టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM
close

తాజా వార్తలు

Published : 10/04/2021 08:57 IST

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. పట్ట పగ్గాలు లేని కరోనా

దేశంలో కరోనా మహమ్మారి పగ్గాల్లేకుండా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 1,31,968 మంది కరోనా బారిన పడ్డారు. 780 మంది ప్రాణాలు కోల్పోయారు. ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌లలో ఇదివరకు ఎన్నడూ లేనంత గరిష్ఠ సంఖ్యలో కేసులొచ్చాయి. మరో 25 రాష్ట్రాల్లో గత రెండు వారాలను మించిన స్థాయిలో కేసులు నమోదయ్యాయి. రోజువారీ కేసుల్లో మహారాష్ట్ర వాటా తగ్గి మిగిలిన రాష్ట్రాల వాటా పెరుగుతూ పోతోంది. ఛత్తీస్‌గఢ్‌లో వరుసగా రెండోరోజు పదివేలకు పైగా కేసులొచ్చాయి.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

2. ఉద్యమ రైతుల్లో కరోనా లేదు!

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు నాలుగు నెలలకు పైగా ఆందోళన బాటపట్టిన రైతాంగంపై కరోనా ప్రభావంలేదని వైద్యులు వెల్లడించారు. రోగ నిరోధక శక్తితో రైతులు సురక్షితంగానే ఉన్నారని సింఘూ సరిహద్దులో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న డాక్టర్లు, ఎన్జీవోల ప్రతినిధులు పేర్కొన్నారు. ‘‘ఇక్కడి కొంతమంది జలుబు, జ్వరం వంటి లక్షణాలతో బాధపడుతుండటంతో అందరికీ సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించాం. నలుగురిలో కరోనా లక్షణాలు కనిపించడంతో కొవిడ్‌ పరీక్షలకు పంపాం.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

3. విడాకులు తీసుకుంటే OCI హోదా ఉండదు!

విదేశీయులకు భారత పౌరసత్వం పొందే వీలున్న ఓసీఐ(ఓవర్సీస్‌ సిటిజన్స్‌ ఆఫ్‌ ఇండియా) హోదాపై కేంద్ర ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఓసీఐ పొందిన విదేశీయులు.. విడాకులు తీసుకున్న తరుణంలో ఆ హోదా రద్దు అవుతుందని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. భారతీయ పౌరుడిని పెళ్లాడిన ఒక బెల్జియం మహిళ కొంతకాలం క్రితం భర్త నుంచి విడాకులు తీసుకుంది. దీంతో ఓసీఐ కార్డును తిరిగి ఇచ్చేయాలని బెల్జియంలోని భారత రాయబార కార్యాలయం ఆమెను కోరింది. ఇందుకు ఆ మహిళ అభ్యంతరం వ్యక్తం చేసింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

4. భారత జలాల్లో అమెరికా యుద్ధనౌక సంచారం

‘స్వేచ్ఛాయుత నౌకాయాన హక్కు’ను చాటేందుకు భారత ప్రాదేశిక జలాల్లో లక్షదీవులకు సమీపంలో తమ నౌకాదళం ఒక ఆపరేషన్‌ నిర్వహించినట్లు అమెరికా తెలిపింది. ఇందుకోసం ఇండియా ముందస్తు అనుమతిని తీసుకోలేదని పేర్కొంది. భారత్‌ ‘మితిమీరి కోరుతున్న సముద్ర ప్రాదేశిక హక్కుల’ను సవాల్‌ చేసేందుకు ఈ చర్యను చేపట్టినట్లు పేర్కొంది. ఈ చర్యపై భారత్‌ ఆందోళన వ్యక్తంచేసింది. ఈ నెల 7న ఈ ఆపరేషన్‌ను నిర్వహించినట్లు అమెరికా నౌకాదళంలోని ఏడో విభాగం కమాండర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

5. ఇంటికి వెళ్లలేక.. అద్దింట్లో ఉండలేక

నగరంలో కరోనా వైరస్‌ బారిన పడిన వారు ఐసోలేషన్‌కు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో ఐసోలేషన్‌ కేంద్రాలు ప్రారంభించకపోవడంతో అవస్థలు పడాల్సి వస్తోంది. నాలుగైదు రోజులుగా హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో నిత్యం 700కుపైగా కేసులు వస్తున్నాయి. దీనికితోడు ప్రైవేటు ల్యాబ్‌లలో పరీక్షలు చేయించుకుని, రికార్డులకెక్కని కేసులు మరిన్ని ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. పాజిటివ్‌ వచ్చిన వారిలో 80-85శాతం మంది హోం ఐసోలేషన్‌లోనే ఉంటున్నట్లు వైద్యారోగ్య శాఖాధికారులు చెబుతున్నారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

6. ఆ కుటుంబం కన్నీళ్లు చూసే కదిలాం

జవాన్‌ రాకేశ్వర్‌సింగ్‌ మన్హాస్‌ భార్య, కుమార్తె కన్నీళ్లు చూసే మావోయిస్టుల వద్దకు వెళ్లామని ‘పద్మశ్రీ’ ధర్మపాల్‌ సైనీ బృందంలో ముఖ్య పాత్ర పోషించిన తెలం బోరయ్య శుక్రవారం ‘ఈటీవీ భారత్‌’కు తెలిపారు. బీజాపుర్‌ మెరుపుదాడి అనంతరం.. మావోయిస్టుల చెరలో ఉన్న కోబ్రా జవాన్‌ను మధ్యవర్తిత్వ బృందం చర్చల అనంతరం గురువారం  విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆవుపల్లి బ్లాక్‌లోని కమర్‌గూడకు చెందిన గోండ్వానా సమాజ్‌ జిల్లా అధ్యక్షుడు, విశ్రాంత ఉపాధ్యాయుడైన బోరయ్య ప్రభుత్వం తరఫున మావోయిస్టులతో చర్చించేందుకు బృందంతో వెళ్లారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

7. ఎవరేమన్నా.. ఈ గడ్డ బిడ్డనే

భౌతికంగా సాధించుకున్న ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు నెరవేరలేదని, స్వరాష్ట్ర ఫలాలు ప్రగతిభవన్‌ గేటు దాటలేదని వైఎస్‌ షర్మిల ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం రాష్ట్రం సాధించుకుంటే అవన్నీ కల్వకుంట్ల కుటుంబానికే దక్కాయని విమర్శించారు. తెలంగాణ ఆత్మగౌరవం నలిగిపోతోందని, కేసీఆర్‌ దయాదాక్షిణ్యాల మీద బతకాల్సిన పరిస్థితులు వచ్చాయని ధ్వజమెత్తారు. శుక్రవారం ఖమ్మంలో తొలిసారి నిర్వహించిన సంకల్పసభలో ఆమె మాట్లాడారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి రోజున జులై 8న కొత్తపార్టీ పేరు, జెండా, ఎజెండా ప్రకటిస్తానన్నారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

8. బెంగాల్‌లో కొనసాగుతున్న 4వ దశ పోలింగ్‌

పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీకి నాలుగో దశ ఎన్నికల పోలింగ్‌ శనివారం ఉదయం ప్రారంభమైంది. ఈ దశలో భాగంగా మొత్తం 44 నియోజకవర్గాల్లో పోలింగ్‌ కొనసాగుతోంది. మొత్తం 1.15కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ రోజు జరుగుతున్న పోలింగ్‌లో అన్ని స్థానాల్లో కలిపి మొత్తం 373 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. ఇందుకోసం మొత్తం 15,940 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

9. డెత్‌ స్పెషలిస్టు అతడే.. 20 పరుగుల లోటు

గతేడాదీ ఆరంభ పోరులో విజయం సాధించామని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. దిల్లీ నుంచి బదిలీ చేసుకున్న హర్షల్‌ పటేల్‌ తమ డెత్‌ బౌలర్‌గా కొనసాగుతాడని స్పష్టం చేశాడు. తొలి మ్యాచులో గెలిస్తే బాగుండేదని ముంబయి ఇండియన్స్‌ నాయకుడు రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు. తాము కనీసం 20 పరుగులు తక్కువ చేశామన్నాడు. పిచ్‌ అంత అనువుగా లేదని ఏబీ డివిలియర్స్‌ తెలిపాడు. ఐపీఎల్‌ 2021 ఆరంభ పోరులో ముంబయి నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు 2 వికెట్ల తేడాతో ఆఖరి బంతికి ఛేదించిన సంగతి తెలిసిందే.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

10. ఏడు పదులు దాటినా.. ఏం ఢోకాలేదు

దేశ ప్రజల సగటు ఆయుర్దాయం పెరగనుంది. 2031-35 నాటికి 72.41 ఏళ్లకు చేరనుంది. ‘మహిళలు ఎక్కువ కాలం జీవిస్తారు. వీరి సగటు జీవితకాలం 74.66 ఏళ్లు. పురుషుల ఆయుర్దాయం 71.17 ఏళ్లు’ అని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది. 2014-18 కాలంలో సగటు ఆయుర్దాయం 69.6 ఏళ్లుగా నమోదైంది. దేశ జనాభా 136.1 కోట్లని అంచనా కాగా.. గడిచిన పదేళ్లలో జనాభా పెరుగుదల రేటు 1.6 నుంచి 1.1కి తగ్గింది. భవిష్యత్తులోనూ తగ్గే అవకాశాలున్నాయి.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని