
తాజా వార్తలు
థియేటర్లోనే అనుష్క సినిమా..!
కోన వెంకట్ స్పష్టత
హైదరాబాద్: అగ్రకథానాయిక అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘నిశ్శబ్దం’ సినిమా విడుదలపై నిర్మాత స్పష్టత ఇచ్చారు. చిత్రాన్ని థియేటర్లోనే విడుదల చేస్తామని చెప్పారు. లాక్డౌన్ కారణంగా థియేటర్లు మూతపడడంతో పలు తమిళ, హిందీ సినిమాలను ఓటీటీల్లో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓటీటీ వేదికగా ‘నిశ్శబ్దం’ చిత్రాన్ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారంటూ వార్తలు వస్తోన్నాయి. ఈ నేపథ్యంలో కోన వెంకట్ రూమర్స్‌పై స్పందిస్తూ ట్వీట్ చేశారు.
‘‘నిశ్శబ్దం’ సినిమా విడుదలపై గత కొన్నిరోజులుగా ఎన్నో వార్తలు వస్తున్నాయి. అలాంటి వార్తలపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను. సినిమాని థియేటర్లో విడుదల చేయడానికే మా మొదటి ప్రాధాన్యం. ఒకవేళ పరిస్థితులు కనుక అనుకూలించకపోతే అప్పుడు మేము ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదల చేస్తాం. అంతా మంచే జరగాలని ఆశిస్తున్నాను.’ అని కోన వెంకట్ పేర్కొన్నారు.
‘భాగమతి’ తర్వాత అనుష్క ‘నిశ్శబ్దం’ చిత్రంలో నటించారు. ఇందులో ఆమె మూగ అమ్మాయిగా కనిపించనున్నారు. మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్, తదితరులు కీలకపాత్రలు పోషించారు. హేమంత్ మధూకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2 విడుదల చేయాలని భావించినప్పటికీ లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది.