close

తాజా వార్తలు

Updated : 22/11/2020 16:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

స్టే తొలగించగానే రిజిస్ట్రేషన్లు: కేసీఆర్‌

సిద్ధంగా ఉండాలని అధికారులకు సీఎం ఆదేశాలు

హైదరాబాద్‌: తెలంగాణలో సెకండ్ వేవ్ వచ్చినా కరోనా కేసులు మళ్లీ పెరగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ప్రగతి భవన్‌లో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, వైద్యారోగ్య శాఖ అధికారులు, ఇతర ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్షించారు. కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, తప్పకుండా వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య 10 శాతంలోపే ఉంటుందని కేసీఆర్‌ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు తగ్గుతున్నాయని, రికవరీ రేటు 94.5 శాతంగా ఉందని వివరించారు. కరోనా నిర్ధారణ అయినవారు కాస్త ఇబ్బందులు పడుతున్నప్పటికీ మరణించే వారి సంఖ్య తక్కువగానే ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల ఆక్సిజన్‌ బెడ్లు అందుబాటులో ఉన్నాయని, అవసరమైతే ఎన్నయినా సిద్ధం చేస్తామన్నారు. ఇతర రాష్ట్రాల్లో రోజురోజుకూ కేసులు పెరుగుతున్నందున రాష్ట్రంలోనూ  పెరిగే సూచనలున్నాయని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రజలు తప్పకుండా మాస్క్‌ ధరించాలని సూచించారు. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ముందుగా ఆరోగ్య సిబ్బందికే వ్యాక్సిన్ ఇస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

ఆ అధికారం ఎవరికీ లేదు..

రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభించడానికి సిద్ధంగా ఉండాలని కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రభుత్వం పూర్తి సంసిద్ధతతో ఉందని వెల్లడించారు. న్యాయస్థానం స్టే విధించినందున 23న ప్రారంభం కావాల్సిన పనులు తాత్కాలికంగా ఆగిపోయాయన్నారు. న్యాయస్థానం స్టే తొలిగించగానే రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. హైకోర్టు లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం పూర్తి వివరణ ఇచ్చినట్లు చెప్పారు. ఈ నెల 23న హైకోర్టులో విచారణ ఉన్నందున, 25 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో ఏ ఆస్తికి ఎంత విలువ అనేది అధికారులు నిర్ధారించారని, దాన్ని మార్చే విచక్షణాధికారం ఎవరికీ లేదని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన