చరిత్ర

Published : 08/04/2021 19:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఏ ఐపీఎల్‌లో ఏమైందంటే?

క్రికెట్‌ అభిమానులు టీవీలకు అతుక్కుపోయే సమయం వచ్చేసింది. బ్యాటుకు బంతికి మధ్య యుద్ధం మరికొద్ది సేపట్లో ప్రారంభంకానుంది. కళ్లు చెదిరే సిక్సర్లు, నిప్పులు చెరిగే బంతులు, మెరుపులాంటి విన్యాసాలు ఐపీఎల్‌లో కోకొల్లలు. ఈసారి మరింత కనువిందు చేసేందుకు జట్లన్నీ సిద్ధమయ్యాయి. అత్యంత విజయవంతమైన మహేంద్ర సింగ్‌‌ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్‌కింగ్స్‌, అత్యంత విజయవంతమైన ముంబయి ఇండియన్స్‌ పోరుతో 13వ సీజన్‌ ఆరంభమవుతోంది. 12 ఏళ్ల ఐపీఎల్‌ ప్రస్థానంలోని విన్నర్లెవరూ.. రన్నర్లెవరు.. ఇలాంటి సంగతులపై ఓ లుక్కేయండి...

2008

ఐపీఎల్‌ ప్రారంభం

విజేత : రాజస్థాన్‌ రాయల్స్‌

రన్నరప్‌ : చెన్నై సూపర్‌ కింగ్స్‌

మ్యాచ్‌లు : 59

జట్లు : 8

ప్రత్యేకతలు : ఐపీఎల్‌ ప్రారంభంలోనే కోల్‌కతా బ్యాట్స్‌మన్‌ మెక్‌కలమ్‌ విధ్వంసం సృష్టించాడు. కేవలం 73 బంతుల్లోనే 13 సిక్సులు, 10 ఫోర్లతో 158 పరుగులు చేశాడు. అది ఆ సీజన్‌కే హైలైట్‌గా నిలిచిపోయింది. అంతేనా.. ఈ సీజన్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా కనీసం కోచ్‌ లేని రాజస్థాన్‌ రాయల్స్‌ టైటిల్‌ కొట్టి అందరినీ ఆశ్యర్యపరిచింది. ఈ సీజన్‌లో దక్కన్‌ ఛార్జర్స్‌ ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేదు. రాజస్థాన్‌, హైదరాబాద్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో 214 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్‌ ఛేదించి రికార్డు సృష్టించింది. ఆసీస్‌ దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌వార్న్‌ రాజస్థాన్‌ను అద్భుత నాయకత్వంతో విజేతగా నిలిపాడు.

2009

విజేత : దక్కన్‌ ఛార్జర్స్‌
రన్నరప్‌ : రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు
మ్యాచ్‌లు : 59
జట్లు : 8

ప్రత్యేకతలు : గత ఐపీఎల్‌ సీజన్‌లో ఒక్క మ్యాచూ గెలవని హైదరాబాద్‌ ఈ సారి ఏకంగా ఛాంపియన్‌గా అవతరించి చరిత్ర సృష్టించింది. సాధారణ ఎన్నికలు, ఐపీఎల్‌ ఒకేసారి రావడంతో భద్రత కల్పించలేమని ప్రభుత్వం చెప్పడంతో ఆతిథ్యం దక్షిణాఫ్రికాకు మారింది. దీంతో దక్షిణాఫ్రికాకు ఆర్థికంగా 100 మిలియన్‌ డాలర్ల వరకు లాభపడింది. మ్యాచ్‌లను భారత్‌లో ప్రసారం చేసేందుకు ఆయా ఛానెళ్లతో బీసీసీఐ భారీ మొత్తంలో ఒప్పందాలు కుదుర్చుకుంది. 

2010

విజేత : చెన్నై సూపర్‌కింగ్స్‌

రన్నరప్‌ : ముంబయి ఇండియన్స్‌

మ్యాచ్‌లు : 60

జట్లు : 8

ప్రత్యేకతలు : ఐపీఎల్‌కు ఆదరణ పెరగడంతో టోర్నమెంట్‌లో చివరి నాలుగు మ్యాచ్‌లను సినిమా థియేటర్లలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఫైనల్‌ మ్యాచ్‌లో ముంబయి, చెన్నై నువ్వానేనా అన్నట్టు పోటీపడ్డాయి. ధోనీ మ్యాజిక్‌తో విజిల్‌ పొడు బృందానికి ట్రోఫీ దక్కింది.

2011

విజేత : చెన్నై సూపర్‌ కింగ్స్‌

రన్నరప్‌ : రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు

మ్యాచ్‌లు : 74

జట్లు : 10

ప్రత్యేకతలు : ముందున్న ఎనిమిది జట్లకు తోడు కొత్తగా మరో రెండు జట్లు వచ్చి చేరాయి. పుణె వారియర్స్‌ ఇండియా, కోచి టస్కర్స్‌ కేరళ  ఐపీఎల్‌లో ప్రవేశించాయి. అందుకే మ్యాచ్‌ల సంఖ్య పెరిగింది. ఈ కొత్త జట్లు అనుకున్నంతగా ఆకట్టుకోలేదు. వరుసగా రెండోసారి ట్రోఫీ గెలిచి చెన్నై తిరుగులేని రికార్డు సృష్టించింది.

2012

విజేత : కోల్‌కతా నైట్‌ రైడర్స్‌

రన్నరప్‌ : చెన్నై సూపర్‌ కింగ్స్‌

మ్యాచ్‌లు : 76

జట్లు : 9

ప్రత్యేకతలు : సీజన్‌ ముగింపులో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు వచ్చాయి. ఓ స్థానిక వార్త ఛానెల్‌ చేపట్టిన స్ట్రింగ్‌ ఆపరేషన్‌లో ఐదుగురు ఐపీఎల్‌ ఆటగాళ్లు ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తెలిసింది. ఈ సీజన్‌లో పుణె వారియర్స్‌ఇండియా ఒక్క మ్యాచ్‌లోనూ విజయం అందుకోలేదు. గౌతమ్‌ గంభీర్‌ సారథ్యంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ విజేతగా నిలిచింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నైను చిత్తుగా ఓడించింది. 

2013

విజేత : ముంబయి ఇండియన్స్‌

రన్నరప్‌ : చెన్నై సూపర్‌ కింగ్స్‌

స్పాట్‌ ఫిక్సింగ్‌లు, బెట్టింగ్‌ ఆరోపణలు

మ్యాచ్‌లు : 76

జట్లు : 9

ప్రత్యేకతలు : 2011లో వచ్చిన పుణె వారియర్స్‌ ఇండియా జట్టు లీగ్‌ నుంచి నిష్క్రమించింది. గత సీజన్‌లో వచ్చిన స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో పాటు బెట్టింగ్‌ వ్యవహారాన్ని దిల్లీ పోలీసులు ఛేదించారు. ముగ్గురు రాజస్థాన్‌ ఆటగాళ్లతో పాటు మిగిలిన నిందితులను అరెస్టు చేశారు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు డ్వేన్‌ బ్రావో ఒకే సీజన్‌లో 32 వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. పుణె వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 263 పరుగులు చేసింది. ఆ మ్యాచ్‌లో గేల్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌ ఆడి 66 బంతుల్లోనే 17 సిక్సులు, 13 ఫోర్ల సాయంతో 175 పరుగులు చేశాడు. ఇదే ఇప్పటికీ చెరగని రికార్డుగా మిగిలిపోయింది. రోహిత్‌ సారథ్యంలో ముంబయి తొలిసారి ట్రోఫీ ముద్దాడింది.

2014

విజేత : కోల్‌కతా నైట్‌ రైడర్స్‌

రన్నరప్‌ : కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌

మ్యాచ్‌లు : 60

జట్లు : 8

ప్రత్యేకతలు : సాధారణ ఎన్నికలు రావడంతో భద్రతా కారణాల వల్ల టోర్నీ దుబాయ్‌కు తరలిపోయింది. కొన్ని మ్యాచ్‌లు దుబాయ్‌లో నిర్వహించగా ఆ తర్వాత మ్యాచ్‌లు భారత్‌లో నిర్వహించారు. గౌతీసేన రెండోసారి ట్రోఫీ ముద్దాడింది. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా నిలిచింది.

2015

విజేత : ముంబయి ఇండియన్స్‌

రన్నరప్‌ : చెన్నై సూపర్‌ కింగ్స్‌

మ్యాచ్‌లు : 60

జట్లు : 8

ప్రత్యేకతలు : ముంబయి ఇండియన్స్‌ ఆడిన మొదటి ఆరు మ్యాచ్‌లో ఐదింట్లో ఓడిపోయింది. ప్లేఆఫ్స్‌ అవకాశాలు క్లిష్టమయ్యాయి. గ్రూప్‌ దశ దాటాలంటే మిగిలిన ఎనిమిది మ్యచుల్లో ఏడు గెలవాల్సి ఉండగా.. గెలిచి  ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. చివరికి టైటిల్‌ కూడా నెగ్గింది. తొలిసారిగా ఐపీఎల్‌లో మహిళా వ్యాఖ్యాతలు వచ్చారు. భారత్‌కు చెందిన అజుం చోప్రాతో పాటు మరో ముగ్గురు మహిళలు వ్యాఖ్యానం చేశారు.

2016

విజేత : సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

రన్నరప్‌ : రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు

మ్యాచ్‌లు : 60

జట్లు : 8

ప్రత్యేకతలు : ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరు తెచ్చుకున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌తో పాటు రాజస్థాన్‌ రాయల్స్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో టోర్నీకి దురమయ్యాయి. ఆ జట్ల స్థానంలో గుజరాత్‌ లయన్స్‌, రైజింగ్‌ పుణె టోర్నీలో చేరాయి. ఎల్‌ఈడీ స్టంపులు వినియోగంలోకి వచ్చాయి. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ను డేవిడ్‌ వార్నర్ అద్బుతంగా ముందుకు నడిపించాడు. హైదరాబాద్‌ బౌలర్ల ధాటికి అన్ని జట్లూ విలవిల్లాడాయి. విరాట్‌ కోహ్లీ వీరోచిత ఫామ్‌లో ఉన్నాడు. నాలుగు శతకాలు బాది ప్రత్యర్థులను వణికించాడు. ఫైనల్లో రెండు జట్లు 200 పైచిలుకు పరుగులు చేశాయి. హైదరాబాద్‌ను విజయం వరించింది.

2017

విజేత : ముంబయి ఇండియన్స్‌

రన్నరప్‌ : రైజింగ్‌ పుణె సూజర్‌ జెయింట్‌ 

మ్యాచ్‌లు : 60

జట్లు : 8

ప్రత్యేకతలు : మొదటి టోర్నీలో ఘోరంగా విఫలమైన పుణె విజృంభించి ఏకంగా ఫైనల్‌కు చేరుకుంది. ఎటువంటి అంచనాల్లేని గుజరాత్‌ లయన్స్‌ సెమీ ఫైనల్‌ వరకు వచ్చి పోరాడింది. పుణె, గుజరాత్‌ జట్లకు ఐపీఎల్‌లో ఇదే ఆఖరి సీజన్‌. పుణె వారియర్స్‌ జట్టుపై అత్యధిక స్కోరు బాదిన బెంగళూరు ఈ సీజన్‌లో కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 49 పరుగులకే కుప్పకూలి అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. ధోనీ, స్మిత్‌ పరస్పర సహకారంతో పుణె అద్భుతం చేసింది. 

2018

విజేత : చెన్నై సూపర్‌ కింగ్స్‌

రన్నరప్‌ : సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌

మ్యాచ్‌లు : 60

జట్లు : 8

ప్రత్యేకతలు : ఫిక్సింగ్‌ ఆరోపణలతో రెండేళ్లు ఐపీఎల్‌ నుంచి నిషేధానికి గురైన చెన్నై సూపర్‌ కింగ్స్‌  టైటిల్‌ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సీజన్‌లో ధోనీ చెలరేగిపోయాడు. 50కి పైగా సగటు, 170కి పైగా స్ట్రైక్‌రేట్‌తో 445 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో 4,000పరుగుల మైలు రాయిని దాటాడు. టీ20ల్లో ఎక్కువ ఔట్లు చేసిన వికెట్‌ కీపర్‌గా రికార్డు సృష్టించాడు. దీంతో పాటు ఐపీఎల్‌ను ప్రసారం చేసేందకు స్టార్‌ ఇండియా నెట్‌వర్క్‌ సంస్థ బీసీసీఐతో దాదాపు రూ.16,000 కోట్లతో అంతర్జాతీయంగా ప్రసారాలకు ఐదేళ్ల  కాలపరిమితితో ఒప్పందం కుదుర్చుకుంది. 

2019

విజేత: ముంబయి ఇండియన్స్‌

రన్నరప్‌: చెన్నై సూపర్‌కింగ్స్‌

మ్యాచులు: 60

జట్లు: 8

ప్రత్యేకతలు : ఈ సీజన్‌ అత్యంత ఆసక్తికరంగా సాగింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన చెన్నై సూపర్‌కింగ్స్‌ మళ్లీ ఫైనల్‌ చేరుకుంది. ముంబయి ఇండియన్స్‌తో తలపడింది. ఉప్పల్‌ వేదికగా జరిగిన పోరులో 149 పరుగుల్ని కాపాడుకొని ముంబయి నాలుగోసారి విజేతగా అవతరించింది. పరుగు తేడాతో విజయం సాధించడం ప్రత్యేకం. ‘యే హై నయా దిల్లీ’ నినాదంతో వచ్చిన దిల్లీ క్యాపిటల్స్‌ 14 మ్యాచుల్లో 9 గెలిచి పట్టికలో మూడో స్థానంలో నిలవడం గమనార్హం. ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్‌కు షాకిచ్చిన ఆ జట్టు క్వాలిఫయర్‌-2లో ధోనీసేన అనుభవానికి తలవంచింది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 5 మ్యాచులే గెలిచి 11 పాయింట్లతో అట్టడుగున నిలిచింది. డేవిడ్‌ వార్నర్‌ (692 పరుగులు) ఆరెంజ్‌ క్యాప్‌, ఇమ్రాన్‌ తాహిర్‌ (26 వికెట్లు) పర్పుల్‌ క్యాప్‌ అందుకున్నారు. ఆరుగురు ఆటగాళ్లు శతకాలు బాదారు. ఆండ్రి రసెల్‌ విధ్వంసకరంగా బ్యాటింగ్‌ చేశాడు.

2020

విజేత: ముంబయి ఇండియన్స్‌

రన్నరప్‌: దిల్లీ కేపిటల్స్‌

మ్యాచులు: 60

జట్లు: 8

ప్రత్యేకతలు :  కరోనా మహమ్మారి బుస కొట్టడంతో 2020 సీజన్‌ ఆలస్యంగా ఆరంభమైంది. వేదిక యూఏఈకి మారింది. సెప్టెంబర్‌ 19న తొలి పోరులో చెన్నై చేతిలో ఓడిన ముంబయి అనూహ్యంగా ఐదోసారి ఐపీఎల్‌ ట్రోఫీ గెలిచేసింది. లీగ్‌ కోసం జట్లన్నీ నెల రోజులు ముందుగానే అక్కడికి చేరుకున్నాయి. మొదట్లో రెండురోజులు, తర్వాత ఐదు రోజులకు ఒకసారి ఆర్‌టీ పీసీఆర్‌ టెస్టులు చేశారు. మొదట్లో కరోనా కలకలం రేగినా టోర్నీ మధ్యలో మాత్రం ఎవ్వరూ వైరస్‌ బారిన పడలేదు. ప్రతి మ్యాచ్‌ అభిమానులను అలరించింది. అనూహ్యంగా ఈ సీజన్లో ఎక్కువ సూపర్‌ ఓవర్లు జరిగాయి. టోర్నీ చరిత్రలోనే తొలిసారి ఒకే మ్యాచులో రెండు సూపర్‌ ఓవర్లు, ఓకే రోజు రెండు మ్యాచుల్లో సూపర్‌ ఓవర్లు చూశాం.

ఫైనల్లో దిల్లీ క్యాపిటల్స్‌ ఆశల్ని ముంబయి భగ్నం చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన దిల్లీకి శుభారంభం దక్కలేదు. కష్టతరమైన బౌలింగ్‌లో ఆ జట్టు వణికిపోయింది. శ్రేయస్‌ అయ్యర్‌ (65*; 50 బంతుల్లో 6×4, 2×6), రిషభ్‌ పంత్‌ (56; 38 బంతుల్లో 4×4, 2×6) అర్ధశతకాలు చేయడంతో 7 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ట్రెంట్‌ బౌల్ట్‌ (3/30), కౌల్టర్‌ నైల్‌ (2/29) బంతితో రెచ్చిపోయారు. ఆ తర్వాత ఛేదనకు దిగిన ముంబయి 18.4 ఓవర్లకే 3 వికెట్ల తేడాతో మ్యాచును ముగించింది. రోహిత్‌ శర్మ (68; 51 బంతుల్లో 5×4, 4×6) అర్ధశతకంతో శుభారంభం అందించాడు. ఇషాన్‌ కిషన్‌ (33*; 19 బంతుల్లో 3×4, 1×6) అజేయంగా నిలిచాడు.

 

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net