close

ప్రధానాంశాలు

మరో మైలురాయి అందుకున్న హర్భజన్‌

విశాఖపట్నం : ఈసారి ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ తరఫున ప్రాతినిధ్యం వహించిన టర్భోనేటర్‌ హర్భజన్‌సింగ్‌ విశేషంగా రాణించాడు. ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే కీలక బ్యాట్స్‌మెన్‌ వికెట్లు తీస్తూ పవర్‌ప్లే స్పెషలిస్టుగా మారాడు. గతంలో ముంబయి ఇండియన్స్‌ తరఫున ఆడిన భజ్జీ.. శుక్రవారం దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ మైలురాయి అందుకున్నాడు. ఐపీఎల్‌లో 150 వికెట్ల క్లబ్‌లో చోటు సంపాదించాడు. దిల్లీ బ్యాట్స్‌మెన్‌ రూథర్‌ఫర్డ్‌ను పెవిలియన్‌కు పంపించి తన ఖాతాలో 150వ ఐపీఎల్‌ వికెట్‌ వేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన నాలుగో బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. కెప్టెన్‌ తనపై ఉంచిన నమ్మకం వల్లే ఈ ఘనత సాధించానని భజ్జీ పేర్కొన్నాడు. 
‘గతంలో నేను ఆడిన క్రికెట్‌కు ఇది పూర్తి భిన్నమైన ఫార్మాట్‌. అయితే, ఈ కొత్త ఫార్మాట్‌లోనూ 150 వికెట్లు తీయడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ప్రతిక్షణం నా బౌలింగ్‌కు మెరుగులు దిద్దుతూనే ఉంటాను. ఈ సంవత్సరం చాలా వికెట్లు తీశాను. పవర్‌ప్లేలో స్పిన్నర్‌తో బౌలింగ్‌ వేయించడం సాహసంతో కూడుకున్నది. అటువంటి పవర్‌ప్లేలోనూ బౌలింగ్‌ వేసి వికెట్లు తీయడం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. నాపై నమ్మకం ఉంచి ఈ అవకాశం ఇచ్చినందుకు ధోనీకి కృతజ్ఞతలు చెప్పాలి’ అని హర్భజన్‌ తెలిపాడు. ఈ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున 10 మ్యాచులాడిన భజ్జీ 16 వికెట్లు తీశాడు.

ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన వారిలో ముంబయి ఇండియన్స్‌ బౌలర్‌ లసిత్‌ మలింగ 169 వికెట్లతో అందరికంటే ముందున్నాడు. ఆ తర్వాత దిల్లీ క్యాపిటల్స్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా 156తో ఉండగా భజ్జీ 150 వికెట్లతో పియూశ్‌ చావ్లాతో సమానంగా ఉన్నాడు. భజ్జీతో పాటు మరో సీఎస్‌కే బౌలర్‌ డ్వేన్‌ బ్రావో కూడా 147 వికెట్లతో ఈ క్లబ్‌లో చేరేందుకు అతి చేరువలో ఉన్నాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు ఫైనల్‌కు చేరుకోవడంతో బ్రావో కూడా ఈ క్లబ్‌లో చేరే అవకాశం ఉంది.



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net