
అమ్మ ఇష్టం లేని కూర చేస్తేనే మనం కష్టంగా భోంచేస్తాం...మరి మనలా కాదో పిల్లాడు...నాన్న కోసం బోలెడు కష్టపడుతున్నాడు...ఎముక మజ్జను దానమిచ్చేందుకు సిద్ధమయ్యాడు...ఆపరేషన్లన్నా బెదరక ధైర్యంగా నిలిచాడు...ఇష్టం ఉన్నా లేకున్నా అన్నీ తినేస్తున్నాడు...అతని వివరాలే ఇవి!
నాన్న కోసం ఓ చిన్నారి అంకిత భావం చూసి అంతా చలించిపోయారు. నెట్టింట్లో ఇప్పుడీ అబ్బాయి ఓ హీరో. సోషల్ మీడియాల్లోనూ ఈ నాన్నా.. కొడుకుల కథనం వైరల్‌గా మారిపోయింది. ఏంటా కథాకమామీషు అంటే..

* ఈ అబ్బాయి పేరు లు జికుయాన్. వీళ్లది చైనాలోని సిన్సియాంగ్ సిటీ. * ఏడేళ్ల క్రితం ఈ పిల్లాడి నాన్నకి లుకేమియా అని తేలింది. అంటే రక్త క్యాన్సర్. గతేడాది వరకూ మందులతోనే చికిత్స చేశారు. తర్వాత ఇక మందులకు కష్టమని ఎవరిదైనా ఎముక మజ్జ ఎక్కించాలని వైద్యులు సూచించారు. * మామూలుగా ఈ జబ్బు ఉన్న వాళ్లకి కుటుంబ సభ్యుల్లో ఎవరిదైనా ఎముక మజ్జ సరిపోతే వాళ్లది ఎక్కించి వ్యాధిని నయం చేయవచ్చన్నమాట. * వాళ్ల కుటుంబ సభ్యులందరికీ పరీక్షలు నిర్వహించాక నాన్నకు సరిపోయే ఎముకమజ్జ జికుయాన్ దగ్గర మాత్రమే ఉందని డాక్టర్లు చెప్పారు. * ఇతను అప్పటికి చాలా బక్కగా ఉన్నాడు. పదేళ్ల వయసులో ఇంత తక్కువ బరువున్నప్పుడు మజ్జ తీస్తే కష్టమవుతుందని, కుదరదని డాక్టర్లు తేల్చారు. * తను ఎంత త్వరగా బరువు పెరిగి బలంగా అయితే అంత త్వరగా తండ్రికి ఆపరేషన్ చేయొచ్చని చెప్పారు. * మామూలుగా పదేళ్ల పిల్లలకు ఈ విషయాలన్నీ పెద్దగా అర్థం కావు. క్యాన్సర్‌లో ఉన్న ప్రమాదమేంటో ఆ చిన్న మెదళ్లు ఊహించలేవు. * మరేమో జికుయాన్ మాత్రం ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నాడు. ఎలాగైనా బరువు పెరుగుతానని, నాన్నను బతికించుకుంటానని చెప్పాడు. * అప్పటికే వాళ్ల కుటుంబానికి నాన్న ఆరోగ్య ఖర్చుల్ని భరించడమే కష్టమయ్యింది. అమ్మ ఒక్కతే ఓ నిత్యావసరాల దుకాణంలో పనిచేసి కొంచెం డబ్బులు సంపాదించేది. మరి ఇతనికి బలమైన ఆహారం ఎలా? ఇదే విషయాన్ని స్కూల్లోనూ వివరించాడీ పిల్లాడు. * ఈ విషయం తెలుసుకున్న స్కూలువారు ఓ ఫండ్‌ని పెట్టి విరాళాలు సేకరించారు. బయటవారూ కొంత సాయమందించారు. * దీంతో తను రోజుకు ఐదు సార్లు తినడం ప్రారంభించాడు. ఎక్కువ కొవ్వులున్న మాంసాహారాన్ని తీసుకోవడం మొదలు పెట్టాడు. తనకు ఇష్టం లేకపోయినా ఆహారాన్ని ఎక్కువెక్కువే తింటున్నాడు. 45 నుంచి 50 కిలోలు అవ్వాలన్నది తన ముందున్న లక్ష్యం. ఇప్పుడు అతడు 43 కిలోల బరువుకు చేరుకున్నాడు. దీంతో శస్త్రచికిత్స కోసం వైద్యులు సిద్ధమవుతున్నారు. * ఇతడిని ఇప్పటికే కొందరు పిల్లలు ఫ్యాట్ బాయ్ అంటూ వెక్కిరిస్తున్నారట. అవన్నీ తనకు లెక్కే కాదని తనకు ఆపరేషన్ అయ్యాక, నాన్నను రక్షించుకున్నాక తాను మళ్లీ బక్కగా మారగలనని చెబుతున్నాడీ చిన్నారి. ధైర్యవంతుడే కదూ!
|