హైటెక్‌ బాటన.. వన్యప్రాణి గణన.. ప్రత్యేక పరిజ్ఞానంతో 2 కోట్ల పేపర్ల ఆదా

తాజా వార్తలు

Published : 27/10/2021 12:34 IST

హైటెక్‌ బాటన.. వన్యప్రాణి గణన.. ప్రత్యేక పరిజ్ఞానంతో 2 కోట్ల పేపర్ల ఆదా

కవ్వాల్, అమ్రాబాద్‌లో పులులు, శాకాహార ప్రాణుల లెక్కింపు
 చెట్ల సంఖ్య, అడవిపై మనుషుల ఒత్తిడికి సంబంధించీ అధ్యయనం

హైదరాబాద్‌: స్వాతంత్య్ర అమృత మహోత్సవాల నేపథ్యంలో అఖిల భారత వన్యప్రాణి గణన ముందే మొదలైంది. ఈసారి జనవరి నెలాఖరు వరకు రాష్ట్రంలోని 3,083 అటవీబీట్లలో అది ఆధునిక పరిజ్ఞానంతో సాగనుంది. కాగితరహిత లెక్కింపుతో 2నెలల విలువైన సమయం, దేశవ్యాప్తంగా సుమారు 2కోట్ల పేపర్లు ఆదా అవుతాయని అటవీశాఖ చెబుతోంది. పెద్దపులులు సహా మాంసాహార, శాకాహార జంతువుల్ని లెక్కిస్తారు. అటవీప్రాంతాల్లో చెట్ల సంఖ్య, అడవిపై మనుషుల ఒత్తిడి తదితర వివరాలనూ అధ్యయనం చేయబోతున్నారు.

చెట్లకూ ఓ లెక్కుంది?

పులుల గణనలో భాగంగా ఈసారి చెట్ల సంఖ్యనూ లెక్కించనున్నారు. ‘ఆల్‌ ఇండియా టైగర్‌ ఎస్టిమేషన్‌’లో భాగంగా నాలుగేళ్లకు ఓసారి జరిగే గణనలో పులుల్ని, ఇతర వన్యప్రాణుల్ని లెక్కిస్తారు. అడవిలో చెట్లకు బిగించే కెమెరాల సాయంతో పాటు పులుల కాలిజాడలు, పెంటికలు, నేలపై, చెట్లపై అవి గీరిన గుర్తులను సేకరించి వాటి సంఖ్యను లెక్కిస్తారు.

చెట్ల లెక్కలకు.. ప్రతి 2 కి.మీ. అటవీప్రాంతంలో 400 మీటర్లకు ఒకటి చొప్పున అయిదు ప్రదేశాల్ని ఎంచుకుంటారు. ఒక్కోచోట 15 మీటర్ల వృత్తంగీసి.. అందులో ఎన్ని, ఏయే జాతుల చెట్లున్నాయో గుర్తిస్తారు. తద్వారా అటవీబీట్ల వారీగా చెట్ల సంఖ్య, జాతుల రకాల లెక్కల్ని రూపొందిస్తారు.
ప్రతి 2 కి.మీ. పరిధిలో అయిదుచోట్ల ఒక్కోటి మీటర్‌ చొప్పున వృత్తాలు గీసి.. అందులో ఉండే ఎండుగడ్డి, పచ్చిగడ్డి ఉండే ప్రాంతాలతో పాటు అసలు గడ్డిలేని ఖాళీ ప్రదేశమెంతో లెక్కిస్తారు.
నరికిన చెట్లను బట్టి కలప స్మగ్లింగ్‌ గురించి.. కొట్టేసిన కొమ్మల ఆధారంగా గొర్రెల కాపరుల ప్రభావం.. పశువుల కాపరులు, అటవీఉత్పత్తులకు ఎంతమంది వస్తున్నారు.. అడవిపై మనుషుల ఒత్తిడి ఎంతమేర ఉందన్న విషయాలనూ జంతుగణనలో భాగంగా అటవీశాఖ అధ్యయనం చేయనుంది.

ప్రతి బీట్‌లో మూడ్రోజులు..

పెద్దపులులు సహా చిరుతలు, తోడేళ్లు, నక్కలు, రేచుకుక్కలు, ఎలుగుబంట్లు వంటి మాంసాహార జంతువుల గణన అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులో తాజాగా మొదలైంది. కవ్వాల్‌ టైగర్‌ రిజర్వు, ఇతర సర్కిళ్లలో ఈనెల 27 తర్వాత.. దుప్పులు, మనుబోతులు, కొండగొర్రెలు, అడవిపందులు వంటి శాకాహార జంతువుల గణన జనవరిలో మొదలవుతుంది. మాంసాహార జంతువుల గణనకు ప్రతి అటవీబీట్‌లో రోజుకు 5 కి.మీ. వంతున మూడ్రోజుల పాటు తిరిగి సమాచారం సేకరిస్తారు. పులులు కనిపించకపోయినా వాటి జాడను పరిగణనలోకి తీసుకుంటారు. శాకాహార జంతువుల గణనలో రోజుకు 2 కి.మీ. నడుస్తారు. ప్రత్యక్షంగా చూసినవాటినే నమోదుచేస్తారు.

అంతా ‘స్మార్ట్‌’గా..

అటవీసిబ్బందికి స్మార్ట్‌ఫోన్లు ఇస్తున్నారు. అందులోని డేటాషీట్‌లో వివరాలు నమోదుచేస్తారు. గతంలో కాగితాలపై వివరాలు రికార్డు చేయాల్సి వచ్చేది. తెలంగాణలోని 3,083 బీట్లకు 92490 పేజీలు, దేశవ్యాప్తంగా 2.10కోట్ల పేజీలు నింపాల్సివచ్చేది. ఈసారి స్మార్ట్‌ఫోన్లలో అక్కడికక్కడే వివరాల నమోదుతో కాగితం అవసరం లేకపోయిందని, సమయమూ ఆదా కానుందని అటవీశాఖ ఓఎస్డీ శంకరన్‌ ‘ఈనాడు’కు తెలిపారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని