close

తాజా వార్తలు

Published : 06/08/2020 20:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. చైనా చీమలు కదలినా తెలిసేలా ఉపగ్రహ నిఘా!

దురహంకారపూరిత చైనా కుయుక్తులకు పైఎత్తులు వేసేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. హిమాలయ పర్వత సానువుల్లో డ్రాగన్‌పై పటిష్ఠ నిఘా పెట్టాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ప్రత్యేకంగా 4-6 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిస్తే బాగుంటుందని యోచిస్తోంది. 4000 కిలోమీటర్ల మేర సరిహద్దుల్లోని కొండలు, లోయల్లో కమ్యూనిస్టు చైనా సైనికులు ఒక్క అడుగు ముందుకు వేసినా తెలిసిపోయేలా చర్యలు చేపట్టాలన్నది సైన్యం ఉద్దేశంగా కనిపిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. ప్లాస్మా థెరపీతో ప్రయోజనం కనిపించలేదు: ఎయిమ్స్‌

కరోనా బాధితులపై ప్లాస్మా థెరపీ విధానం పెద్దగా ప్రభావం చూపడం లేదని దిల్లీ ఎయిమ్స్‌ స్పష్టంచేసింది. కొవిడ్‌ రోగులపై నిర్వహించిన ప్లాస్మా చికిత్స ఫలితాల ప్రాథమిక విశ్లేషణలో ఈ విషయం వెల్లడైందని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా తెలిపారు. ప్లాస్మా చికిత్స ఫలితాలను అంచనా వేసేందుకు 15 మంది కొవిడ్‌ రోగులతో కూడిన రెండు బృందాలపై పరిశీలన జరిపినట్టు వెల్లడించారు. అందులో ఒక బృందానికి సాధారణ విధానంలో చికిత్స అందించగా.. మరో 15 మందికి సాధారణ పద్ధతితో పాటు ప్లాస్మా చికిత్సను అందించినట్టు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ‘ఒకట్రెండు రోజుల్లో విద్యా సంవత్సరంపై ప్రకటన’

ఆన్‌లైన్‌ తరగతులు నిషేధించాలని కోరుతూ హైదరాబాద్‌ స్కూల్స్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు వివరణ ఇస్తూ ఆన్‌లైన్‌, దూరవిద్య విధానంలో విద్యా సంవత్సరం ప్రారంభించాలని కేబినెట్‌ నిర్ణయించిందని తెలిపింది. ఒకట్రెండు రోజుల్లో పాఠశాల విద్యా సంవత్సరాన్ని ప్రకటిస్తామని వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. 2 లక్షలకు చేరువలో ఏపీ కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు 2 లక్షలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 63,686 నమూనాలను పరీక్షించగా.. 10,328 కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 1,96,789కి చేరాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 82,166 యాక్టివ్‌ కేసులు ఉండగా.. 1,12,870 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తాజాగా కరోనాతో 72 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 1,753కి చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. దేశ సరిహద్దుల్లో నేపాల్‌ కుయుక్తులు

భారత్‌లోని భూభాగాలు తమవంటూ కొత్త మ్యాప్‌ రూపొందించి వివాదం రాజేసిన నేపాల్.. సరిహద్దుల్లో వివాదాస్పద వైఖరిని కొనసాగిస్తోంది. భారత సరిహద్దుల్లో మూడు హెలిప్యాడ్లను నిర్మిస్తోంది. గండక్‌ నదికి సుమారు రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఈ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రెండు హెలిప్యాడ్లను బిహార్‌ సరిహద్దుల్లో వాల్మీకినగర్‌ సమీపంలోని నరసాహి, త్రివేణిల్లో నిర్మిస్తున్నారు. మరో హెలిప్యాడ్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌ జిల్లా సరిహద్దు నుంచి 10కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉజ్జయిని వద్ద నిర్మిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. ‘హోం ఐసోలేషన్‌ బాధితులను పర్యవేక్షించాలి’

కరోనా చికిత్స విషయంలో కలెక్టర్లు, మంత్రుల సూచనలు తీసుకోవాలని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్‌ ఆస్పత్రి వర్గాలకు సూచించారు. కరోనా చికిత్సల విషయంపై జిల్లా కలెక్టర్లు, వైద్యాధికారుల, ప్రభుత్వాస్పత్రుల సూపరింటెండెంట్లతో మంత్రి ఈటల, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ హోం ఐసోలేషన్‌లో ఉంటున్న కరోనా బాధితులను నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. చిరంజీవిని కలిసిన సోము వీర్రాజు

ప్రముఖ సినీ నటుడు చిరంజీవిని భాజపా ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు సోము వీర్రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. సోము వీర్రాజుతోపాటు ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ నిర్మాత బాబు ఎస్వీ కూడా చిరంజీవిని కలిశారు. ఇటీవల రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా ఎన్నికైన సోము వీర్రాజుకు చిరంజీవి అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో భాజపా, జనసేన భాగస్వామ్యం కావాలని చిరంజీవి కోరారు. పవన్‌ కల్యాణ్‌తో కలిసి సోము వీర్రాజు ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చిరంజీవి ఆకాంక్షించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. ‘మర్డర్‌’: 11లోగా కౌంటర్‌ దాఖలు చేయండి

ప్రముఖ దర్శక, నిర్మాత రాంగోపాల్‌ వర్మ ‘మర్డర్‌’ పేరిట సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. సంచలనం సృష్టించిన  ప్రణయ్‌ పరువు హత్య నేపథ్యంలో ఈ సినిమా తీస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘మర్డర్‌’ సినిమాను ఆపాలంటూ ప్రణయ్‌ భార్య అమృత నల్గొండ జిల్లా కోర్టులో సివిల్‌ దావా దాఖలు చేశారు. దీనిపై నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. దర్శక, నిర్మాతకు కౌంటర్‌ దాఖలు చేసేందుకు ఈ నెల 11 వరకు గడువు ఇచ్చింది. తదుపరి విచారణను ఈనెల 11కు వాయిదా వేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. ప్రొ. కె. నాగేశ్వర్‌కు బెదిరింపు కాల్స్‌

మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌కు బెదిరింపు కాల్స్‌ వచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 25న గుర్తుతెలియని వ్యక్తుల నుంచి నాగేశ్వర్‌కు వరుసగా ఫోన్స్‌ వచ్చాయి. ఇంటర్నెట్‌ వాయిస్‌ బేస్డ్‌ కాల్‌ చేసి చంపుతామని బెదిరించినట్లు సమాచారం. ఈ మేరకు ఆయన గత నెల 25నే హాక్‌ ఐ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. JK కొత్త లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా మనోజ్‌ సిన్హా

జమ్మూకశ్మీర్‌కు కొత్త లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి మనోజ్‌ సిన్హా నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న గిరీష్‌ చంద్ర ముర్ము తన పదవికి బుధవారం రాజీనామా చేయడంతో కొత్త గవర్నర్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గురువారం నియమించారు. 61 ఏళ్ల మనోజ్‌ సిన్హా భాజపాలోని కీలక జాతీయ కౌన్సిల్‌లో సభ్యుడిగా ఉన్నారు. మోదీ తొలి కేబినెట్‌లో కేంద్ర సహాయ మంత్రిగా కూడా సేవలందించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.