ఆ సాన్నిహిత్యం నాకు సంకటం
నేనో సంస్థలో సర్వీస్ ఇంజినీర్‌గా పని చేస్తున్నా. ఓ సీనియర్‌తోపాటు నాకు అక్కడే వసతి కల్పించారు. అతడికి పెళ్లై ఇద్దరు పిల్లలున్నారు. వాళ్లు వేరే వూరిలో ఉంటారు. నా సీనియర్
తమ్ముడి భార్య చిన్నచిన్న పనులు చేసుకుంటూ మాకు దగ్గర్లోనే ఉంటోంది. ఓసారి ఆమెని మా గదికి తీసుకొచ్చి పరిచయం చేశాడు. ‘మేమిద్దరం ఫ్రెండ్స్‌లా ఉంటాం’ అన్నాడు. ఓరోజైతే వీళ్లిద్దరూ రాత్రంతా కలిసే ఉన్నారు. ఆపై నేను ఉన్నపుడు, లేనపుడూ రాకపోకలు కొనసాగుతున్నాయి. నాకేమో ఇబ్బందిగా ఉంది. నాకూ చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి. ఆమెతో చెప్పలేను. ఉద్యోగాన్నీ వదులుకోలేను. నన్నేం చేయమంటారు.
- ఓ పాఠకుడు
మీ రూమ్మేట్ ప్రవర్తనను ఎవరూ హర్షించరు. మీరు అతడి ప్రభావానికి లోను కాకుండా ఉండటం ముఖ్యం. సమాజ విలువలు పట్టించుకోని ఇలాంటి వ్యక్తులు కోరికల కోలాహలంలో కొట్టుకుపోతారు. వీరి దృష్టిలో సవ్యం, అపసవ్యాలకు
తేడా ఉండదు. కోల్మాన్ అనే సైకాలజిస్టు సామాజిక విలువలు రెండురకాలంటాడు. మొదటి విలువలు మాటలకే పరిమితం అవుతాయి. ఇలాంటి వ్యక్తులు సంఘం, వ్యక్తులు, విలువల గురించి గొప్పగా ఉపన్యాసాలు ఇస్తారు తప్ప చేతల్లో చూపించరు. రెండో రకం మనుషుల మాటలు, చేతలు ఒకేలా ఉంటాయి. అన్నదాన్ని ఆచరణలో చూపిస్తారు. అందుకే ఓ వ్యక్తి గురించి ఓ అంచనాకు వచ్చేముందు అతడి మాటలతోపాటు, చేసే పనులనూ గుర్తించాలి. మొదటిరకం వ్యక్తులు ఎక్కువైతే రంగు వెలిసిన దుస్తుల మాదిరిగా సమాజ విలువలు వెలవెలబోతాయి అంటాడు ఎమర్సన్ అనే మానసిక తత్వవేత్త. సాంగత్యం కూడా మనిషి వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతుంది. ఒక నీటిబొట్టు మురికి కాలువలో పడితే మలినం అవుతుంది. అదే ముత్యపు చిప్పలో పడితే స్వచ్ఛమైన ముత్యంగా మారిపోతుంది. మల్లెబుట్టలో ఉన్న వస్తువుకు మల్లెల వాసన సోకి ఆ వస్తువు కూడా గుబాళిస్తుంది.అందుకే మన చుట్టూ ఉన్న వ్యక్తులూ ముఖ్యమే. వాళ్లు మన ప్రవర్తనతోపాటు, వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తారు. అందుకే మీరు వెంటనే ఉన్నచోటును మార్చేయండి. లేదా మీ సహోద్యోగిని మార్చేయడానికి ప్రయత్నించండి. ఆ అమ్మాయి గురించి మర్చిపోండి. లేదంటే మీ ఆలోచనలు కూడా కలుషితం అవుతాయి.