
తాజా వార్తలు
6కోట్లు దాటిన వైరస్ కేసులు
ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి విజృంభణ
వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య ఆరు కోట్ల మార్కును దాటగా, 14 లక్షల పైచిలుకు మరణాలు సంభవించాయి. తాజాగా జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించిన వివరాల ప్రకారం..నిన్నటి వరకు 6,08,60,169 మంది వైరస్ బారినపడ్డారు. 14,29,733 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. అగ్రదేశం అమెరికా ఈ వైరస్‌కు తీవ్రంగా ప్రభావితమైంది. అత్యధిక కేసులు(1,28,79,861), మరణాలు(2,63,413) ఆ దేశంలోనే సంభవించాయి. కేసుల పరంగా చూసుకుంటే భారత్ రెండో స్థానంలో ఉంది. ఇప్పటివరకు భారత్ వ్యాప్తంగా 93,09,787 మంది వైరస్ బారిన పడగా..1,35,715 మంది మరణించారు. కాగా, పాజిటివ్ కేసుల సంఖ్యలో మూడో స్థానంలో ఉన్న బ్రెజిల్..మరణాల విషయంలో మాత్రం భారత్ కంటే ముందే ఉంది. ఆ దేశంలో 1.7లక్షల పైచిలుకు మంది మహమ్మారికి బలయ్యారు.
ఇక, 10లక్షలకు పైగా కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో..ఫ్రాన్స్, రష్యా, స్పెయిన్, యూకే, ఇటలీ, అర్జెంటీనా, కొలంబియా, మెక్సికో, జర్మనీ ఉన్నాయి. అలాగే, మెక్సికో, యూకే, ఇటలీ, ఫ్రాన్స్, ఇరాన్, స్పెయిన్, అర్జెంటీనా, రష్యా, కొలంబియా, పెరు, దక్షిణాఫ్రికా దేశాల్లో 20వేలకు పైగా మరణాలు సంభవించాయి.