ప్రధానాంశాలు

Published : 25/05/2021 23:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
IPL: ఆ రాత్రి ఎప్పటికీ మర్చిపోను: రషీద్‌ఖాన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: 2018 ఐపీఎల్‌ సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడిన క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌ను జీవితంలో ఎప్పటికీ మర్చిపోనని, ఆ మ్యాచ్‌లో తన ప్రదర్శనంటే ఎంతో ఇష్టమని అఫ్గానిస్థాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌ గుర్తుచేసుకున్నాడు. తాజాగా సన్‌రైజర్స్‌ విడుదల చేసిన ఓ వీడియోలో అతడు  ఈ విషయాన్ని వెల్లడించాడు. ఆ మ్యాచ్‌ జరిగి నేటికి మూడేళ్లు గడిచిన సందర్భంగా అందులో కీలకంగా ఆడిన రషీద్‌ ఖాన్‌ తన అనుభవాలను పంచుకున్నాడు.

‘ఐపీఎల్‌లో నాకు చాలా మధురానుభూతులు ఉన్నాయి. సన్‌రైజర్స్‌ తరఫున ఆడిన తొలి మ్యాచ్‌ కూడా అందులో ఒకటి. అయితే, 2018లో ఈడెన్‌ గార్డెన్స్ వేదికగా కోల్‌కతాతో ఆడిన మ్యాచే అన్నింటికంటే ప్రత్యేకమైనది. ఆ మ్యాచ్‌ను నేనెప్పటికీ మర్చిపోను. ఎందుకంటే అందులో బౌలింగ్‌ చేసి మూడు వికెట్లు తీయడమే కాకుండా బ్యాటింగ్‌లోనూ 34 పరుగులు సాధించాను. అలాగే ఒక రనౌట్‌ కూడా చేశాను. దాంతో మేం ఫైనల్‌కు దూసుకెళ్లాం. ఆ రాత్రిని నేనెప్పటికీ మర్చిపోను. అదో ప్రత్యేకమైన సందర్భం’ అని రషీద్‌ చెప్పుకొచ్చాడు. అలాగే అదే మ్యాచ్‌తో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ఖలీల్‌ అహ్మద్‌ మాట్లాడుతూ.. ఆ మ్యాచంటే తనకూ ముఖ్యమని చెప్పాడు. తాను ఐపీఎల్‌ ఆడాలని ఎదురుచూస్తున్న రోజుల్లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆ అవకాశం ఇచ్చిందన్నాడు.

ఇక ఆ మ్యాచ్‌లో హైదరాబాద్‌ 14 పరుగుల తేడాతో గెలుపొంది ఫైనల్‌కు చేరింది. జట్టు విజయంలో రషీద్‌ఖాన్‌ కీలక పాత్ర పోషించాడు. తొలుత సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ చేసి 174/7 పరుగుల భారీ స్కోర్‌ చేయగా.. ఛేదనలో కోల్‌కతా 160/9 స్కోరుకే పరిమితమైంది. సన్‌రైజర్స్‌ బ్యాట్స్‌మెన్‌లో వృద్ధిమాన్‌ సాహా(35; 27 బంతుల్లో 5x4), శిఖర్‌ ధావన్‌(34; 24 బంతుల్లో 4x4, 1x6), రషీద్‌ఖాన్‌(34; 10 బంతుల్లో 2x4, 4x6) కీలకంగా ఆడారు. ఆపై కోల్‌కతా ఛేదనలో రషీద్‌ఖాన్‌ మరోసారి మాయచేశాడు. కీలక సమయంలో ఓపెనర్‌ క్రిస్‌లిన్‌ (48; 31 బంతుల్లో 6x4, 2x6)తో పాటు రాబిన్‌ ఉతప్ప(2), ఆండ్రె రసెల్‌(3)లాంటి కీలక ఆటగాళ్లను పెవిలియన్‌కు పంపాడు. ఈ క్రమంలోనే నితీశ్‌ రాణా(22)ను సైతం అతడు రనౌట్‌ చేశాడు. అలా ఆ గొప్ప విజయంలో రషీద్‌ తనదైన ముద్ర వేశాడు.


1397138121079336962

ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net