
తాజా వార్తలు
టాప్ 10 న్యూస్ @ 9 AM
1. విశాఖ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం
విశాఖ రాంకీ ఫార్మాసిటీలోని ‘విశాఖ సాల్వెంట్స్’ సంస్థలో సోమవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సాల్వెంట్ రికవరీ కాలమ్‌లో ప్రమాదం సంభవించడంతో మంటలు భారీఎత్తున ఎగసిపడ్డాయి. సంస్థ ప్రాంగణంలో ఉన్న రసాయనాల డ్రమ్ములకు కూడా మంటలు అంటుకోవడంతో అవి భారీ శబ్దాలతో పేలిపోయాయి. ఆ శబ్దాల ధాటికి స్థానికులు తీవ్రంగా భీతిల్లారు. శబ్దాలు సుమారు 10 కిలోమీటర్ల దూరం వరకు వినిపించడం వాటి తీవ్రతకు నిదర్శనం. మంటలు 30 నుంచి 50 అడుగుల ఎత్తు వరకు ఎగసిపడడంతో ప్రమాద తీవ్రతను చూసి పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. మరిన్ని ఐసీయూ పడకలు
హైదరాబాద్: కరోనా బాధితులకు చికిత్స అందించడంలో ప్రభుత్వ వైద్యానికి తోడుగా ప్రైవేటు బోధనాసుపత్రుల్లోనూ 11,950 పడకలు అందుబాటులో ఉన్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో 1,000 ఐసీయూ పడకలు కూడా ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు సోమవారం హైకోర్టుకు వైద్యఆరోగ్యశాఖ సమగ్ర నివేదికను సమర్పించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్ బాధితుల కోసం 5,131 పడకలున్నాయి. వీటిల్లో ఐసీయూ పడకలు 361, వెంటిలేటర్లతో కూడిన ఐసీయూ పడకలు 255 ఉండగా, 2,339 పడకలకు ఆక్సిజన్ సరఫరాను కూడా సమకూర్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. ఆరు జిల్లాల్లో ‘ఆరోగ్యశ్రీ’ సేవల విస్తరణ
ఆరోగ్యశ్రీ కింద అందించే వైద్య సేవలను ఆరు జిల్లాల్లో ఈ నెల 16వ తేదీ నుంచి విస్తరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో చికిత్స ఖర్చు రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా ప్రభుత్వం చెల్లిస్తుందని పేర్కొన్నారు. అమల్లో ఉన్న 1,059 వైద్య సేవలు కాకుండా అదనంగా మరో వెయ్యి సేవలను ఈ ఏడాది జనవరి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలుచేస్తున్నారు. కేన్సర్ కింద అదనంగా మరో 54 రకాల సేవలు చేర్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. గహ్లోత్ పక్షాన!
రసవత్తరంగా తయారైన రాజస్థాన్ రాజకీయాల తొలి అంకంలో ముఖ్యమంత్రి అశోక్గహ్లోత్ది పైచేయి అయింది. సోమవారం జైపుర్‌లోని తన అధికారిక నివాసంలో అశోక్ గహ్లోత్ పార్టీ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశం నిర్వహించి, తనకు బలం ఉందని చాటుకున్నారు. 200 మంది సభ్యులున్న అసెంబ్లీలో 109 మంది తమ పక్షాన ఉన్నట్లు ఆయన వర్గం ప్రకటించింది. ఈ సమావేశానికి 104 మంది హాజరై మద్దతు పలకగా, మరో ఐదుగురు లేఖలు పంపినట్లు వెల్లడించింది. తిరుగుబావుటా ఎగరేసిన ఉప ముఖ్యమంత్రి సచిన్‌పైలట్ వర్గం దీనికి గైర్హాజరైంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. రూ.75 వేల కోట్లు
వచ్చే 5-7 ఏళ్లలో భారత్‌లో రూ.75 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుందర్ పిచాయ్ సోమవారం ప్రకటించారు. దేశంలో డిజిటల్ పరిజ్ఞానానికి అలవాటుపడే ప్రక్రియను వేగవంతం చేయడానికి ఈ సొమ్మును వినియోగించనున్నట్లు ఆయన తెలిపారు. వార్షిక ‘గూగుల్ ఫర్ ఇండియా’ కార్యక్రమంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రకటన చేశారు. అంతకుముందు ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు. ‘గూగుల్ ఫర్ ఇండియా డిజిటైజేషన్ ఫండ్’ ద్వారా రూ.75 వేల కోట్ల (సుమారు 10 బిలియన్ డాలర్లు) పెట్టుబడిని పెట్టనున్నట్లు పిచాయ్ పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. యాంటీబాడీలు తగ్గిపోతున్నాయి
యాంటీబాడీలు... మన రోగ నిరోధక వ్యవస్థలో కీలకం. శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా, వైరస్ వంటి సూక్ష్మక్రిములపై పోరాడి రక్షించే సైనిక ప్రోటీన్లు. కరోనాపై పోరాటంలోనూ ఇవి కీలకంగా పని చేస్తున్నాయి. అయితే ఇవి కొన్ని నెలల్లోనే బాగా తగ్గిపోతున్నట్లు లండన్‌లోని కింగ్స్ కాలేజ్ పరిశోధకులు గుర్తించారు. అంటే కొవిడ్-19 వ్యాధికి గురయిన వారు ఆ వైరస్‌కు నిరోధకతను కొద్ది కాలంలోనే కోల్పోతున్నారన్న మాట. ఫలితంగా.. సాధారణ జలుబులాగానే కొవిడ్-19 కూడా మళ్లీ మళ్లీ సోకవచ్చని ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న నిపుణులు చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. రాముడు మా వాడు... మాదే అసలైన అయోధ్య
నేపాల్ ప్రధాని కె.పి.శర్మ ఓలి సరికొత్త వివాదానికి తెరలేపారు. నేపాల్‌లో ఉన్న అయోధ్యే అసలైన అయోధ్య అని...శ్రీరాముడి జన్మస్థానం దక్షిణ నేపాల్‌లోని థోడిలో ఉందంటూ కొత్త వాదనను వినిపించారు. ‘‘నిజమైన అయోధ్య నేపాల్‌లో బిర్గుంజ్కు పశ్చిమాన ఉన్న థోడీలో ఉంది. ఇక్కడే రాముడు జన్మించాడు. అయితే, రాముడి జన్మస్థానం భారత్‌లోని అయోధ్యేనని భారతీయులు వాదిస్తున్నారు. అక్కడి అయోధ్యపై పెద్ద వివాదం ఉంది. కానీ నేపాల్‌లోని అయోధ్యపై ఎలాంటి వివాదం లేదు’’ అని ఓలి తెలిపినట్లు ఆయన మీడియా సలహాదారు సూర్య థాపా వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. వ్యాక్సిన్ రాకపోతే -7.5 శాతం!
కొవిడ్-19 నిరోధానికి వ్యాక్సిన్ కనుక ఏడాది పాటు రాకపోతే, భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.5 శాతం క్షీణించవచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్లించ్ (బీఓఎఫ్ఏ) విశ్లేషకులు అంచనా వేశారు. పరిస్థితులు అత్యంత క్లిష్టంగా మారితే, జీడీపీ -5 శాతం క్షీణించవచ్చని గతంలో అంచనా వేయగా, తాజాగా మరింత పెంచారు. లాక్‌డౌన్‌ను ఒక నెల పాటు పొడిగిస్తే, ఆర్థిక సంవత్సర వృద్ధిరేటుపై 1 శాతం మేర ప్రభావం పడుతోందని వివరించారు. అన్‌లాక్ తరవాత కొవిడ్ కేసుల సంఖ్య మూడింతలైనందున, లాక్డౌన్ షరతులను సెప్టెంబరు మధ్యవరకు పొడిగించవచ్చని, అక్టోబరు మధ్యలో పూర్తిస్థాయి కార్యకలాపాలు ఆరంభం కావచ్చని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. దాదాపై ధోని పైచేయి!
గంగూలీ, ధోనీల్లో అత్యంత ప్రభావవంతమైన కెప్టెన్ ఎవరంటూ నిర్వహించిన ఓ సర్వేలో 0.4 పాయింట్ల తేడాతో మహీ పైచేయి సాధించాడు. ప్రపంచవ్యాప్తంగా మాజీ ఆటగాళ్లు, పాత్రికేయులు, ప్రసారదార్లతో కూడిన జ్యూరీ ఇచ్చిన పాయింట్ల ఆధారంగా ఈ సర్వే జరిగింది. ప్రతి విభాగంలోనూ వేర్వేరుగా కేటాయించిన పాయింట్లను కలపగా ధోని ముందంజలో నిలిచాడు. గ్రేమ్ స్మిత్, సంగక్కర, గంభీర్, క్రిస్ శ్రీకాంత్ లాంటి మాజీ ఆటగాళ్లు ఈ సర్వేలో పాల్గొన్నారు. స్వదేశంలో టెస్టు విజయాల్లో గంగూలీ (7.4 పాయింట్లు) కంటే ధోని (8.2) ఆధిక్యంలో నిలిచాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. కథ సిద్ధం..
కరోనా పరిస్థితుల కారణంగా సినీ పరిశ్రమలో చిత్రీకరణల సందడి కనిపించనప్పటికీ..కొత్త కథలు సిద్ధం చేసుకోవడంలో దర్శకులు జోరు చూపిస్తూనే ఉన్నారు. ఈ విరామ సమయాన్ని చక్కగా వినియోగించుకొని చకచకా కొత్త స్క్రిప్ట్‌లు పూర్తి చేసేస్తున్నారు. ఇప్పుడు దర్శకుడు బాబీ కూడా అగ్ర కథానాయకుడు చిరంజీవి కోసం ఓ కథ సిద్ధం చేశారు. ఈ కలయికలో ఓ చిత్రం రానుందని చిరంజీవి గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడా ప్రాజెక్టు కోసమే బాబీ కథను పూర్తి చేసినట్లు సమాచారం. చిరు శైలికి తగ్గట్లుగానే వైవిధ్యభరితమైన కథాంశంతో అన్ని రకాల వాణిజ్య హంగులతో ఈ కథను తయారు చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి