close

తాజా వార్తలు

Published : 03/12/2020 12:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 1 PM

1. సీఎం పిరికిపందలా వ్యవహరిస్తున్నారు: తెదేపా

ముఖ్యమంత్రి జగన్‌ పిరికిపందలా వ్యవహరిస్తూ వ్యవస్థలన్నింటినీ నియంత్రించే యత్నం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడ్డారు. నమ్మి ఓట్లేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలపై ఏడాదిన్నరగా దాడులు కొనసాగుతున్నాయని ధ్వజమెత్తారు. వివిధ వర్గాలపై దాడులు, అసెంబ్లీలోకి మీడియా నియంత్రణను ఖండిస్తూ అధినేత చంద్రబాబు అధ్యక్షతన తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీ వరకూ కాలినడకన నిరసన ర్యాలీ చేపట్టారు. చిత్తశుద్ధి ఉంటే ఇకనైనా దాడులు ఆపి అసెంబ్లీలోకి అన్ని మీడియా ప్రతినిధులను అనుమతించాలని వారు డిమాండ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. టాప్‌టెన్‌ జాబితాలో జమ్మికుంట పోలీస్‌స్టేషన్‌

తెలంగాణలోని జమ్మికుంట పోలీస్‌ స్టేషన్‌కు అరుదైన గుర్తింపు లభించింది. దేశ వ్యాప్తంగా ఉన్న 16,671 పోలీస్‌ స్టేషన్లలో అగ్రస్థానంలో నిలిచిన 10 ఉత్తమ పోలీస్‌ స్టేషషన్ల జాబితాను గురువారం కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. వాటిలో కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట పోలీస్‌స్టేషన్‌ 10వ స్థానం దక్కించుకుంది. వివిధ విభాగాల్లో పోలీస్‌ స్టేషన్ల పనితీరు ఆధారంగా ర్యాంకులు ఇవ్వాలని 2015లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. జనవరిలో రజనీ రాజకీయ అరంగేట్రం

తమిళ ప్రజలు, అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ అరంగేట్రం ఖరారైంది. వచ్చే ఏడాది ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా తలైవా ప్రకటించారు. జనవరీలో రాజకీయ పార్టీని ప్రారంభిస్తానని, అందుకు సంబంధించిన వివరాలను డిసెంబరు 31న ప్రకటిస్తానని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కశ్మీర్‌ మ్యాప్‌పై వికీపీడియాకు కేంద్రం ఆదేశం

వికీపీడియాలో తప్పుగా చూపించిన జమ్ము కశ్మీర్‌ మ్యాప్‌ను తొలగించాలని భారత ప్రభుత్వం ఆదేశించింది. ఐటీ చట్టం 2000, సెక్షన్‌ 69ఏ ప్రకారం సంబంధిత లింకును తొలగించాలంటూ ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ వికీపీడియాకు ఆదేశాలు జారీ చేసింది. భారత్‌, భూటాన్ సంబంధాలకు సంబంధించిన వికీపీడియా పేజీలో జమ్ము-కశ్మీర్‌ మ్యాప్‌ను తప్పుగా చూపినట్టు ఓ ట్విటర్‌ వినియోగదారుడు గుర్తించటంతో విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మసాలా సామ్రాజ్యాధినేత మహాశయ్‌ ఇకలేరు

ప్రముఖ మసాలా ఉత్పత్తుల సంస్థ ఎండీహెచ్‌ అధినేత, పద్మభూషణ్‌ గ్రహీత మహాశయ్‌ ధర్మపాల్‌ గులాటీ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో దిల్లీలోని ఆసుపత్రిలో చేరిన ఆయన.. గురువారం తెల్లవారుజామున గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 97 సంవత్సరాలు. 1923లో పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్‌లో జన్మించిన గులాటీ నాలుగో తరగతితోనే చదువు మానేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మెగావారి ఇంట పెళ్లి సందడి షురూ

మెగా వారి కాంపౌడ్‌లో పెళ్లి సందడి షురూ అయ్యింది. నటుడు నాగబాబు కుమార్తె నిహారిక వివాహ సుముహూర్తం దగ్గరవుతున్న తరుణంలో మెగా కుటుంబంలో పార్టీలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే మెగా డాటర్స్‌ అందరూ కలిసి నిహారికకు ప్రత్యేకంగా డిన్నర్‌ పార్టీ ఇవ్వగా.. తాజాగా వధూవరులిద్దరికి ఓ సర్‌ప్రైజ్‌ ఏర్పాటు చేశారు. ఈ మేరకు తమ కుటుంబంలోకి చైతన్యను ఆహ్వానిస్తూ.. సుస్మిత, శ్రీజ దంపతులు బుధవారం రాత్రి ఓ స్పెషల్‌ పార్టీ ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. వ్యాక్సిన్‌ జోరు: యూకేకు భారతీయుల పరుగులు 

కరోనా నివారణ కోసం తయారైన ఫైజర్‌-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్‌కు బ్రిటన్‌ ప్రభుత్వం బుధవారం అత్యవసర వినియోగం కింద అనుమతి మంజూరు చేసింది. వచ్చే వారమే ప్రజలకు టీకాలు వేయడాన్ని ప్రారంభించేందుకు మార్గం సుగమం చేసింది. దీంతో భారతీయుల చూపు ఇప్పుడు యునైటెడ్‌ కింగడమ్‌(యూకే)పై పడింది. టీకా కోసం ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా బ్రిటన్‌ వెళ్లేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారట. ఈ మేరకు ట్రావెల్‌ ఏజెన్సీ‌ సంస్థలు తెలిపాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మరోసారి పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధరలు

రెండు రోజుల విరామం అనంతరం చమురు సంస్థలు మరోసారి ధరలు పెంచాయి. గురువారం పెట్రోలుపై 17, డీజిల్‌పై 19 పైసలు పెరిగాయి. దాంతో దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 82.66గా ఉండగా, డీజిల్ ధర 72.84కు చేరిందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అలాగే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు పీపా ధర 48.12 డాలర్లుగా ఉంది. చమురు సంస్థలు ధరలు పెంచడంతో నవంబర్ 20న పెట్రోల్, డీజిల్‌ ధరల్లో మార్పులు కనిపించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. టీకా వచ్చినా.. తక్షణమే కొవిడ్‌ అదుపులోకి రాదు..! 

మహమ్మారి కరోనా వైరస్‌ను కట్టడి చేసే వ్యాక్సిన్‌ త్వరలోనే అందుబాటులోకి రానున్నమాట నిజమే అయినప్పటికీ.. పెరుగుతున్న కేసులను కట్టడి చేయడానికి అవసరమైనన్ని టీకాలు ఇప్పట్లో అందుబాటులోకి రాకపోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది.  మితిమీరిన ఆత్మవిశ్వాసంతో మాస్క్‌, సామాజిక దూరం తదితర కొవిడ్‌ నిబంధనలను పాటించడం ఆపవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అర్ధరాత్రి తలుపుతట్టి తండ్రీకూతుళ్లపై దాడి

తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి తండ్రీకూతుళ్లపై దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడిన సీతారామయ్య శంఖవరం మండలం నెల్లిపూడి అగ్రహారం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అర్ధరాత్రి ఎవరో తలుపుకొట్టడంతో .. తలుపుతీసిన ఉపాధ్యాయుడిపై ముఖానికి రంగుపూసుకున్న గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. తండ్రిపై దాడిని అడ్డుకున్న కుమార్తె ధనశ్రీపై కూడా దుండగుడు దాడి చేశాడు. సీతారామయ్య భార్య గట్టిగా కేకలు వేయడంతో దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన