close

తాజా వార్తలు

టాప్ 10 న్యూస్‌ @ 9 PM

1. 20న అసెంబ్లీ ముట్టడి: చంద్రబాబు

రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి వెన్నుపోటు పొడిచారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతిని సీఎం జగన్‌ ధ్వంసం చేయాలని చూస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన అమరావతి పరిరక్షణ సమితి ఐకాస ర్యాలీలో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు, ఐకాస నేతలు జోలె పట్టి విరాళాలు సేకరించారు. ఈ నెల 20న అమరావతి ఐకాస ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి చేపట్టనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. భాజపాతో పొత్తుపై పవన్‌ స్పష్టత

భారతీయ జనతా పార్టీతో పొత్తు విషయంలో అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ ప్రశాసన్ నగర్‌లోని పార్టీ కార్యాలయంలో గ్రేటర్ హైదరాబాద్‌లోని ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో వనన్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలు, దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని భాజపాతో పొత్తు కుదుర్చుకున్నామని చెప్పారు. భాజపా అగ్ర నాయకత్వంతో గతంలో పలుమార్లు చర్చలు జరిగాయని పవన్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. రైతుల కంటే నిరుద్యోగుల ఆత్మహత్యలే ఎక్కువ

దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యల కంటే నిరుద్యోగులు, రోజువారీ కూలీల ఆత్మహత్యలే ఎక్కువ అని జాతీయ నేర నమోదు సంస్థ(ఎన్‌సీఆర్‌బీ) గణాంకాలు వెల్లడించాయి. 2018లో సగటున రోజుకు 35 మంది నిరుద్యోగులు, 36 మంది స్వయం ఉపాధి ఉన్న వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడినట్లు పేర్కొంది. 2018లో దేశవ్యాప్తంగా 10,349 మంది వ్యవసాయ రంగానికి చెందిన వ్యక్తులు ఆత్మహత్య చేసుకోగా.. 13,149 మంది స్వయం ఉపాధి గల వ్యక్తులు, 12,936 మంది నిరుద్యోగులు ప్రాణాలు తీసుకున్నట్లు ఎన్‌సీఆర్‌బీ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. 5 ట్రిలియన్‌ డాలర్ల లక్ష్యం కష్టమే కానీ..

2024 నాటికి భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్‌ డాలర్లకు చేర్చాలని పెట్టుకున్న లక్ష్యం కష్టమే అయినప్పటికీ అసాధ్యమైనది మాత్రం కాదని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అభిప్రాయపడ్డారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ 29వ అంతర్జాతీయ సదస్సులో నితిన్‌ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశీయ ఉత్పత్తిని పెంచడం, దిగుమతులపై తక్కువ ఆధారపడటం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించొచ్చని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. సెలక్టర్లు కావలెను: బీసీసీఐ ప్రకటన జారీ

సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌, సభ్యుడు గగన్‌ ఖోడా స్థానంలో కొత్త సెలక్టర్ల కోసం బీసీసీఐ శనివారం దరఖాస్తులు ఆహ్వానించింది. ఎంపికకు సంబంధించిన నిబంధనలు ఖరారు చేసింది. సీనియర్‌తో పాటు మహిళల సెలక్షన్‌ కమిటినీ బోర్డు పూర్తిగా ప్రక్షాళన చేస్తోంది. జూనియర్‌ కమిటీలో మాత్రం రెండు మార్పులు చేస్తోంది. దరఖాస్తు చేసుకొనేందుకు జనవరి 24ను చివరి తేదీగా ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. ప్రజా బ్యాలెట్‌.. అమరావతికే ఓటు

రాజకీయ ఐకాస ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా బ్యాలెట్‌లో రాజధానిగా అమరావతే ఉండాలని ప్రజలు కోరుకున్నారు. గుంటూరు సహా ఉండవల్లిలో శనివారం ప్రజా బ్యాలెట్‌ నిర్వహించారు. ఉండవల్లిలో నిర్వహించిన ప్రజా బ్యాలెట్‌లో రాజధాని అమరావతికి అనుకూలంగా 1632 ఓట్లు వచ్చాయి. అమరావతికి వ్యతిరేకంగా మూడు ఓట్లు మాత్రమే పోలయ్యాయి. గుంటూరులో నిర్వహించిన ప్రజాబ్యాలెట్‌కు అనూహ్య స్పందన వచ్చింది. మొత్తం 4,211 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. అమరావతికి అనుకూలగా 4,193 ఓట్లు పోలవ్వగా.. మూడు రాజధానుల ప్రతిపాదనకు కేవలం 16 ఓట్లు మాత్రమే వచ్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ‘జోలెపట్టిన నిధులు ఏంచేస్తున్నారు’

రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని ఎక్కడికీ తరలించడం లేదని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. కేవలం పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణపైనే అధ్యయనం చేసినట్లు చెప్పారు. విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు. మూడు ప్రాంతాల్లో పాలన ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. రైతులను మోసం చేసింది చంద్రబాబు మాత్రమేనని దుయ్యబట్టారు. రైతును క్షోభ పెట్టిన వారెవరూ బాగుపడలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జోలెపట్టి సేకరించిన నిధులు చంద్రబాబు, ఆయన కుమారుడు ఏం చేస్తున్నారో అర్థం కావటం లేదని శ్రీకాంత్‌ రెడ్డి ధ్వజమెత్తారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. పులివెందులను రాజధాని అంటారేమో: లోకేశ్‌

ప్యాకేజీల పేరుతో రాజధాని రైతులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. రాజధానిపై ఉండవల్లిలో నిర్వహించిన ప్రజా బ్యాలెట్‌ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంటూ ఆరోపణలు చేసిన ప్రభుత్వం ఏం నిరూపించిందని ప్రశ్నించారు. అమరావతి ప్రజలకు జరిగిందే రేపు విశాఖ ప్రజలకూ జరుగుతుందని పేర్కొన్నారు. మరో ఆరు నెలల తర్వాత రాజధానిని పులివెందులలో అన్నా ఆశ్చర్యం లేదని ఎద్దేవాచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. రోడ్డు ప్రమాదంలో షబానా అజ్మీకి తీవ్రగాయాలు

ముంబయి-పుణె ఎక్స్‌ప్రెస్‌ హైవేపై శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ బాలీవుడ్‌ నటి షబానా అజ్మీకి తీవ్ర గాయలయ్యాయి. కోల్హాపూర్‌ టోల్‌ప్లాజా సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ట్రక్కును ఢీ కొట్టింది. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆమెను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆమె భర్త జావేద్‌ అక్తర్‌ కూడా కారులోనే ప్రయాణిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. రజనీకాంత్‌పై కేసు నమోదు

అగ్రకథానాయకుడు రజనీకాంత్‌పై కేసు నమోదయ్యింది. సంఘ సంస్కర్త పెరియార్‌ గురించి రజనీకాంత్‌ తప్పుడు ప్రచారం చేశారంటూ ఓ సంఘం అధ్యక్షుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల చెన్నైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్‌.. 1971లో పెరియార్‌ నిర్వహించిన ర్యాలీలో సీతారాముల విగ్రహాలను అభ్యంతరకరంగా ఊరేగించారని తెలిపారు. దీంతో రజనీకాంత్‌.. పెరియార్‌ గురించి తప్పుడు ఆరోపణలు చేశారంటూ ద్రవిడర్‌ విడుదలై కళగమ్‌ అధ్యక్షుడు మణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.