close

తాజా వార్తలు

Published : 08/06/2020 01:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇప్పటికైనా మోదీ మాట విన్నారు.. సంతోషం!

ఆర్జేడీకి అమిత్‌షా కౌంటర్‌
వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా బిహార్‌ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం

దిల్లీ: బిహార్‌లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి భాజపా మాజీ జాతీయ అధ్యక్షుడు, హోంమంత్రి అమిత్‌షా శ్రీకారం చుట్టారు. ‘బిహార్‌ సంవధ్‌ ర్యాలీ’ పేరిట వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆదివారం మాట్లాడారు. ఇది ఎన్నికల ర్యాలీ కాదని, దీనికీ బిహార్‌ ఎన్నికలకు సంబంధం లేదంటూనే ప్రతిపక్షాలపై ఆయన విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ హయాంలో సాధించిన ఘనతలను వివరించారు.

‘‘ఇది ఎన్నికల ప్రచారం కాదు.. కొవిడ్‌పై పోరాటంలో ప్రజలతో మమేకం కావడం దీని ఉద్దేశం. ఇలాంటి మరో 75  నిర్వహించనున్నాం. గత 70 ఏళ్లలో స్పృశించని ఎన్నో సమస్యలను రెండోసారి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పరిష్కరించాం. ప్రధాని చేసిన విజ్ఞప్తులను ప్రతిపక్షాలు ధిక్కరించినప్పటికీ.. యావత్‌ దేశం పాటించింది. లాక్‌డౌన్‌ కాలంలో రోడ్లపై వెళ్తున్న వలస కూలీల బాధను చూడలేకే శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశాం. సుమారు 1.25 కోట్ల మంది వలస కూలీలను వారి స్వస్థలాలకు చేర్చాం. అందుకోసం అయ్యే 85 శాతం ఖర్చును కేంద్రమే భరించింది. లాక్‌డౌన్‌ కాలంలో కొవిడ్‌పై పోరుకు వైద్య సదుపాయాలను మెరుగుపర్చుకున్నాం’’ అని షా వివరించారు.

బిహార్‌ సీఎం నితీశ్‌, డిప్యూటీ సీఎం సుశీల్‌ కుమార్‌ మోదీ ప్రజల కోసం పనిచేస్తున్నారని అమిత్‌ షా అన్నారు. ఆర్జేడీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వృద్ధి రేటు 3.9 శాతం ఉండగా.. నితీశ్‌ అధికారంలోకి వచ్చాక 11.3 శాతానికి పెరిగిందన్నారు. రాష్ట్రం లాంతరు (ఆర్జేడీ పార్టీ గుర్తు) రాజ్‌ నుంచి ఎల్‌ఈడీ రాజ్‌కు చేరుకుందని ప్రశంసించారు. నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈ సారి ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజార్టీ సాధిస్తుందని అమిత్‌షా ధీమా వ్యక్తంచేశారు.

తేజస్వికి పంచ్‌..
‘‘కొవిడ్‌-19 వారియర్స్‌కు మద్దతుగా కరతాళ ధ్వనులు చేయాలని ప్రధాని మోదీ సూచించారు. ఇప్పటికైనా వారు మోదీ మాట విన్నందుకు సంతోషంగా ఉంది’’ అంటూ ఆర్జేడీ నిరసనపై అమిత్‌షా తనదైన శైలిలో చురకలంటించారు. ఈ సమావేశానికి ముందు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ నేతృత్వంలో ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఓ వైపు కొవిడ్‌-19తో రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంటే అధికార పార్టీ (జేడీయూ-భాజపా) సంబరాల్లో ఉందంటూ కంచాలు పట్టుకుని స్పూన్లతో శబ్దాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ నిరసనను ఉద్దేశించి ఆయన ఈ విధంగా పంచ్‌ విసిరారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని