close

ప్రధానాంశాలు

స్వదేశానికి బట్లర్‌.. మరో ఇద్దరు కూడా..

జైపూర్‌ : రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు డాషింగ్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ జట్టుకు దూరం కానున్నాడు. జట్టులో కీలక బ్యాట్స్‌మన్‌గా ఉన్న బట్లర్‌ స్వదేశానికి పయనం కానున్నాడు. బట్లర్‌ భార్య లౌసీ పండంటి మగబిడ్డకు జన్మనివ్వడంతో వారిద్దరినీ చూసుకునేందుకు ఇంగ్లాండ్‌కు పయనమయ్యాడు. ఈ కారణంతోనే ముంబయి ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఆడలేదు. నిజానికి బట్లర్‌ ఈ నెల మొత్తం జట్టుతోనే ఉండాల్సి ఉంది. రాజస్థాన్‌ తరఫున 38.87 సగటుతో 311 పరుగులు చేసి అందరి కంటే ముందున్నాడు. స్ట్రైక్‌రేట్‌ కూడా 150కి పైనే ఉంది.

గత సీజన్‌లోనూ బట్లర్‌ మధ్యలోనే జట్టుకు దూరమయ్యాడు. జాతీయ జట్టుకు ఆడాల్సి రావడంతో అప్పుడు కూడా స్వదేశానికి వెళ్లిపోయాడు. రాజస్థాన్‌ ప్లేఆఫ్స్‌కు వెళ్లడంలో బట్లర్‌ కీలక పాత్ర పోషించాడు. వరుసగా ఐదు అర్ధశతకాలు బాదాడు. అయితే, బట్లర్‌తో పాటు ఏప్రిల్‌ 23న మరో ఇద్దరు కీలక ఆటగాళ్లు కూడా జట్టును వీడనున్నారు. దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌ తర్వాత బెన్‌ స్టోక్స్‌, జోఫ్రా అర్చర్‌ కూడా స్వదేశం పయనం కావాల్సి ఉంది. జట్టులో కీలక ఆటగాళ్లుగా ఉన్న ఈ ముగ్గురూ జట్టును వీడనుండటం ఆ జట్టును కలవరపెడుతోంది.



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net