close

ప్రధానాంశాలు

ఇదే ఫామ్‌ కొనసాగిస్తా : హార్దిక్‌ పాండ్య

దిల్లీ : ఇక నుంచి ఇదే ఫామ్‌ కొనసాగిస్తానని ముంబయి ఇండియన్స్‌ ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్య అన్నాడు. దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాణించడంతో తన ఖాతాలో రెండో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు వేసుకున్నాడు. ఆఖర్లో బ్యాటింగ్‌కు వచ్చిన హార్దిక్‌ పాండ్య 15 బంతుల్లోనే 32 పరుగులు చేసి జట్టుకు మంచి స్కోరు అందించాడు. విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో పాండ్య ఇప్పటి వరకూ ఆడిన 9 మ్యాచ్‌ల్లో 218 పరుగులు చేయడంతో పాటు 8 వికెట్లు తీసి ముంబయి ఇండియన్స్‌ జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. దిల్లీతో మ్యాచ్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ గెలుచుకోవడంపై హార్దిక్‌ మాట్లాడాడు.

‘ఎప్పుడు సిక్సు కొట్టినా బంతిని ఇంకా బలంగా కొట్టాల్సింది.. అని నాకు నేను చెప్పుకొంటూ ఉంటా. నెట్స్‌లో తీవ్రంగా సాధన చేయడం వల్లే ఎక్కువ సిక్సులు కొట్టగలుగుతున్నా. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాను. ఈ సంవత్సరం నా మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది. అందుకే పిచ్‌, బంతిని సరిగ్గా అంచనా వేయగలుగుతున్నాను. ప్లే ఆఫ్స్‌కు చేరుకునేందుకు మాకు ఇంకా ఐదు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. సీజన్‌ మొత్తం ఇదే ఫామ్‌ కొనసాగిస్తానని అనుకుంటున్నాను’ అని హార్దిక్‌ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో దిల్లీపై ముంబయి ఇండియన్స్‌ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net