Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లోని టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 25/10/2021 13:00 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లోని టాప్‌ 10 వార్తలు

1.ప్రపంచ ఉద్యమాలకే కొత్త భాష్యం చెప్పాం: కేసీఆర్

తెలంగాణ ఉద్యమంపై ఆనాడు ఉన్న అనుమానాలు, అపోహలు, దుష్ప్రచారాల మధ్య గులాబీ జెండా ఎగిరిందని తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ అన్నారు. 2001 ఏప్రిల్‌ 27న కొండా లక్ష్మణ్‌ బాపూజీ సమక్షంలో జలదృశ్యంలో తెరాస ప్రస్థానం ప్రారంభమైందని చెప్పారు. నగరంలోని హెచ్‌ఐసీసీలో జరుగుతున్న తెరాస ప్లీనరీలో ఆయన మాట్లాడారు. తెరాస అధ్యక్షుడిగా  పదోసారి ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

2.విశాఖలో రోడ్డెక్కిన పాఠశాల విద్యార్థినులు, తల్లిదండ్రులు

విశాఖలో శాక్రెడ్‌ హార్ట్‌ ఎయిడెడ్‌ బాలికోన్నత పాఠశాల మూసివేతపై విద్యార్థులు, తల్ల్లిదండ్రులు రోడ్డెక్కారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా రాస్తారోకో చేపట్టారు. జ్ఞానాపురం రోడ్డును దిగ్బంధించారు. తమకు నవరత్నాలు వద్దని చదువుకోనిస్తే చాలని విద్యార్థులు నినాదాలు చేశారు. అర్ధాంతరంగా పాఠశాలను మూసేస్తే తమ పిల్లల భవిష్యత్ ఏంటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

3.రాష్ట్రపతిని కలిసిన చంద్రబాబు బృందం

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను తెదేపా అధినేత చంద్రబాబు నేతృత్వంలోని ఏడుగురు నేతల బృందం కలిసింది. చంద్రబాబు వెంట ఎంపీలు కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్‌, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సహా పలువురు నేతలున్నారు. ఏపీలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంతో శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లుతోందని, గంజాయి సాగు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతోందని రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు.

4.0.5 శాతం దిగువకు క్రియాశీల రేటు

దేశంలో కరోనా వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్త కేసులు 14 వేలకు పడిపోయాయి. క్రియాశీల రేటు గణనీయంగా తగ్గుతుండగా, రికవరీ రేటు ఊరటనిస్తోంది. సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు గణాంకాలను విడుదల చేసింది.

5.రిక్షావాలా పాన్‌కార్డుతో.. రూ.43కోట్ల వ్యాపారం..!

అతడో రిక్షావాలా. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. అలాంటి వ్యక్తికి ఆదాయపు పన్ను శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. అది కూడా ఏకంగా రూ.3.47 కోట్ల మేరకు పన్ను చెల్లించమని..! దీంతో కంగుతిన్న ఆ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

6.కరోనా అంతం అప్పుడే.. డబ్ల్యూహెచ్‌వో ఏం చెబుతోందంటే..

కరోనా మహమ్మారి ఎప్పటికి అంతమయ్యేను..? యావత్‌ ప్రపంచాన్ని వేధిస్తున్న ప్రశ్న ఇది. మరి దీనికి జవాబు దొరికేనా అంటే.. అది పూర్తిగా మన చేతుల్లోనే ఉందని అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో). మన వైద్యారోగ్య సాధనాలను సమర్థంగా ఉపయోగించుకున్నప్పుడే మహమ్మారిని అంతం చేయొచ్చని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధానమ్‌ తెలిపారు.

7.అట్టహాసంగా జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం

భారతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం సోమవారం అట్టహాసంగా జరుగుతోంది. దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో నిర్వహించిన 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇటీవల సినీరంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులతోపాటు ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రాలకు అవార్డులు అందజేశారు.

8.భారత్‌లో ఫేస్‌బుక్‌ వేదికగా విద్వేష ప్రచారం

ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఫేస్‌బుక్‌’ వేదికగా భారత్‌లో బూటకపు సమాచారం విస్తృతంగా ప్రచారంలోకి వస్తోంది! ప్రత్యర్థి వర్గాలను లక్ష్యంగా చేసుకొని తప్పుడు వార్తల్ని జనంలోకి జొప్పించేందుకు కొన్ని వర్గాలు అనేక గ్రూపులు, పేజీలను సృష్టిస్తున్నాయి!! స్వయంగా ఫేస్‌బుక్‌ అంతర్గతంగా నిర్వహించిన పరిశోధనలో తేలిన అంశాలివి. సంబంధిత వివరాలు అమెరికా మీడియాలో తాజాగా ప్రచురితమయ్యాయి.

9.స్టాక్‌ మార్కెట్‌లో బఫెట్‌, లించ్‌ పాటించే వ్యూహమిదే! 

పరిమితమైన రిస్కు, స్థిరమైన ప్రతిఫలం, మూలధన వృద్ధి.. ఇదీ స్టాక్‌ మార్కెట్‌లో మదుపు చేసే ప్రతిఒక్కరూ కోరుకునేది. అయితే, దీర్ఘకాలం వేచి చూడగలిగి.. ఓ వ్యూహం అనుసరిస్తే ఇది సాధ్యమే అని వారెన్‌ బఫెట్‌, పీటర్‌ లించ్‌ వంటి దిగ్గజ మదుపర్లు నిరూపించారు. మరి ఆ వ్యూహమేంటో తెలుసా?అదే వాల్యూ ఇన్వెస్టింగ్‌.

10.రోహిత్‌ శర్మను టీ20ల నుంచి తొలగిస్తారా?

2021 టీ20 ప్రపంచకప్‌లో (2021 t20 world cup) పాకిస్థాన్‌తో తలపడిన తొలి మ్యాచ్‌లో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(0) విఫలమవ్వడంపై మీడియా నుంచి ఎదురైన ఓ ప్రశ్నకు టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ దీటుగా బదులిచ్చాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ నవ్వులు విరిశాయి. దాయాదుల పోరులో హిట్‌మ్యాన్‌ తొలి ఓవర్‌లోనే షహీన్‌ అఫ్రిది బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగిన సంగతి తెలిసిందే.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని