close

ప్రధానాంశాలు

ఐపీఎల్‌: ‘సూపర్‌ ఓవర్‌’ చెప్పిన కథ

మొదటి బంతి నుంచి చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగే సమరం..
బ్యాట్స్‌మెన్‌, బౌలర్ల మధ్య పతాక స్థాయిలో ఉండే ఆధిపత్య పోరు...
రెండు జట్ల మధ్య చివరిక్షణం దాకా దోబూచులాడే విజయం...
ఇలా హోరాహోరీగా సాగే ఐపీఎల్‌ మ్యాచుల్లో ఫలితం తేలనివీ కొన్ని ఉన్నాయి! 
అందుకే ఈ క్రికెట్‌ సంగ్రామంలో విజేతను నిర్ణయించేందుకు వచ్చిందే సూపర్‌ ఓవర్‌!! 
ఆరు బంతుల్లో మ్యాచ్‌ ఫలితాన్ని తేల్చేసే ఈ సూపర్‌ ఓవర్‌.. మైదానంలో, టీవీల ముందుండే ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. 
ఇంతకీ ఈ సూపర్‌ ఓవర్‌ కథ ఏంటి? పదకొండేళ్ల ఐపీఎల్‌ ప్రస్థానంలో అలరించిన ఆ ఓవర్‌లేంటీ... మీరే చదవండి!! 

ఐపీఎల్‌లో మొదటి సూపర్‌ ఓవర్‌..
ది 2009 ఏప్రిల్‌ 23. కేప్‌టౌన్‌ వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్ల మధ్య జరుగుతోంది. మొదట బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ 6 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కోల్‌కతా కూడా 8 వికెట్లు కోల్పోయి 150 పరుగులే చేసింది. దాంతో అంపైర్లు సూపర్‌ ఓవర్‌కి ఆమోదం తెలిపారు. కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ క్రిస్‌గేల్‌, మెక్‌కల్లమ్ మూడు ఫోర్లతో 16 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్‌కు నిర్దేశించారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన రాజస్థాన్‌ బ్యాట్స్‌మెన్‌ యూసుఫ్‌ పటాన్‌ మొదటి నాలుగు బంతులకు 6, 2, 6, 4 కొట్టి రాజస్థాన్‌ను గెలిపించాడు.

 

పంజాబ్‌దే పైచేయి..
2010 మార్చి 21. చెన్నైలో చెపాక్‌ వేదిక. ఫామ్‌లో ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌కీ, పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కీ మధ్య మ్యాచ్‌. మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 8 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. 137 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ కూడా 136 పరగులకే చాపచుట్టేసింది. వెంటనే సూపర్‌ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన చెన్నై బ్యాట్స్‌మెన్‌ మాథ్యూ హెడెన్‌, సురేశ్‌ రైనా 10 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిచారు. మొదటి బంతికే సిక్స్‌ కొట్టిన పంజాబ్‌ బ్యాట్స్‌మెన్‌ జయవర్దనే రెండో బంతికి అవుటయ్యాడు. దీంతో క్రీజులోకి వచ్చిన యువరాజ్‌ నాలుగో బంతికి సిక్స్‌ కొట్టి పంజాబ్‌కు విజయాన్ని కట్టబెట్టాడు.

 

బౌలింగ్‌, బ్యాటింగ్‌ మధ్య సమరం
పీఎల్‌లో అత్యంత బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న జట్టేదంటే... కచ్చితంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు‌. 2013, ఏప్రిల్‌ 7. ఆ సీజన్‌లో ఏడో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 8వికెట్లకు 131 పరుగులు చేసింది. బ్యాటింగ్‌కు దిగిన సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ కూడా అదే స్కోరు చేసి ఇన్నింగ్స్‌ను ముగించింది. నిర్ణయాత్మక సూపర్‌ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన సన్‌ రైజర్స్‌ బ్యాట్స్‌మెన్‌ వైట్‌, తిసారా పెరీరా 21 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. బెంగుళూరు బ్యాట్స్‌మెన్‌ క్రిస్‌గేల్‌, విరాట్‌ కోహ్లీ బ్యాటింగ్‌కు వచ్చారు. స్టెయిన్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో 15 పరుగులు మాత్రమే చేయగలిగారు. దీంతో హైదరాబాద్‌ సన్‌ రైజర్స్‌ విజేతగా నిలిచింది.

 

రెండో సూపర్‌ ఓవర్‌ బెంగళూరుదే..
హైదరాబాద్‌తో సూపర్‌ ఓవర్‌ ఆడిన సరిగ్గా తొమ్మిదో రోజు దిల్లీతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మరో సూపర్‌ ఓవర్‌ ఆడింది. 2013లో గేల్‌ విజృంభణతో ప్రత్యర్థులను అలవోకగా జయిస్తున్న విరాట్‌ సేన.. దిల్లీతో జరిగిన ఓ మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌ వరకు వెళ్లాల్సి వచ్చింది. 153 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 152 పరుగులే చేసింది. స్కోర్లు సమం అయ్యాయి. ఆ వెంటనే మొదలైన సూపర్‌ ఓవర్లో బెంగళూరు 15 పరుగులు చేయగా, తర్వాత బ్యాటింగ్‌ చేసిన దిల్లీ డేర్‌ డెవిల్స్‌ 11 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. 

 

కోల్‌కతాపై మళ్లీ..
ది 2014 ఏప్రిల్‌ 29. అబుదాబిలో రాజస్థాన్ రాయల్స్‌‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య మ్యాచ్‌. రాజస్థాన్‌ 5 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. కోల్‌కతాదీ అదే స్కోరు. నిబంధనల ప్రకారం కోల్‌కతా బ్యాటింగ్‌కు దిగింది. 11 పరుగులు చేసింది. 12 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ను బ్యాట్స్‌మెన్‌ షేన్‌ వాట్సన్‌, స్మిత్‌ కలిసి గెలిపించారు.

 

బుమ్రా ప్రతాపం..
2017 ఏప్రిల్‌ 29న గుజరాత్‌ లయన్స్‌, ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌. మొదట బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ 9 వికెట్లకు 153 పరుగులు చేసింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో హార్డ్‌ హిట్టర్‌ హార్ధిక్‌ పాండ్య క్రీజులోనే ఉన్నప్పటికీ చివరి బంతికి చేతులెత్తేశాడు. దీంతో ముంబై కూడా అదే స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ ముగించింది. సూపర్‌ ఓవర్‌లో ముంబై బ్యాట్స్‌మెన్‌ పొలార్డ్‌, బట్లర్‌ క్రీజులోకి వచ్చారు. ఫాల్క్‌నర్‌ బౌలింగ్‌. ఆ ఓవర్‌లో పొలార్డ్‌ తాను ఎదుర్కొన్న తొలి రెండు బంతులకు 4, 6 కొట్టాడు. దీంతో జట్టు స్కోరు 11కు చేరుకుంది. 12 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు వచ్చిన గుజరాత్‌ బ్యాట్స్‌మెన్ బ్రాండన్‌ మెక్‌కలమ్‌‌, ఆరోన్‌ ఫించ్‌.. బుమ్రా బంతుల్ని ఎదుర్కొనేందుకు అష్టకష్టాలు పడ్డారు. కేవలం 6 పరుగులే వచ్చాయి. అందులో బ్యాటు ద్వారా వచ్చింది ఒక్క పరుగే. ఇంకేం, ముంబై జట్టు ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచింది. 

 

టీ20 క్రికెట్లో మ్యాచ్‌ ముగిసేసరికి రెండు జట్ల మధ్య స్కోరు సమానమైనప్పుడు మ్యాచ్‌ ఫలితాన్ని తేల్చేందుకు గతంలో బౌల్‌ అవుట్‌ విధానం ఉండేది. దీనికి బదులు 2012 అక్టోబర్‌లో ఐసీసీ సూపర్‌ ఓవర్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. విజేతను నిర్ణయించేందుకు నిర్దేశించిన ఈ ఓవర్‌ ఆడటానికి ఇరు జట్టూ కొన్ని నిబంధనలు పాటించాలి. 
* మ్యాచ్‌ ముగిసింది. స్కోరు సమానమైంది. ఫలితం తేలలేదు. అక్కణ్నుంచి పది నిమిషాల్లో సూపర్‌ ఓవర్‌ ప్రారంభం కావాలి. 
* రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసిన జట్టు సూపర్‌ ఓవర్‌లో మొదట బ్యాటింగ్‌కు రావాలి.

* ఏ ఆటగాడైనా.. బౌలింగ్‌ లేదా బ్యాటింగ్‌.. ఏదో ఒకటి మాత్రమే చేయాల్సి ఉంటుంది. కానీ రెండూ చేసేందుకు వీలు లేదు.
ప్రతి జట్టు నుంచి ముగ్గురు బ్యాటింగ్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది. రెండు వికెట్లు కోల్పోతే ఆ జట్టు ఆలౌట్‌ అయినట్టు పరిగణిస్తారు.
* ఒకవేళ సూపర్‌ ఓవర్లోనూ రెండు జట్లు సమానంగా పరుగులు చేస్తే.. బౌండరీలను లెక్కించి విజేతను నిర్ణయిస్తారు. అందులోనూ సమానంగా ఉంటే, ప్రధాన మ్యాచ్‌లో బౌండరీల్ని పరిగణనలోకి తీసుకుంటారు. అదీ కుదరకపోతే ప్రధాన మ్యాచ్‌, సూపర్‌ ఓవర్‌ రెండిట్లో కలిపి బౌండరీలు లెక్కిస్తారు. అలాకూడా సాధ్యంకాకపోతే సూపర్‌ ఓవర్‌లోని చివరి బంతి నుంచి అవరోహణ క్రమంలో రన్‌రేట్‌ను లెక్కగట్టి విజేతను ప్రకటిస్తారు.

 మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net