడు ఆ టీ రుచి ఎలా ఉందో ప్రజలకు తెలిసిపోయిందన్నారు. ఈ చౌకీదార్‌కు మళ్లీ దేశ బాధ్యతలు అప్పగించేది లేదని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ-బీఎస్పీ-ఆర్‌ఎల్‌డీ పార్టీలు పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే.

మొత్తం ఏడు విడతల్లోనూ ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటికే ఆరు విడతలు పూర్తవగా, ఏడో విడతలో గోరఖ్‌పూర్‌ సహా 13 లోక్‌సభ స్థానాల్లో మే 19 ఎన్నికలు జరగనున్నాయి. మే 23న దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు జరగనుంది.



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net